ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులకు సంబంధించి ఏ పార్టీలో చేరుతారనే చర్చ డైలీ సీరియల్‌ను తలపిస్తోంది. దీనికి త్వరలో ముగింపు పలకనున్నారు. వాళ్లద్దరితో పాటు మరికొందరు నేతలు కాంగ్రెస్‌లో చేరడానికి నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ముహూర్తం కూడా ఖరారైంది. ఇక కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడం తరువాయి. ఇద్దరు నేతలు బీఆర్ఎస్ నేతలు కావడం గమనార్హం.
పొంగులేటి ఖమ్మం జిల్లాలో, అలాగే జూపల్లి కృష్ణారావు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బలమైన నాయకులు. చాలా కాలంగా ఇద్దరు నేతలు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. పలు సందర్భాల్లో ప్రభుత్వ, అధికార పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. నేరుగా కేసీఆర్‌పైనే విమర్శలు ఎక్కుపెట్టారు. అయితే ఇద్దరు నేతలపై వేటు వేసేందుకు బీఆర్ఎస్ చాలా సమయమే తీసుకుంది. అయినా వాళ్లిద్దరిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో సస్పెన్షన్ వేటు వేసింది.
ముఖ్యంగా ఏ పార్టీలో చేరుతారనే విషయమై పొంగులేటి పెద్ద డ్రామానే క్రియేట్ చేశారు. ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ తన వెంట ఎవరెవరు నడుస్తారో తెలుసుకున్నారు. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తెలంగాణలో కూడా ఆ పార్టీకి ఊపు వచ్చింది. దీంతో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీని కాకుండా కాంగ్రెస్‌ను ఎంచుకోవడం ఆసక్తికర పరిణామంగా చెప్పొచ్చు.
ఇందులో భాగంగానే పొంగులేటి, జూపల్లి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, పిడమర్తి రవి , మేఘారెడ్డి తదితరులంతా కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఇవాళ పొంగులేటితో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమావేశం అయ్యారు. ఈ నెల 30న రాహుల్ లేదా ప్రియాంక సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకునేందుకు నిశ్చయించుకున్నారు. ఈ నెల 22న రాహుల్‌తో కాంగ్రెస్ చేరనున్న నాయకులంతా ఢిల్లీలో భేటీ అయ్యేందుకు వెళ్లనున్నారు. ఖమ్మం, పాలమూరు జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించి పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లో చేరికలకు కసరత్తు చేస్తుండడం విశేషం.