ఊహించని విధంగా ఆదిపురుష్ సినిమా వివాదంలో చిక్కుకుంది. అయితే మేకర్స్ వెంటనే అలెర్ట్ అవ్వడంతో ఆ వివాదం సమసిపోయింది. నేపాల్ లో జరిగింది ఈ ఘటన.
ఆదిపురుష్ సినిమాలో జానకిని భరతమాత పుత్రికగా అభివర్ణించారు. దీనిపై నేపాల్ లో ఓ వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. స్వయంగా ఖాట్మండూ మెట్రోపాలిటన్ సిటీ మేయర్ బాలేంద్ర షా, ఈ అంశాన్ని లేవనెత్తారు.
పురాణాల ప్రకారం, జానకి జన్మస్థానం నేపాల్. ఇదే విషయాన్ని ప్రస్తావించిన ఖాట్మండూ మేయర్.. సినిమా నుంచి ఆ వివాదాస్పద లైన్ ను తొలిగించాలని, అప్పటివరకు నేపాల్ లో సినిమాను రిలీజ్ చేయనివ్వమని బహిరంగంగా హెచ్చరించారు. ఆ వాక్యాన్ని తొలిగించేవరకు ఏ హిందీ సినిమాను నేపాల్ లో విడుదలచేయనివ్వమంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఈ అంశంపై నేపాల్ సెన్సార్ బోర్డు కూడా స్పందించింది. నేపాలీయుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతున్న ఆ లైన్ ను తొలిగించాలని సూచించింది. దీంతో నేపాల్ అంతటా ఈరోజు మార్నింగ్ షోలు నిలిచిపోయాయి.
వెంటనే అలర్ట్ అయిన మేకర్స్.. నేపాలీయులు అభ్యంతరం తెలుపుకున్న వివాదాస్పద లైన్ ను తొలిగించారు. దీంతో కాస్త ఆలస్యంగా నేపాల్ అంతటా ఆదిపురుష్ సినిమా రిలీజైంది. ఈ ప్రభావం మొదటి రోజు వసూళ్లపై పెద్దగా పడదంటోంది ట్రేడ్.
వాల్మీకి రచించిన రామాయణాన్ని ఆధారంగా చేసుకొని ఆదిపురుష్ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు ఓం రౌత్. ప్రభాస్ రాఘవుడిగా, కృతి సనన్ జానకిగా నటించిన ఈ సినిమా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజైంది.