ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైన ఆదిపురుష్ పై ట్రోలింగ్స్ నడుస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ లిస్ట్ లోకి భజరంగీ (మన భాషలో ఆంజనేయుడు) చెప్పిన డైలాగ్ కూడా చేరింది. రామాయణం లాంటి ఇతిహాసాన్ని చెబుతూ.. హనుమంతుడికి మాస్ డైలాగ్ ఇవ్వడంపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకీ ఆ డైలాగ్ ఏంటి..?
రావణుడు అపహరించిన సీతను లంక నుంచి తిరిగి తీసుకొచ్చేందుకు సుగ్రీవుని సాయం కోరుతాడు రాముడు. సీత జాడ కనుక్కునేందుకు హనుమంతుడ్ని పంపిస్తాడు. లంకకు వెళ్లిన ఆంజనేయుడు సీత జాడ కనుగొంటాడు. ఈ క్రమంలో రావణుడికి దొరికిపోతాడు.
హనుమంతుడి తోకకు నిప్పు అంటిస్తాడు రావణుడి కొడుకు ఇంద్రజిత్. 'కాలిందా' అని అడుగుతాడు, ఇంకా కాలుతుంది అంటూ గేలి చేస్తాడు. హనుమంతుడు ప్రతిగా స్పందిస్తాడు. “నా తోకకు కట్టిన గుడ్డ నీ బాబుది, దానికి రాసిన చమురు నీ బాబుది, నిప్పు కూడా నీ బాబుదే, కాబట్టి కాలేదీ నీ బాబుకే” అంటూ డైలాగ్ చెబుతాడు భజరంగీ.
ప్రస్తుతం ఈ డైలాగ్ పై తీవ్ర దుమారం చెలరేగుతోంది. రామాయణం లాంటి పవిత్రమైన ఇతిహాసాన్ని చెబుతూ, డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషీర్, ఇంత చీప్ గా ఎలా డైలాగ్స్ రాస్తారంటూ అంతా ఆడిపోసుకుంటున్నారు. దీనిపై మనోజ్ స్పందించాడు. చిన్నప్పుడు అమ్మమ్మ, తనకు ఇలానే రామాయణం చెప్పిందనేది అతడి వాదన..
మాస్ డైలాగ్స్ రాసిన మనోజ్ ఏమంటున్నాడు..?
ఆ డైలాగ్ ను ఉద్దేశపూర్వకంగానే రాశానని అంగీకరించాడు మనోజ్. ఇప్పటితరాన్ని ఆకర్షించాలంటే, రామాయణానికి ఆమాత్రం మార్పులు చేయాల్సిందే అంటున్నాడు. పైగా చిన్నప్పుడు, తన అమ్మమ్మ తనకు ఆ భాషలోనే రామాయణం చెప్పిందంటూ సమర్థించుకుంటున్నాడు.
ఈ క్రమంలో రాముడు, సీత పాత్రలపై కూడా స్పందించాడు. గ్రాంధికం నుంచి అత్యంత సరళమైన భాషలోకి రామాయణాన్ని తీసుకొచ్చే ఉద్దేశంతోనే అలాంటి డైలాగ్స్ రాయాల్సి వచ్చిందన్నాడు. రావణుడి ముందు సీత ఛాలెంజ్ చేసే సన్నివేశంలో, వానర సేనను రాముడు సన్నద్ధం చేసే సందర్భంలో కూడా ఇలాంటి మాస్ డైలాగ్స్ వచ్చాయని, వాటిపై కూడా చర్చించాలని అంటున్నాడు.