మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇపుడు ఏ పార్టీలో ఉన్నారు. మీడియా ఆయన్ని ఇదే విషయం అడిగితే ఆయన ఇచ్చే సమాధానం కూడా చిత్రంగా ఉంటోంది.
తాను పార్టీ మారితే ముందుగా మీడియాకే చెబుతాను అని. మరి ఉన్న పార్టీలో కొనసాగుతారా లేదా అన్న డౌట్ దాంతో పాటే వస్తోంది.
ఇదిలా ఉంటే గంటా వైఖరి కూడా ఈ అనుమానాలను పెంచుతోందే తప్ప తగ్గించడంలేదు. తాజాగా ఆయన ఎన్టీయార్ వర్ధంతి వేళ బయట కార్యక్రమాలలో పాల్గొన్నారు కానీ పార్టీ ఆఫీస్ కి అసలు వెళ్లలేదు, ఆ వైపు కూడా చూడలేదు.
దాంతో మళ్లీ ఆయన మీద మీడియా ఫోకస్ పెరిగింది. గంటా ఎందుకు ఆఫీస్ కి వెళ్ళడం లేదన్న చర్చ కూడా దాంతో పాటే వస్తోంది.
ఎన్టీయార్ దేవుడు, ఆరాధ్యుడు అని ఆయన విగ్రహానికి దండ వేసిన గంటా టీడీపీ ఆఫీసులో జరిగిన రక్తదాన శిబిరానికి మాత్రం వెళ్లకపోవడం పట్ల తమ్ముళ్ళు కూడా తలోరకంగా మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి ఈ సస్పెన్స్ ఇలా కొనసాగించడంలోనే గంటా మార్క్ పాలిటిక్స్ దాగుందని అంటున్నారు.