మలయాళీ సినిమాల తెలుగు రీమేక్ ల పరంపర కొనసాగుతూ ఉంది. పెద్ద హీరోలు, చిన్న హీరోలు తేడా లేకుండా మలయాళీ సినిమాలను తెలుగు వారు రీమేక్ చేస్తూ ఉన్నారు. కేవలం తెలుగు చిత్ర సీమ మాత్రమే కాకుండా.. హిందీ మూవీ మేకర్స్ కూడా మలయాళీ సినిమాల హక్కులను కొనుక్కొని రీమేక్ చేయడం కొనసాగుతూ ఉంది.
ఈ క్రమంలో హిందీ బడా ప్రొడ్యూసర్ కరణ్ జొహార్ ఒక మలయాళ సినిమా రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేశాడు. ఆ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా ఆయనే నిర్మించబోతున్నారు. అధికారికంగా ఈ మేరకు ప్రకటించారు కూడా.
మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ హీరోగా నటించిన హృదయం అనే మలయాళ సినిమాను కరణ్ జొహార్ రీమేక్ చేయబోతున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది జనవరిలో విడుదలైంది.
విమర్శకుల ప్రశంసలను పొందడంతో పాటు కమర్షియల్ గా కూడా ఆ సినిమా హిట్ అనిపించుకుంది. దీంతో ఈ సినిమాను రీమేక్ చేయడానికి కరణ్ జొహార్ ఉత్సాహం చూపిస్తున్నాడు. కేవలం హిందీలోనే కాకుండా.. తెలుగులో కూడా ఈ సినిమా నిర్మాణానికి కరణ్ పూనుకుంటూ ఉండటం గమనార్హం.