ఎమ్బీయస్ : ఆయుష్షులోనూ దిలీప్‌కి జోడీ – కామినీ కౌశల్

భారతీయ నటుల్లో అందరి కంటె ఆయుర్దాయం వున్నవాడు దిలీప్ కుమార్. మొన్న డిసెంబరు 11 నాటికి 98 ఏళ్లు నిండాయి. అతని భార్య, నటీమణి సైరా బాను అతని కంటె 22 ఏళ్లు చిన్నది.…

భారతీయ నటుల్లో అందరి కంటె ఆయుర్దాయం వున్నవాడు దిలీప్ కుమార్. మొన్న డిసెంబరు 11 నాటికి 98 ఏళ్లు నిండాయి. అతని భార్య, నటీమణి సైరా బాను అతని కంటె 22 ఏళ్లు చిన్నది. ఆమె తన కంటె 15 ఏళ్లు పెద్దవాడైన రాజేంద్ర కుమార్‌ను పెళ్లాడదామనుకుంది కానీ కుదరలేదు. రాజేంద్ర కుమార్ 70 ఏళ్లకే పోయాడు. అతనే కాదు, దిలీప్‌తో బాటు రంగప్రవేశం చేసిన నటులందరూ కాలం చేశారు. 

అతని పక్కన హీరోయిన్‌గా వేసినవారూ (సైరా తల్లి నసీం కూడా వారిలో ఒకరు) గతించారు. అయితే ఆయుష్షులో అతనితో పోటీ పడుతూ వస్తున్న హీరోయిన్ కామినీ కౌశల్. మొన్న జనవరి 16న 94 పూర్తి చేసుకుంది. దిలీప్, కామినీ తెర మీద రొమాంటిక్ జంటగా వెలగడమే కాదు, నిజజీవితంలో కూడా ప్రేమికులుగా కొంతకాలం వున్నారు.

కామినీ కౌశల్ అసలు పేరు ఉమా కాశ్యప్. లాహోర్‌లో పుట్టింది. ఆమె తండ్రి ప్రొఫెసర్ శివరామ్ కాశ్యప్ బోటనీలో చాలా పెద్ద ప్రొఫెసర్. 50 పుస్తకాలు రాశారు. రాయ్ బహదూర్ బిరుదాంకితులు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌కు ప్రెసిడెంటు. ఈమెకు ఏడేళ్లుండగా మరణించారు. విద్యావంతుల కుటుంబంలో పుట్టడమే కాదు, స్వయంగా మేధావి. బిఏ ఆనర్స్ (ఇంగ్లీషు) చదివింది. చిన్నపుడే రేడియోలో నాటకాలు వేసేది. కాలేజీ రోజుల్లో స్టేజి మీద వేసేది. దేవ్ ఆనంద్ అన్న చేతన్ ఆనంద్ డూన్ కాలేజీలో ప్రొఫెసర్‌గా వుండేవాడు. 

ఈమె అన్నకు స్నేహితుడు. చేతన్ భార్య ఉమ ఈమెతో బాటు కాలేజీలో చదివింది. ఆ పరిచయంతో చేతన్ తీసిన ‘‘నీచా నగర్’’ (1946) అనే ఆఫ్‌బీట్ సినిమాలో హీరోయిన్‌గా సరదాగా నటించింది. చేతన్ భార్య పేరు కూడా ఉమ కావడంతో ‘నీ పేరు కామినీ కౌశల్ అని మార్చుకో’ అని ఆమె సూచించింది. లాహోర్‌లో వుంటూనే ఆ సినిమా కోసం బొంబాయి వచ్చి వెళుతూ వుండేది. ఆ సినిమా కేన్స్ అంతర్జాతీయ చలనచిత్ర్సోత్సవంలో అవార్డు గెలిచింది.

ఇంతలో 1947లో ఓ కారు యాక్సిడెంటులో ఆమె అక్క చనిపోయింది. ఆమెకు యిద్దరు కూతుళ్లు. చీఫ్ ఇంజనియర్‌గా పనిచేస్తున్న బావగారు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పిల్లల గతి ఏమవుతుందోనని భయపడి, కుటుంబసభ్యులు బావగార్ని పెళ్లి చేసుకోమని కామినిని కోరారు. అమె సరేనంది. భర్త బిఎస్ సూద్‌కు బొంబాయి పోర్టులో ఉద్యోగం రావడంతో కాపురం మార్చేసింది. వాళ్లు ఒక పెద్ద బంగళాలో నివసించేవారు. 

భర్తకు అభ్యంతరం లేకపోవడంతో, సినిమా నుంచి ఆఫర్లు రావడంతో, భరతనాట్యం కూడా నేర్చుకుని సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. అలా ఆమె 17 ఏళ్ల పాటు హీరోయిన్‌గా అనేక హిట్ సినిమాల్లో నటించింది. ఆమె హీరోల్లో దిలీప్, రాజ్ కపూర్, దేవ్ ఆనంద్, అశోక్ కుమార్, రాజ్ కుమార్.. యిలా ఎందరో ప్రముఖులున్నారు. ‘‘గోదాన్’’ (1963) హీరోయిన్‌గా ఆమె ఆఖరి చిత్రం.

హీరోయిన్ వేషాలు తగ్గిన సమయంలో మనోజ్ కుమార్ వచ్చి ‘‘భగత్ సింగ్ కథ ఆధారంగా షహీద్ (1965) సినిమా తీస్తున్నాను. నాది భగత్ సింగ్ పాత్ర. నా తల్లి పాత్ర నువ్వు వేయాలి.’’ అని అడిగాడు. ‘‘నేను నీకంటె పదేళ్లు మాత్రమే పెద్ద. నీ తల్లిగా వేయడమేమిటి?’’ అని యీమె నిరాకరించింది. ఆర్నెల్లపాటు బతిమాలగా సరేనంది. 

సినిమా తయారయ్యాక ప్రివ్యూకి వచ్చిన భగత్ సింగ్ తల్లి వచ్చి ‘నా పాత్ర చక్కగా పోషించారు.’ అని మెచ్చుకున్నపుడు ‘ధన్యోస్మి’ అనుకుంది. ఆ తర్వాత మనోజ్‌కు తల్లిగా ఏడు సినిమాల్లో వేసింది. అతనికే కాదు, రాజేశ్ ఖన్నాకు, సంజీవ్ కుమార్‌కు కూడా వదినగా, తల్లిగా వేసింది. తల్లి పాత్రల్లో రాణిస్తూనే ‘‘అన్‌హోనీ’’ (1973) సినిమాలో హంతకురాలి పాత్రలో వేసింది.  

ఆమెకు హీరోయిన్‌గా రాణించే రోజుల్లోనే దిలీప్ కూడా భగ్నప్రేమికుడి పాత్రల్లో చాలా పేరు తెచ్చుకున్నాడు. ఇద్దరూ కలిసి నటించిన ‘‘షహీద్’’ (1948), ‘‘నదియా కే పార్’’ (1949), ‘‘శబ్నమ్’’ (1949) వంటి సినిమాలు సూపర్ హిట్. దిలీప్ అంటే చాలామంది హీరోయిన్లు మనసు పడ్డారు కానీ తను ప్రేమించిన మొదటి హీరోయిన్ కామినీయేనని జీవిత చరిత్రలో చెప్పుకున్నాడు కూడా. కామినీ కూడా దిలీప్‌ను ప్రేమించింది. 

ఇద్దరూ కలిసి బొంబాయి లోకల్ రైల్లో ఒక టెర్మినస్ నుంచి మరో టెర్మినస్ వరకు తిరుగుతూ కబుర్లు చెప్పుకునేవారు. 1940లలో కాబట్టి అది కుదిరింది. అయితే ఆమె వివాహం వాళ్ల ప్రేమకు అవరోధంగా నిలిచింది. బావగారిని, అక్క పిల్లల్ని వాళ్ల మానాన వాళ్లను వదిలేసి తన దారి చూసుకోవడానికి ఆమె సిద్ధపడలేదు. కుటుంబం కూడా ఆమోదించలేదు. 

మిలటరీలో వుండే ఆమె సోదరుడు ‘‘పగ్‌డీ’’ (1949) సినిమా సెట్స్ మీదకు తుపాకీ పట్టుకుని వచ్చి దిలీప్‌ను కాల్చేస్తానని బెదిరించాడు. ఈ టెన్షన్లు భరించలేక ‘‘ఆర్జూ’’ (1950) సినిమా షూటింగు సమయంలోనే ఆమె తన ప్రేమకు ముగింపు పలికింది. అదే వారిద్దరూ కలిసి వేసిన చివరి సినిమా. భర్త ద్వారా ఆమెకు ముగ్గురు కొడుకులు పుట్టారు.

ఈమె ప్రేమ ఆధారంగా బిఆర్ చోప్డా ‘‘గుమ్రాహ్’’ (1963) కథ రూపొందించాడు. ఒక వూళ్లో కాలేజీలో చదివే ఓ అమ్మాయి, తనతో పాటు చదివే అబ్బాయిని ప్రేమిస్తుంది. ఇంతలో అక్క చనిపోవడంతో, ఆమె పిల్లల కోసం సిటీలో బారిస్టరుగా పనిచేస్తున్న బావగారిని కుటుంబం కోరికపై పెళ్లాడవలసి వస్తుంది. ఆమె ప్రేమను మర్చిపోలేని ప్రియుడు సిటీకి వచ్చి ఆమెను కలుస్తాడు. పాటలు పాడే ఛాన్సు కోసం ప్రయత్నిస్తూ వుంటాడు. ఈమె వద్దవద్దనుకుంటూనే అతనికి సన్నిహితమౌతుంది. వెళ్లి అతని గదిలో కలిసి వస్తూంటుంది. 

తప్పు చేస్తున్నానన్న జంకుతో ఎంతో ఒత్తిడికి, బ్లాక్‌మెయిల్‌కు గురవుతుంది. చివరకు ఇల్లు విడిచి, ప్రియుడితో వెళ్లిపోవడానికి సిద్ధపడుతుంది, కానీ ఆఖరి నిమిషంలో యీ విషయాలన్నీ తన భర్తకు ముందే తెలుసని గ్రహించి, అతని ఔన్నత్యాన్ని మన్నించి, యిల్లాలిగా స్థిరపడడానికే నిశ్చయించుకుంటుంది. చోప్డా యీ సినిమాలో నాయకి పాత్ర మాలా సిన్హాకు, భర్త పాత్ర అశోక్ కుమార్‌కు యిచ్చి, ప్రియుడి పాత్ర వేయమని దిలీప్‌ను అడిగాడు. అతను ఒప్పుకోకపోవడంతో సునీల్ దత్‌కు యిచ్చాడు.

కామినీ కౌశల్ వేషం వేసిన ఆఖరి సినిమా ‘‘చోరీ చోరీ’’ (2003). అప్పటికి ఆమె వయసు 76. అంటే ఆమె తెరవయసు దాదాపు 60 ఏళ్లు. సినిమాలతో పాటు, టీవీ సీరియళ్లలో కూడా నటిస్తూ చాలాకాలం చురుగ్గా వుంది. సినిమాలు నిర్మించింది. ‘‘పరాగ్’’ అనే ఒక హిందీ పత్రికకు చిన్న పిల్లల కోసం కథలు రాస్తూండేది. వాటిని తోలుబొమ్మలాటగా మలిచి, తన కొడుకులతో కలిసి టీవీ సీరియళ్లు నిర్మించింది.

ఆ తోలుబొమ్మలను తనే స్వయంగా తయారుచేసింది. ‘‘మేరీ పరీ’’ అనే యానిమేషన్ సినిమా తీసింది. ‘‘జ్యూవల్ ఇన్ ద క్రౌన్’’ (1984) అనే బ్రిటిష్ టీవీ సీరియల్‌లో కూడా నటించింది. ఫిల్మ్‌స్ డివిజన్ వారికై 40 ని.ల షార్ట్ ఫిల్మ్‌ ఒకదాన్ని డైరక్టు చేసింది. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్యానెల్‌లో సభ్యురాలిగా వుంది. జయ భాదురి, శత్రుఘ్న సిన్హా, ఆస్రానీ, రెహనా సుల్తానాలను సెలక్టు చేయడంలో ఈవిడ పాత్రా వుంది. ఆమె నిండు నూరేళ్లూ జీవించాలని ఆశిద్దాం.

– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2021)
[email protected]