జనసేనాని వారాహి యాత్రకు జనం పోటెత్తుతున్నారు. రోజురోజుకూ పవన్ యాత్రకు జనం పెద్ద సంఖ్యలో వెళ్లడం జనసేనకు ఊపునిస్తోంది. మరోవైపు యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న నారా లోకేశ్‌కు జనాదరణ అంతంత మాత్రమే. పవన్ యాత్రకు వస్తున్న జనంతో పోల్చితే కనీసం 25 శాతం కూడా లోకేశ్ యాత్రకు రావడం లేదనే టాక్ వినిపిస్తోంది. దీంతో కన్న పుత్రుడి యువగళం కంటే దత్త పుత్రుడి వారాహి యాత్రే చంద్రబాబుకు సంతోషాన్ని ఇస్తోందని వైసీపీ సెటైర్స్ విసురుతోంది.
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర దాదాపు ఐదు నెలలకు చేరింది. అయినప్పటికీ పాదయాత్రకు టీడీపీ అశించిన స్థాయిలో ఆదరణ లభించడం లేదు. అసలు లోకేశ్ పాదయాత్ర జరుగుతోందా? అనే అనుమానాల్ని కలిగిస్తోంది. టీడీపీ అనుకూల మీడియా లోకేశ్‌కు జాకీలు వేస్తూ, ప్రజానాయకుడిగా జనానికి చూపే ప్రయత్నం చేస్తోంది. అంతే తప్ప, లోకేశ్ పాదయాత్రను జనం పెద్దగా గుర్తించడం లేదన్నది వాస్తవం.
టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో జనం బాగా వస్తున్నట్టు కనిపిస్తోంది. ఇంతకాలం లోకేశ్ పాదయాత్ర రాయలసీమలోనే సాగింది. రాయలసీమలో టీడీపీ బలమెంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం మూడంటే మూడే నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపొందింది. ఇటీవల వైసీపీపై కొంత వ్యతిరేకత పెరగడం, అది టీడీపీకి కాస్తా సానుకూలతగా మారింది. అంతకు మించి రాయలసీమలో అద్భుతమైన మార్పులేవీ చోటు చేసుకోలేదు.
ఇక వారాహి యాత్ర విషయానికి వస్తే… పవన్‌కల్యాణ్ తెలివిగా తన సామాజిక వర్గం బలంగా ఉండే ఉభయగోదావరి జిల్లాలో ప్రారంభించారు. కులబలానికి అభిమానుల ఆదరణ తోడు కావడంతో వారాహి యాత్ర అదుర్స్ అనిపిస్తోంది. ఒకవైపు రాత్రిపూట జరుగుతున్న బహిరంగ సభలకు సైతం పవన్ అభిమానులు ఎదురు చూడడం గమనార్హం.
ప్రస్తుతం ఉభయగోదావరి జిల్లాల్లో సాగుతున్న పవన్ యాత్రకు జనం భారీగా వెళ్తుండడం, మరోవైపు లోకేశ్ పాదయాత్రకు పలుచగా ఉండడంతో టీడీపీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకుంది. వారాహి యాత్రకు జనం వెల్లువెత్తడంపై జనసేన శ్రేణులు ఖుషీగా ఉన్నాయి. మరి ఈ జనం ఎంత వరకు తమకు అనుకూలంగా ఓట్లు వేస్తారనేది జనసేనను తొలుస్తున్న ప్రశ్న.