అప్సర హత్య కేసు.. ఈ రాత్రికి సీన్ రీ-కనస్ట్రక్షన్

తెలంగాణలో సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసును పోలీసులు కొలిక్కి తీసుకొచ్చారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని టెక్నికల్ ఆధారాల కోసం ఈరోజు రాత్రి సీన్ రీ-కనస్ట్రక్షన్ చేయబోతున్నారు. అప్సరను పూజారి సాయికృష్ణ దారుణంగా…

తెలంగాణలో సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసును పోలీసులు కొలిక్కి తీసుకొచ్చారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని టెక్నికల్ ఆధారాల కోసం ఈరోజు రాత్రి సీన్ రీ-కనస్ట్రక్షన్ చేయబోతున్నారు. అప్సరను పూజారి సాయికృష్ణ దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని తన కారులోనే ఉంచి, ఇంటికెళ్లిపోయాడు.

ఒక రోజు తర్వాత ఆమె మృతదేహాన్ని సరూర్ నగర్ ప్రాంతంలోని ఓ మ్యాన్ హోల్ లో పడేశాడు. ఆ తర్వాత ఏం జరగనట్టు, అప్సర తల్లితో కలిసి పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారు.

ఈ కేసులో మొదట్నుంచి సాయికృష్ణపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు, చివరికి అతడే హంతకుడని తేల్చారు. ఈ విషయాన్ని సాయికృష్ణ కూడా అంగీకరించాడు. అప్సరతో తనకు వివాహేతర సంబంధం ఉందనే విషయాన్ని అంగీకరించిన సాయికృష్ణ, పెళ్లి చేసుకోమని బ్లాక్ మెయిల్ చేయడం వల్లనే, పరుపు పోతుందని భావించి హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు.

సాయికృష్ణను 2 వారాల రిమాండ్ కు ఆదేశించిన కోర్టు.. పోలీసులకు 2 రోజుల కస్టడీకి అనుమతించింది. దీంతో ఈరోజు రాత్రి సాయికృష్ణ ఆధ్వర్యంలో సీన్ రీ-కనస్ట్రక్షన్ చేయాలని పోలీసులు నిర్ణయించారు. పూర్తిస్థాయిలో టెక్నికల్ ఆధారాలు సేకరించిన తర్వాత, పకడ్బందీగా ఎఫ్ఐఆర్ నమోదుచేసి కోర్టుకు సమర్పించాలనుకుంటున్నారు.

మరోవైపు ఈ కేసుకు సంబంధించి సాయికృష్ణ తండ్రి, భార్య వాదనలు మాత్రం విభిన్నంగా ఉన్నాయి. అప్సర, ఆమె తల్లి తన కొడుకును ట్రాప్ చేశారని ఆరోపిస్తున్నాడు సాయికృష్ణ తండ్రి. అప్సర బ్యాంక్ ఎకౌంట్స్ పరిశీలిస్తే, మరిన్ని ఆధారాలు దొరుకుతాయని చెబుతున్నారు.