జనసేనాని పవన్‌కల్యాణ్‌పై టీడీపీ తీవ్ర ఆగ్రహంతో వుంది. రాజకీయంగా చంద్రబాబు పల్లకీ మోస్తాడని పవన్‌పై టీడీపీ గంపెడు ఆశలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వనని టీడీపీకి అనుకూలంగా ఇంత కాలం పవన్ వ్యాఖ్యానిస్తూ వచ్చారు. తనకు టీడీపీ సీఎం పదవి ఎందుకు ఆఫర్ చేస్తుందని కూడా ఇటీవల పవన్ ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ జగన్‌ను గద్దె దించడమే లక్ష్యమని పవన్ పదేపదే అన్నారు. ఒంటరిగా పోటీ చేసి వీరమరణం పొందలేనని స్పష్టం చేశారు.
ఇలాంటి కామెంట్స్ టీడీపీకి ఎన్నో ఆశలు రేకెత్తించాయి. అంతిమంగా పవన్‌కల్యాణ్ టీడీపీ అధికారంలోకి రావడానికి దోహదం చేస్తారని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భావించారు. అయితే వారాహి యాత్రలో ఆయన స్వరం మారింది. మొదటి రోజు సభతో పోల్చితే, రెండో సభలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేస్‌లో ఉన్నానని పలువురు దేవుళ్ల సాక్షిగా పవన్ చెప్పడం సంచలనం రేకెత్తిస్తోంది. రానున్నది జనసేన ప్రభుత్వమే అని ఆయన ధీమాగా చెబుతున్నారు.
జనసేన ప్రభుత్వం వస్తే వైసీపీ గూండాలు, రౌడీల ఆట కట్టిస్తానని స్ట్రాంగ్ వార్నింగ్‌లు ఇచ్చారు. వైసీపీపై ఘాటు వ్యాఖ్యలు టీడీపీకి ఆనందాన్ని ఇస్తున్నాయి. అయితే తానే సీఎం అవుతానని చెప్పడంపై టీడీపీ ఆగ్రహంతో రగిలిపోతోంది. చంద్రబాబును సీఎం చేయడానికి పవన్ పనికొస్తారనే ఉద్దేశంతో ఇంతకాలం ఆయన్ను మోస్తున్నామని టీడీపీ చెబుతోంది. తాజాగా పవన్ మనసులో ఏమున్నదో అర్థం కావడం లేదని టీడీపీ నేతలు అంటున్నారు.
వైసీపీ వ్యతిరేక ఓట్ల చీలిక, పొత్తుల అంశాలపై పవన్ ఒక్క మాటైనా మాట్లాడకపోవడం… ఆయనలో వచ్చిన రాజకీయ మార్పునకు నిదర్శనంగా చెబుతున్నారు. నిన్న చెప్పిన దానిపై, నేడు నిలకడగా నిలబడలేని మనస్తత్వం పవన్‌ది అని టీడీపీ విమర్శలు చేస్తోంది. క్షేత్రస్థాయిలో తన బలం ఏంటో తెలిసి కూడా ముఖ్యమంత్రి అవుతానని పవన్ ఎలా చెబుతారని టీడీపీ నిలదీస్తోంది.
బీజేపీ సూచనలతోనే మరోసారి జగన్‌ను సీఎం చేసేందుకు పవన్‌కల్యాణ్ కుట్రపూరితంగా ఒంటరిగా బరిలో దిగి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికి సిద్ధమయ్యారనే అనుమానాల్ని టీడీపీ వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ఏపీలో తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలివీ.