జనసేనాని పవన్‌కల్యాణ్‌లో రాజకీయంగా మార్పు కనిపిస్తోందని, అది తమకు వ్యతిరేకంగా వుందని, కావున ప్రచారం తగ్గించాలని ఎల్లో మీడియాకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.
పవన్‌కల్యాణ్ నమ్మదగిన వ్యక్తి కాదని, ఏ క్షణమైనా యూ టర్న్ తీసుకోగల సమర్థుడని చంద్రబాబు పార్టీ ముఖ్య నేతల వద్ద అన్నట్టు తెలిసింది. అందుకే పవన్ విషయంలో అప్రమత్తంగా వుండాలని టీడీపీ కోర్ కమిటీ వద్ద ఆయన అభిప్రాయపడినట్టు సమాచారం.
తనతో పొత్తు లేకపోతే టీడీపీ అధికారంలోకి రాలేదని, మరోసారి జగనే సీఎం అవుతారంటూ బ్లాక్ మెయిల్ చేసి, ఎక్కువ సీట్లు రాబట్టుకునేందుకే పవన్ మైండ్ గేమ్‌కు తెరలేపారని చంద్రబాబు పార్టీ ముఖ్యనేతలతో అన్నట్టు తెలిసింది.
పవన్ డిమాండ్ చేస్తున్నట్టుగా 40-50 సీట్లు ఎక్కడి నుంచి తేవాలని చంద్రబాబు ప్రశ్నించినట్టు తెలిసింది. క్షేత్రస్థాయిలో కనీసం పార్టీ నిర్మాణం చేయకుండా, తమతో పొత్తు పెట్టుకుని బలపడాలని పవన్ చూస్తున్నారని చంద్రబాబు అభిప్రాయపడినట్టు తెలిసిందే. ఇదే జరిగితే టీడీపీ బలహీనపడి అసలుకే ఎసరు వస్తుందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం.
తన డిమాండ్లకు చంద్రబాబు తలొగ్గరనే సంకేతాలు రావడంతో పవన్‌కల్యాణ్ రాజకీయ వైఖరిలో మార్పు వచ్చిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే పిఠాపురం బహిరంగ సభలో తాను మొట్టమొదటి సారిగా సీఎం కావాలని కోరుకుంటున్నట్టు ప్రకటించడాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇదే నినాదాన్ని ఆయన మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్తారని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఇంత కాలం వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వనని, టీడీపీతో పొత్తు పెట్టుకుంటానని, సీఎం వైఎస్ జగన్‌పై ఘాటు విమర్శలు చేస్తుండడంతో పవన్‌కు తమ మీడియా ద్వారా విపరీత ప్రచారం ఇచ్చామని చెబుతున్నారు.
వారాహి యాత్రలో వైఎస్ జగన్‌ను మాత్రమే పవన్ టార్గెట్ చేస్తుండడం, తమ నాయకుడు చంద్రబాబుపై ఒక్క విమర్శ కూడా చేయకపోవడం అంతిమంగా టీడీపీకే నష్టమని ఆ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఎన్నికలు వైఎస్ జగన్ వర్సెస్ పవన్‌కల్యాణ్ అనే రీతిలో సాగే ప్రమాదం వుందని టీడీపీ నేతలు అంటున్నారు.
అందుకే పవన్‌కల్యాణ్‌కు ప్రచారం విషయంలో ఒక్కసారిగా తగ్గించకుండా, క్రమేపీ పూర్తిస్థాయిలో చెక్ పెట్టాలని ఎల్లో మీడియాధిపతులకు బాబు ఆదేశాలు ఇచ్చినట్టు టీడీపీ ముఖ్య నాయకులు చెబుతున్నారు. బాబు ఆదేశాలతోనే తాను సీఎం అవుతాననే అంశంపై ఎల్లో మీడియా తక్కువ చేసి రాయడం, చూపడాన్ని గమనించొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.