సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం.. !

పౌరహక్కుల నేత, ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశ ద్రోహం కేసులో సీఎం కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. హ‌ర‌గోపాల్‌తో పాటు మ‌రికొంద‌రిపై పెట్టిన ఉపా చ‌ట్టం కింద పెట్టిన‌ కేసుల‌ను ఎత్తివేయాల‌ని డీజీపీ అంజ‌నీకుమార్‌కు ఆదేశించారు.…

పౌరహక్కుల నేత, ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశ ద్రోహం కేసులో సీఎం కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. హ‌ర‌గోపాల్‌తో పాటు మ‌రికొంద‌రిపై పెట్టిన ఉపా చ‌ట్టం కింద పెట్టిన‌ కేసుల‌ను ఎత్తివేయాల‌ని డీజీపీ అంజ‌నీకుమార్‌కు ఆదేశించారు. మావోయిస్టుల పుస్తకాల్లో ప్రొఫెసర్ హరగోపాల్ పేరు ఉందనే కారణంతో ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై ఉపా చ‌ట్టం కింద‌ కేసు నమోదు చేసిన విష‌యం తెలిసిందే.

పీపుల్స్‌ డెమొక్రటిక్‌ మూవ్‌మెంట్‌ (పీడీఎం) అధ్యక్షుడు చంద్రమౌళి బెయిల్ పిటిషన్ సందర్భంగా పోలీసులు ఈ కేసును బయటపెట్టడంతో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు భగ్గుమన్నాయి. హరగోపాల్‌‌ సహా ఇతరులపై వెంటనే కేసును ఉపసంహరించాలని వామపక్ష పార్టీలు కూడా డిమాండ్ చేశాయి. ప్ర‌తిప‌క్షాల ఒత్తిడితో సీఎం కేసీఆర్ వెంటనే హరగోపాల్‌పై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డీజీపీకి ఆదేశించిన‌ట్లు తెలుస్తోంది.

ఈ కేసుపై హ‌ర‌గోపాల్ రెండు రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ.. త‌న‌తో పాటు 152 మందిపై ఉపా చట్టం కింద కేసు పెట్టడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ పెద్దలకు తెలిసి త‌న‌పై కేసు నమోదైందని అనుకోవడం లేదంటూ.. ఇది కొంత మంది పోలీసులు అత్యుత్సాహంతో పెట్టిన కేసుగా భావించారు. తెలంగాణ‌లో మ‌వోయిస్టులే లేర‌న్న డీజీపీ నేను ఎక్క‌డ మ‌వోయిస్టుల‌ను క‌లిశానో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.