మోదీ వాతలు.. బర్నాల్ పూతలు

దేశవ్యాప్తంగా ఉచిత రేషన్ పంపిణీని మరో ఆరు నెలలు పొడిగించింది కేంద్రం. ఈ విషయాన్ని హైలెట్ చేస్తూ ప్రచారం మొదలు పెట్టండి, బాకాలూదండి అంటూ రాష్ట్రాల బీజేపీ నేతలకు ఆదేశాలందాయి. దానికి తగ్గట్టే.. ఇప్పుడు…

దేశవ్యాప్తంగా ఉచిత రేషన్ పంపిణీని మరో ఆరు నెలలు పొడిగించింది కేంద్రం. ఈ విషయాన్ని హైలెట్ చేస్తూ ప్రచారం మొదలు పెట్టండి, బాకాలూదండి అంటూ రాష్ట్రాల బీజేపీ నేతలకు ఆదేశాలందాయి. దానికి తగ్గట్టే.. ఇప్పుడు బీజేపీ నేతలు రెచ్చిపోతున్నారు. 

ఆహా మోదీ, ఓహో మోదీ అంటున్నారు. ఉచిత రేషన్ తో 80 కోట్ల మందికి లబ్ధి కలుగుతుందని గొప్పలు చెప్పుకుంటున్నారు. పెట్రో మంటతో సామాన్య ప్రేక్షకుడిపై పడుతున్న వాతల్ని, ఇలా ఉచిత రేషన్ అనే బర్నాల్ తో పూతలు పూస్తోంది బీజేపీ.

మోదీ మార్క్ వాతలు..

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్ రేట్లు భారీగా పెరుగుతాయని కాంగ్రెస్ హింట్ ఇచ్చింది. అయితే అప్పటికప్పుడు రేట్లు పెంచకుండా నిదానించింది కేంద్రం. అప్పట్లో అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్న సమయంలోనే భారత్ లో పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెంచారు. 

ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధ భయాలతో బ్యారెల్ భగ్గుమంటున్న వేళ మోదీ వెనకడుగేస్తారా. కానీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో కాస్త ఆలోచించారు. ఎన్నికల ఫలితాలు వచ్చి ప్రభుత్వాలు కొలువుదీరుతున్న వేళ.. తడాఖా చూపిస్తున్నారు. రోజు రోజుకీ ఇంధన ధరలు పెంచుకుంటూ పోతున్నారు. మోదీ దెబ్బ మామూలుగా ఉండదని మరోసారి నిరూపించారు.

కవరింగ్ కష్టాలు..

సామాన్యుడి నడ్డి విరవడంలో కాంగ్రెస్ కంటే బీజేపీ ప్రభుత్వం మరింత ఘోరంగా ఉందని తేలిపోయింది. కనీసం పేద, మధ్యతరగతి ప్రజలపై దయ, జాలి, కరుణ ఏమాత్రం మోదీకి లేదని తేలిపోయింది. పెట్రోల్ వాతలను రోజువారీ చేసి జనాలకు అలవాటు చేశారు. గ్యాస్ బండపై మాత్రం ఒకేసారి రేటు పెంచి బాదేశారు. 

ఇప్పటికే జీఎస్టీ పేరుతో రాష్ట్రాల వాటాను కూడా కేంద్రం దోచేస్తుందనే ఆరోపణలున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాలకు విదిల్చే నిధులు తక్కువయ్యాయి. ప్రభావం తక్కువ, ప్రచారం ఎక్కువ అనేలా ఉంది పరిస్థితి. కానీ ప్రత్యామ్నాయం లేకపోవడంతో తాజాగా ఐదింట నాలుగు రాష్ట్రాలను బీజేపీ ఒడిసి పట్టుకుంది. 

అంటే ఒకరకంగా వాతలకు మేం సిద్ధం అంటూ ప్రజలు మరోసారి సామూహికంగా అంగీరరించినట్టే. దీంతో ప్రజలే  లైసెన్స్ ఇచ్చేసినట్టు మోదీ రంగంలోకి దిగారు. మోత మోగించేస్తున్నారు. బహుశా, రాబోయే రోజుల్లో ఇలా ఉచితాలు, పథకాల్లాంటి బర్నాల్ కూడా అవసరం లేదేమో.