ప్రొ.కోదండరాం అస్తిత్వాన్ని కోల్పోబోతున్నారా?

రాజకీయం అనేది పులిస్వారీ లాంటిది. పులిమీదకు ఎక్కి అప్రమత్తంగా ఉంటూ ఎంతో దూరం ప్రయాణం సాగించవచ్చు గాక.. కానీ ఒక్క క్షణం ఏమరుపాటుగా ఉన్నామంటే, ఒక్క క్షణం రెప్పవేశామంటే.. పులి తినేస్తుంది. అక్కడితో కథ…

రాజకీయం అనేది పులిస్వారీ లాంటిది. పులిమీదకు ఎక్కి అప్రమత్తంగా ఉంటూ ఎంతో దూరం ప్రయాణం సాగించవచ్చు గాక.. కానీ ఒక్క క్షణం ఏమరుపాటుగా ఉన్నామంటే, ఒక్క క్షణం రెప్పవేశామంటే.. పులి తినేస్తుంది. అక్కడితో కథ ముగుస్తుంది. 

ఒక్క నిర్ణయం పొరబాటుగా తీసుకుంటే చాలు.. అది చరిత్రలో మన స్థానాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తుంది. ఈ సంగతి తెలంగాణ వర్తమాన మేధావుల్లో ఒకరైన ప్రొఫెసర్ కోదండరాం కు తెలియని సంగతి కాదు. ప్రస్తుత పరిణామాలు కాంగ్రెస్ వ్యూహాలను గమనిస్తోంటే.. కోదండరాం కూడా ఏమైనా తేడా నిర్ణయం తీసుకుంటే తన అస్తిత్వాన్ని పూర్తిగా కోల్పోబోతున్నారా? అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది.

తెలంగాణ సాధన కోసం పోరాటం జరుగుతున్న రోజుల్లో కేసీఆర్ కంటె ప్రముఖంగా వార్తల్లో నిలిచిన వ్యక్తి కోదండరాం. కేసీఆర్ పోకడలు రాజకీయ ప్రయోజనాలు ఆశించి సాగుతూ ఉండగా..ఆయనతో జట్టుకట్టి పోరాడడానికి ఇతర పార్టీలు ప్రజాసంఘాలు విముఖంగా ఉన్న పరిస్థితి అప్పట్లో ఉంది. అలాంటిది.. తెలంగాణ కోసం అందరినీ ఒక్కటిచేసి జేఏసీకి సారథ్యం వహిస్తూ పాలకుల్లో కదలిక తీసుకురావడంలో ప్రొఫెసర్ కోదండరాం పాత్ర కీలకం. ఆయనే లేకపోతే తెలంగాణ సాధన ఇంకా ఎంత కాలం పట్టేదో చెప్పలేం. తెలంగాణ నఅనేది జేఏసీ పోరాటాల వల్ల మాత్రమే వచ్చింది.

అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా ప్రొఫెసర్ కోదండరాంను పక్కన పెట్టారు. కనీస ప్రాధాన్యం కూడా ఇవ్వలేదు. దీంతో అలకపూనిన కోదండరాం రిటైరైన తరువాత తెలంగాణ జనసమితి పేరుతో సొంత పార్టీ పెట్టుకున్నారు. రైతు సమస్యలకోసం ప్రధానంగా పోరాడుతాం అని ప్రకటించారు. కానీ ఆయన పార్టీకి ప్రజాదరణ దక్కలేదు. కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకుని ఎన్నికల్లో దిగిన సందర్భాల్లో తల బొప్పి కట్టిందే తప్ప ప్రయోజనం లభించలేదు. కాంగ్రెస్ నాయకులు పెద్దగా సహకరించలేదు. కోదండరాం కూడా అతిశయాలకు వెళ్లకుండా మిన్నకుండిపోయారు.

అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరో మంత్రాంగం నడుపుతున్నట్టుంది. తాజాగా జూపల్లిని పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించడానికి ఆయన ఇంటికి వెళ్లిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, అక్కడకు కోదండరాంను కూడా పిలిపించి మాట్లాడారు. తెజస పార్టీని కాంగ్రెసులో విలీనం చేయాల్సిందిగా ప్రతిపాదించినట్టు సంపత్ చెప్పారు. పార్టీలో అందరితో చర్చించి గానీ ఏ సంగతి చెప్పలేనని కోదండరాం అన్నట్టుగా ఆయన వెల్లడించారు. అయితే కాంగ్రెస్ లో తెజస విలీనం అనేది కోదండరాంకు ఆత్మహత్యా సదృశం అవుతుందా అనేది ఆలోచించాల్సిన విషయం. 

ఎందుకంటే.. ఈ విలీనం ద్వారా ఆయన సాధించేది తన పార్టీలోని వారికి కొన్ని టికెట్లు తప్ప మరేం కాదు. కానీ, కోదండరాం పోటీచేసే చోట కాంగ్రెసు పార్టీ వారు సహకరిస్తారనే గ్యారంటీ లేదు. ఆయనను ఓడించడానికే వారు ప్రయత్నిస్తారు. అదే జరిగితే.. కోదండరాం అస్తిత్వం సంగతేమిటి? కాంగ్రెసు పార్టీలో కనీసం ఆయనను ఒక సీనియర్ నాయకుడిగా, పార్టీ మేధావిగా అయినా గుర్తిస్తారా? అది జరిగే పని కాదు. 

తెజస సారథిగా కనీసం తనకు నచ్చిన నిర్ణయాలు తీసుకోవడానికి, నచ్చిన ప్రజా సమస్యలపై మాట్లాడడానికి అయినా కోదండరాంకు స్వేచ్ఛ ఉంది. కాంగ్రెసులో విలీనం చేస్తే ఆ స్వేచ్ఛను కూడా కోల్పోతారు. అధికారపదవులకు గ్యారంటీ లేదు. ఇలాంటి సమయంలో కోదండరాం ఏం నిర్ణయం తీసుకుంటారో మరి!