యూపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్రో ధరల్లో రోజువారీగా పెంపు మళ్లీ మొదలైంది. అయితే ఇది ఇంతటితో ఆగదని సమాచారం. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలకు అనుగుణంగా అతి త్వరలోనే పెట్రో ధరలు భారీగా పెరగనున్నట్టుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వీటి ప్రకారం.. లీటర్ పెట్రోల్ పై కనిష్టంగా పది రూపాయలకు పైన, గరిష్టంగా ఇరవై రూపాయల వరకూ ధర పెరిగే అవకాశం ఉంది. డీజిల్ మీద కనీసం పదిహేను రూపాయల అదనపు భారం పడవచ్చని అంచనా.
ఈ మేరకు రేట్లను పెంచితేనే చమురు సంస్థలు మనుగడ సాగించవచ్చట. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పెరగడం ఫలితంగా ఈ పెంపు తప్పని సరి అని సమాచారం. అయితే ఇక్కడ విడ్డూరమైన అంశం ఏమిటంటే.. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పెరిగినప్పుడేమో, ఆ ధరలతో పోల్చి.. దేశీయంగా ఆయిల్ కంపెనీలు నష్టపోతున్నాయని అంటారు. అంతే అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పడిపోయిపోయినప్పుడు మాత్రం ఆ మేరకు దేశంలోని వినియోగదారుడికి పెట్రోల్ ను ఆ రేటుకు అందించరు!
బ్యారెల్ క్రూడ్ ధర నలభై డాలర్లకు పడిపోయినప్పుడు కూడా లీటర్ పెట్రోల్ ను వందల రూపాయలకు అమ్మారు. ఇప్పుడు అదే బ్యారెల్ ధర వంద డాలర్లను దాటింది కాబట్టి.. చమురు కంపెనీలు విపరీతంగా నష్టపోతున్నాయని అంటారు!
గత కొన్నేళ్లలో క్రూడ్ ధరలో విపరీతమైన వ్యత్యాసాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఒక దశలో నలభై డాలర్లకు తగ్గిపోయాయి. ఒకవేళ అప్పుడు దేశ ప్రజలకు లీటర్ పెట్రోల్ ను ముప్పై రూపాయలకో, నలభై రూపాయలకో అందించి ఉంటే.. ఇప్పుడు క్రూడ్ ధర వంద డాలర్లను దాటింది కాబట్టి.. ఆ మేరకు రేట్లను పెట్టుకుంటే అడిగే వారు ఉండరు! అంతర్జాతీయంగా ముడిచమురు ధర పెరిగిపోతే.. నష్టాలు అంటూ గగ్గోలు. అదే తగ్గిపోతే మాత్రం.. నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం. ఇదీ కథ!