తెలుగు సినిమా మొత్తం ఇప్పుడు నాన్ థియేటర్ ఆదాయం చుట్టూ తిరుగుతోంది. ఒకప్పుడు కేవలం థియేటర్ ఆదాయం మీదనే వున్నపుడు ఏడాదికి వంద సినిమాలు వచ్చేవి. సక్సెస్ కనీసం యాభై శాతానికి పైగా వుండేది. నిర్మాతలు నిలదొక్కుకునే శాతం 75శాతానికి పైగానే వుండేది. ఆ పైన శాటిలైట్ ఆదాయం వచ్చింది. పైగా శాటిలైట్ విధానం వల్ల సినిమాకు ఏ ఎఫెక్ట్ పడలేదు. ఓ మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో సినిమాను టీవీ లో ప్రదర్శించడం అనేది వుండేది. శాటిలైట్ ఆదాయాన్ని కూడా చానెళ్ల సాయంతో మేనేజ్ చేసి, హీరోల రెమ్యూనిరేషన్ పెంచిన వ్యవహారాలు మాత్రం జరిగాయి. వాళ్లవే చానెళ్లు..వాళ్లు రేటు ఇవ్వడం, దాంతో హీరోల మార్కెట్ పెరిగినట్ల కనిపించడం, ఆపై రెమ్యూనిరేషన్లు పెరగడం.
కానీ మొత్తం మీద థియేటర్ సినిమా మాత్రం ఎఫెక్ట్ కాలేదు. థియేటర్ మార్కెట్ సేల్ మీద ఎలాంటి భారం పడలేదు.
తరువాత సినిమాకు వచ్చిన అదనపు ఆదాయం హిందీ మార్కెట్. హిందీ డబ్బింగ్, శాటిలైట్ ఆదాయం. ఇది సినిమా రూపు రేఖలు కొంత మార్చింది. హిందీ శాటిలైట్, డబ్బింగ్ కోసం సినిమా కథలో మార్పులు, చేర్పులు చేయడం ప్రారంభమైంది. ఫైట్లు యాడ్ చేయడం అన్నది కంపల్సరీ అయింది. యాక్షన్ సినిమాలకు హిందీ మార్కెట్ ఎక్కువ వుండడంతో, అలాంటి సినిమాల ప్లానింగ్, అలాంటి హీరోలకు చాన్స్ లు అన్న ట్రెండ్ మొదలైంది. రవితేజ, గోపీచంద్, బెల్లంకొండ లాంటి హీరోల సినిమాలు తెలుగు థియేటర్ లో ఫ్లాప్ అయినా హిందీ మార్కెట్ బాగుంటుంది అనే టాక్ మొదలైంది. ఆ విధంగా థియేటర్ మార్కెట్ అంతగా లేని హీరోలకు కూడా సినిమాలు వరుసగా రావడం మొదలైంది.
కానీ మొత్తం మీద థియేటర్ సినిమా మాత్రం ఎఫెక్ట్ కాలేదు. ఎందుకంటే థియేటర్ మీద ఎలాంటి భారం పడలేదు.
ఇప్పుడు ఓటిటి ఆదాయం మొదలైంది. కానీ దీని తీరుతెన్నులు మాత్రం చిత్రంగా వున్నాయి. ఇది వస్తూనే ముందుగా శాటిలైట్ ఆదాయాన్ని చంపేసింది. ఇప్పుడు సినిమాలకు శాటిలైట్ ఆదాయం గణనీయంగా తగ్గించేసింది. కానీ ఈ విషయాన్ని హీరోలు అస్సలు పట్టించుకోవడం లేదు. పెరిగిన హిందీ డబ్బింగ్, ఓటిటి ఆదాయాన్ని మాత్రమే చూస్తున్నారు.
ఇలా చూడడం వల్ల రెండు సమస్యలు వస్తున్నాయి. ఒకటి డబ్బులు వస్తున్నాయి కనుక సినిమా మీద ఖర్చు చేయమనే ధోరణి పెరిగింది. నిజానికి నాన్ థియేటర్ ఆదాయం పెరగడం వల్ల కొన్ని సినిమాలకు పాతిక ముఫై కోట్ల లాభం వచ్చే పరిస్థితి వుండి కూడా, చివరకు ఒకటి రెండు కోట్ల లాభంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. దసరా, రామబాణం లాంటి సినిమాలు ఇలాంటి వ్యవహారానికి క్లాసిక్ ఎగ్జాంపుల్. ప్రతి సినిమాకు హీరోలు కాస్త భారీగానే ఖర్చు చేయిస్తున్నారు. దాంతో పాటు తమ రెమ్యూనిరేషన్ పెంచుకుంటూ పోతున్నారు.
ఇప్పుడు ఓటిటి లేదా నాన్ థియేటర్ మీద మిడ్ రేంజ్ నుంచి టాప్ రేంజ్ సినిమాల పరిస్థితి చూసుకుంటే 30 నుంచి 100 కోట్ల ఆదాయం వస్తోంది. కానీ అదే మిడ్ రేంజ్ సినిమా ఒకప్పుడు 30 కోట్లలో పూర్తయితే ఇప్పుడు 50 కోట్లు అవుతోంది. టాప్ రేంజ్ సినిమా 70 నుంచి 80 కోట్లలో పూర్తయితే ఇప్పుడు 120 నుంచి 150 కోట్లు అవుతోంది.
అంటే ఇంత ఆదాయం వస్తున్నా థియేటర్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి మారడం లేదు. నిర్మాణ వ్యయం, రెమ్యూనిరేషన్లు సమాంతరంగా భారీగా పెరగడమే ఈ పరిస్థితికి కారణం అని అందరూ అంగీకరిస్తారు. కానీ పోటీలు పడి నిర్మాణాలు చేస్తుండడంతో, వీటిని కంట్రోలు చేయడం అన్నది ఎవరి చేతిలో వుండడం లేదు.
ఎప్పుడయితే థియేటర్ మీద బర్డెన్ పడుతోందో, భారీ రేట్లకు అమ్మడం అన్నది తప్పడం లేదు. అక్కడ కూడా బయ్యర్లు పోటీ పడుతుండడంతో రేట్లు పలుకుతున్నాయి. కానీ అక్కడే అసలు సమస్య వస్తోంది. సినిమాలు బాగున్నాయి, హిట్ అనిపించుకున్నా కూడా బయ్యర్లు రికవరీ కావడం లేదు. పేరుకు హిట్..హిట్ అని ప్రచారం జరిగిపోతోంది. కానీ గ్రౌండ్ రియాల్టీ ఏమిటంటే నిర్మాత కొంతలో కొంత బయటపడుతున్నారు. లేదా ప్రమాదం తృటిలో తప్పించుకుంటున్నారు. కానీ బయ్యర్లు పోతున్నారు. ఒక్కో ఏరియాలో రాను రాను బయ్యర్ల సంఖ్య తగ్గిపోతోంది.
‘’..అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు ఆ తరువాత అఖండ..వాల్తేర్ వీరయ్య (రీజనబుల్ రేట్ల వల్ల) తరువాత ఆంధ్ర ఏరియాలో బయ్యర్లు సంతృప్తిగా డబ్బులు తిన్నది లేదు..అందుకే ఆంధ్ర బయ్యర్లు అంతా కలిసి ఓ ప్రెస్ మీట్ పెట్టి పరిస్థితి వివరించాలనుకుంటున్నాం. మీడియాలో హిట్ అనిపించుకున్న సినిమాల వల్ల కూడా మా బయ్యర్లకు ప్రయోజనం లేకపోయింది….’’ అంటూ ఫోన్ లో పరిస్థితి వివరించిన ఓ ఆంధ్ర బయ్యర్.
‘మీ మీడియా హిట్ అని చెబుతున్న సినిమాల పేర్లు చెప్పండి, ఏ ఏరియాలో ఏ బయ్యర్ ఎంత నష్టపోయాడో మేం వివరిస్తాం. ఆర్ఆర్ఆర్ లాంటి వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ కూడా ఆంధ్ర బయ్యర్లకు నష్టాల మిగిల్చింది..’’ అంటూ వివరించారు ఆ బయ్యర్.
ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇందులో బయ్యర్లు తప్పు ఎంత వుంది? అన్న డిస్కషన్ వుండనే వుంది. కానీ అసలు పాయింట్ వేరే వుంది. రీజనబుల్ రేట్లకు అమ్మి వుంటే బయ్యర్లు బాగుండేవారు. నిర్మాతలకు ఓవర్ ఫ్లోస్ వచ్చి వుండేవి. కానీ అలా చేస్తే తమ పెట్టుబడి రికవరీ కాదు కనుక బయ్యర్ల దగ్గర నుంచి భారీ రేట్లు తీసుకోవాల్సి వస్తోంది. ఇదే కనుక హీరోలు రీజనబుల్ గా తీసుకుని, నిర్మాణ వ్యయం కంట్రోలు చేసి వుంటే, ముందుగానే లాభాలు వచ్చి వుండేవి. లేదా థియేటర్ల మీద భారం తగ్గి వుండేది.
ఇవి అన్నీ నిర్మాతలకు తెలిసినవే. కానీ వాళ్ల చేతిలో ఏదీ లేదు. పది కోట్లలో తీస్తాం అనుకుంటూ దిగిన సినిమాలు కూడా పదిహేను కోట్లకు చేరిపోతున్నాయి. చూస్తూ చూస్తూ సగంలో సినిమా ఆపితే మొత్తం పోతుంది కనుక పెదవి బిగబట్టి భరిస్తున్నారు.
ఇక్కడ ఇంకో గమ్మత్తు కూడా వుంది. ఓ సినిమాకు ఇంత ఖర్చు అయిందని ఓ మీడియాలో ఓ వార్త వస్తుంది. దర్శకుడు ఓవర్ గా ఖర్చు చేయిస్తున్నాడని వార్తలు వినిపించడం మొదలవుతుంది. దాంతో ఆ దర్శకుడి పీఆర్ టీమ్ రంగంలోకి దిగిపోతుంది. కౌంటర్ వార్తలు రావడం ప్రారంభవుతాయి. అక్కడితో మళ్లీ ఖర్చు మామాలే.
ఒకప్పుడు సినిమాకే పీఆర్ టీమ్ వుండేది. తరువాత హీరోలకు వచ్చాయి. ఇప్పుడు దర్శకులకు కూడా పీఆర్ టీమ్ లు వచ్చేసాయి. అందువల్ల కాస్ట్ ఫెయిల్యూర్ సినిమాలు కూడా హిట్ సినిమాలుగా మారిపోతున్నాయి. ఒక మీడియా కాస్ట్ ఫెయిల్యూర్ అని రాస్తే వెంటనే కాదు అంటూ కౌంటర్ వార్తలు వచ్చేస్తాయి. ఫ్యాన్స్ ఎవరికి అనుకూలమైనవి వారు ప్రచారం చేసుకుంటారు.
మొత్తం మీద సినిమా హిట్/యావరేజ్/ఫ్లాప్ లేదా కాస్ట్ ఫెయిల్యూర్ అన్నది ఎవరికీ తెలియకుండా పోతుంది. ఒక్క డిజాస్టర్లు మాత్రమే కౌంట్ లోకి వస్తాయి.
లాభాల్లో వాటా అనే కాన్సెప్ట్ ఒకటి వుంది. ఇది కూడా పెద్ద అనుమానమే. ఓ మిడ్ రేంజ్ హీరో ఓ సినిమా లాభాల్లో వాటా పద్దతిన చేసారు. సినిమాకు మాంచి అప్లాజ్ వచ్చింది. కానీ వాస్తవానికి థియేటర్లలో ఫ్లాప్. లాభాల లెక్కలు చూస్తే హీరో రెమ్యూనిరేషన్ కన్నా రెండు కోట్లు తక్కువ పడింది. దాంతో నిర్మాత మౌనంగా ఆ రెండు కోట్లు కలిపి ఇవ్వాల్సి వచ్చింది. పైగా థియేటర్ లాస్ లు కవర్ చేయాల్సి వచ్చింది. కానీ బయట ప్రచారం హీరో లాభాల్లో వాటా పద్దతిన చేసాడు. అందరూ అలా చేయాలి అంటూ.
ఇక్కడ ఇంకో గమ్మత్తు కూడా వుంది. కొందరు హీరోలు కావాలని బ్యానర్లు యాడ్ చేస్తున్నారు. నిజానికి నిర్మాణ వ్యయం లో భాగం భరించేది లేదు. నష్టాలు షేర్ చేసుకునేదీ లేదు. ఇదంతా కేవలం ఐవాష్ మాత్రమే. అది నిర్మాతలకు తెలిసిన సంగతే. కానీ పైకి ఏమీ చెప్పరు. అలా భరించాల్సిందే.
మొత్తం మీద ఇప్పుడు టాలీవుడ్ వ్యవహారం బయ్యర్ల వ్యవస్థను చంపేసే దిశగా వెళ్తోంది. ఇలా జరిగితే నిర్మాతలకు చాలా కష్టం అవుతుంది. నేరుగా విడుదల చేస్తే నష్టాలు అన్నీ నిర్మాతల ఖాతాల్లోకి వెళ్తాయి. అప్పుడు రాను రాను నిర్మాతలు కూడా తగ్గిపోయే ప్రమాదం వుంది. కేవలం కొన్ని బ్యానర్లు, కొన్ని సంస్థలు మాత్రం తట్టుకుని మిగుల్తాయి. ఇప్పుడు తమిళనాడులో పరిస్థితి ఇదే.
ఈ పరిస్థితి మారకుండా వుండేందుకు ఎవరూ చేసేది ఏమీ లేదు. ఎందుకంటే ఎవరి చేతుల్లో ఏమీ లేదు. నిర్మాతలు పోటీ పడుతున్నంతకాలం ఇది ఇలా సాగుతూనే వుంటుంది.