తెలుగుదేశం పార్టీతో అంటీముట్టనట్టుగా ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. ఇప్పుడు కోర్టును ఆశ్రయించే పనిలో ఉన్నారు. ఇంతకూ ఎందుకో తెలుసా..? తన పదవిని అర్జంటుగా పీకేయాలని, తనను అర్జంటుగా మాజీనీ చేసేయాలని ఆయన కోర్టును అభ్యర్థించనున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ స్పీకరు ఫార్మాట్ లో లేఖ సమర్పించి దాదాపు ఏడాది గడుస్తున్నప్పటికీ.. తన రాజీనామాను ఆమోదించకపోవడంపై ఆయన దిగులు చెందుతున్నారు. అందుకే కోర్టుకు వెళుతున్నారు.
గంటా శ్రీనివాసరావుకు తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం పోయింది. పార్టీలు మారడం.. ఎవ్వరు అధికారంలో ఉంటే వారి పంచన ఉంటూ రాజకీయ మనుగడను సుస్థిరంగా కాపాడుకోవడమూ బాగా అలవాటు అయిన గంటా.. 2019 ఎన్నికల తర్వాత.. తెలుగుదేశాన్ని వదలి వైసీపీకి దగ్గర కావడానికి కూడా తాను చేయదగిన ప్రయత్నాలన్నీ చేశారు ఫలించలేదు. అలాగని తెలుగుదేశంలో కొనసాగే ఆలోచనను కూడా వదలిపెట్టారు. ఆపార్టీకి ఇక భవిష్యత్తు లేనేలేదనే విషయాన్ని బహుశా అందరికంటె ముందు గుర్తించిన వారిలో ఆయన కూడా ఉన్నారనే అనాలి.
ప్రస్తుతానికి ఆయన కాపు వర్గం పెద్దలందరినీ సమీకరిస్తూ ఒక రాజకీయశక్తిగా ఆవిర్భవించే ప్రయత్నాల్లో ఉన్నారు. మీటింగులు పెడుతున్నారు. ఈలోగా తెలుగుదేశం పార్టీతో బంధాన్ని, ఎమ్మెల్యే పదవితో సహా శాశ్వతంగా తెంచుకోవడానికి ఆయన రాజీనామా చేశారు. అందుకు విశాఖ ఉక్కు ప్రెవేటీకరణ వ్యవహారం ఆయనకు బాగా కలిసి వచ్చింది. ప్రెవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేస్తానని ప్రకటించి.. స్పీకరు ఫార్మాట్ లో లేఖ ఇచ్చేశారు.
ఇంతవరకు పాత ఎపిసోడే. ఇటీవల స్పీకరు తమ్మినేని సీతారాంకు, తన రాజీనామాను తక్షణం ఆమోదించాలంటూ లేఖ కూడా రాశారు. అయితే గంటా రాజీనామా చేసి ఏడాది గడుస్తున్నా.. ఇప్పటిదాకా స్పీకరు దానిని ఆమోదించడం గురించి ఎందుకు పట్టించుకోలేదన్నది మీమాంస. స్పీకరు ఫార్మాట్ లో రాజీనామా ఉన్నప్పుడు, అదికూడా ప్రత్యర్థి పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజీనామా చేసినప్పుడు.. ఆమోదించేస్తే ఓ పనైపోతుంది కదా.. ప్రత్యర్థి పార్టీ బలం కాస్త తగ్గుతుంది కదా.. అని ఎవ్వరికైనా అనిపిస్తుంది.
స్పీకరు ఎందుకు జాగు చేస్తున్నారో అర్థం కాని సంగతి. రాజీనామా ఆమోదం పొందితే అక్కడ ఉప ఎన్నిక వస్తుంది. గంటా స్థానంలో ఉప ఎన్నిక వచ్చాక.. ఆయన ఎటూ తెలుగుదేశానికి దూరంగా ఉంటున్నారు గనుక.. ఆ పార్టీ టికెట్‌పై మళ్లీ బరిలో ఉండే అవకాశం లేదు. ఇండిపెండెంటుగా బరిలోకి దిగడం సందేహమే. నిజానికి వైసీపీ ఆయన రాజీనామాను ఆమోదించడానికి చాలా ఉత్సాహపడాలి.
ఎందుకంటే.. గత ఎన్నికల్లో కేవలం 1900 ఓట్ల తేడాతో ఆ స్థానాన్ని వైసీపీ కోల్పోయింది. ఇప్పుడు ఉప ఎన్నికవస్తే ఖచ్చితంగా గెలుచుకుంటుంది. గతంలో టీడీపీ స్థానాన్ని తాము గెలుచుకున్నాం అని ఘనంగా చెప్పుకోవడమూ కుదురుతుంది. అలాంటిది.. గంటా రాజీనామాను ఆమోదించడానికి స్పీకరు ఎందుకింత మీనమేషాలు లెక్కిస్తున్నారో మాత్రం ఎవ్వరికీ అర్థం కావడం లేదు.