తమిళ హీరో విజయ్ రాజకీయ రంగప్రవేశంపై వచ్చిన కథనాలు, ఊహాగానాలు అన్నీ ఇన్నీ కావు. ఓసారి విజయ్ రాజకీయాల్లోకి వస్తాడని, అతడి తండ్రి ప్రకటిస్తాడు. ఆ వెంటనే విజయ్ వాటిని ఖండిస్తాడు. ఒక దశలో విజయ్, తన తండ్రికి దూరంగా ఉంటున్నాడంటూ వార్తలు వచ్చాయి. మరో టైమ్ లో విజయ్ పార్టీ పెడతాడంటూ గాసిప్స్ వచ్చాయి.
ఇలా విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, తమిళనాట విజయ్ పొలిటికల్ ఎంట్రీ అనేది ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్. ఇలాంటి వ్యక్తి రాజకీయాల గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది? కచ్చితంగా అది సంచలనంగా మారుతుంది. అలాంటి సంచలనమే ఈరోజు జరిగింది.
తమిళనాట నియోజకవర్గాల వారీగా పదో తరగతి, ఇంటర్మీడియట్ లో అత్యథిక మార్కులు సంపాదించిన స్టూడెంట్స్ ను ఈరోజు చెన్నైల సన్మానించాడు విజయ్. వాళ్లకు సర్టిఫికేట్లు, నగదు అందించాడు. ఈ సందర్భంగా మాట్లాడిన విజయ్.. రాజకీయాల్ని టచ్ చేయడం విశేషం.
ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ పూర్తిగా డబ్బుమయం అయిందని వ్యాఖ్యానించాడు విజయ్. డబ్బు తీసుకొని ఓట్లు వేసే పద్ధతి మారాలన్నాడు. విద్యార్థులంతా తమ ఇళ్లకు వెళ్లి, డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయాలని తమ పేరెంట్స్ కు చెప్పాలని కోరాడు. అంతేకాదు, ఈ సందర్భంగా విద్యార్థులపై కూడా రియాక్ట్ అయ్యాడు.
నేటి విద్యార్థులే, రేపటి ఓటర్లుగా మారతారని.. కాబట్టి ఇప్పట్నుంచే రాజకీయాలపై అవగాహన పెంచుకోవాలని కోరాడు. ఎవరు బాగా పనిచేస్తున్నారు, ఎవరు లంచాలు తీసుకుంటున్నారో గమనించాలని.. కాబోయే ఓటర్లంతా మంచి లీడర్లను ఎన్నుకోవాలని అన్నాడు. డబ్బు తీసుకొని ఓట్లు వేస్తే, మన వేలితో మన కంటినే పొడుచుకున్నట్టు అవుతుందని తెలిపాడు.
ఇలా ఉన్నఫలంగా విజయ్, నోటు రాజకీయాల గురించి మాట్లాడ్డం తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. ఈసారి విజయ్ కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాడని, దాని కోసం ఇప్పట్నుంచే వేదిక సిద్ధం చేసుకుంటున్నాడని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.