‘’…1897 ప్రాంతంలో అల్లూరి జన్మించారు. ఆయన బాగా చదువుకున్నారు. యుక్త వయస్సులో ఇల్లు వదిలి వెళ్లిపోయారు. ఎక్కడికి వెళ్లారో, ఏం చేసారో తెలియదు. తిరిగి వచ్చాక ఆయన విధానం, పోరాటం అన్నీ మనకు తెలిసినవే. తెలిసిన కథే..’’
‘’…1901లో అల్లూరి పుట్టిన రెండుమూడేళ్ల గ్యాప్ లో కొమరం భీమ్ జన్మించారు. ఆయన కూడా యుక్త వయస్సులో ఎటో వెళ్లిపోయారు. వెళ్లే వేళకు ఆయన చదువుకోలేదు. వచ్చేసరికి బాగా చదువుకుని వచ్చారు. పోరాడారు. అదంతా తెలిసిన కథే…’’
‘’..ఈ రెండూ నాకు ఇంట్రస్టింగ్ ప్లాట్ పాయింట్ గా అనిపించింది. ఆ రోజుల్లో వాళ్లిద్దరు కలిసి వుంటే, ఒకరికి ఒకరు ఇన్సిపిరేషన్ అయివుంటే అన్న ఆలోచన ఆసక్తిగా అనిపించింది…’’
‘‘..రెండు ఒరిజినల్ పాత్రల ఫిక్షనల్ స్టోరీ ఇది. దీని కోసం చాలా చాలా రీసెర్చ్ చేసాం. అన్ని విషయాల మీద రీసెర్చ్ చేయాల్సి వచ్చింది…’’
‘’మీకు తెలిసిన అల్లూరి యంగర్ వెర్షన్..అంటే మీకు తెలియని యంగర్ వెర్షన్ అల్లూరి గా చరణ్ కనిపించబోతున్నారు..’’
ఈ మాటలు అన్నీ దర్శకుడు రాజమౌళివే. ఆర్ఆర్ఆర్ సినిమా అనౌన్స్ మెంట్ సందర్భంగా తొలి మీడియా మీట్ ఆలో ఆయన చెప్పిన మాటలు ఇవి. ఆ నాటికి ఆయన చెప్పిన దాని ప్రకారం అల్లూరి సీతారామరాజు ప్రవాసంలో వున్నపుడు ఏం చేసి వుంటారు అన్నది ఫిక్షనల్ గా ఊహించి ఈ సినిమా తీసారు అన్నది పక్కా.
అయితే తరువాత తరువాత ఆయన మీడియా ముందుకు వచ్చినపుడు ఈ మాటలు కాస్త మారాయి. వివాదాలు వస్తాయనో మరోటనో, కాస్త మాట మార్చడం ప్రారంభం అయింది. ఫిక్షన్ స్టోరీ..అంటూ చెప్పడం ప్రారంభించారు. ఆ విషయం ఎలా వున్నా సినిమాలో చరణ్…ఎ.ఎస్. రాజు గానూ ఎన్టీఆర్ భీమ్ గానే కనిపించారు. అంటే రాజమౌళి మాటల ప్రకారం యంగర్ వెర్షన్ ఆఫ్ అల్లూరి ఎలా వుంటారు అన్నది ఆయన ఊహించినదే సినిమాలో చూపించారు.
ఇక ఇప్పుడు విషయానికి వద్దాం.
అల్లూరి నరనరానా దేశ భక్తి నిండిన మహానుభావుడు. గిరిజనం కోసం పోరాడిన వాడు. బ్రిటిష్ వారికి ఎదురొడ్డి అతి చిన్న వయసులో ప్రాణాలు అర్పించినవాడు.
అలాంటి వాడు కాసిన్ని ఆయుధాల కోసం అదే బ్రిటిష్ వారికి ఊడిగం చేసాడా?
ప్రమోషన్ కోసం సాటి దేశీయులను గొడ్డును బాదినట్లు బాదాడా?
ఉద్యోగ బాధ్యత కోసమో లేదా ఆయుధాల కోసం ఉద్యోగం కోసమో, కొమరం భీమ్ ను సైతం కొట్టాడా?
ఓ తోటి భారతీయుడిని ఎవరికీ తెలియని చోట దాచి కర్కశంగా హింసించాడా?
అసలు ఇలాంటి ఫిక్షనల్ ఊహ మాత్రం ఎలా వచ్చింది. భీమ్ ను అంటే అందరూ చూస్తున్నారని కొట్టివుండొచ్చు. కానీ భీమ్ అనుచరుడిని (రాహుల్ రామకృష్ణ పాత్ర) ను ఎవరికీ తెలియకుండా దాచి అంత దారుణంగా హింసించే కఠినాత్ముడా అల్లూరి?
తండ్రి ఒక ఊరిలో మహా అయితే వందమందికి ఆయుధ శిక్షణ ఇస్తూ వుండోచ్చు. అది తెలిసి బ్రిటిష్ వారు దాడి చేసారు. తండ్రి చనిపోతూ ఓ పాతిక, యాభై మందిని చంపారు. మరి ఆ ఆయుధాలు దొరికినట్లేగా?
అల్లూరి సీతారామరాజు విశాఖ మన్యంలోని పోలీస్ స్టేషన్ ల మీద దాడి చేసి, ఆయుధాలు దొచినపుడల్లా, అక్కడి సిబ్బంది (తోటి భారతీయులే) కి ఇబ్బంది కలుగకూడదని తాను తీసుకెళ్తున్నట్లు కాగితం రాసి సంతకం పెట్టి వెళ్లేవారు. అంత రాజసం..అల్లూరిది. అంతే కానీ దొంగతనంగా దాక్కుని, బానిసగా ఊడిగం చేసిన మనస్తత్వం కాదు. ఇదేనా రాజమౌళి చేసిన రీసెర్చి?
ఆ నాటి కాలపరిస్థితుల మీద అన్ని వ్వవహారాలు, వర్తకం మీద కూడా రీసెర్చి చేసామని చెప్పారు రాజమౌళి. మరి అదిలాబాద్ నుంచి ఆ రోజుల్లో హైదరాబాద్ వెళ్లాలంటేనే వారాలు పడుతుంది. మరి ఢిల్లీ వెళ్లాలంటే?
అలాంటిది ఢిల్లీకి జంతువలను తరలించాలంటే..? అన్ని జంతువులను ఢిల్లీలో దాచి పెట్టాలంటే..? పైగా పరస్పర వైరధ్యమైన పులులు, జింకలు, హైనాలను ఒకే బొనులో దాచి వుంచాలంటే..?
తానే ఓ ముస్లిం కుటుంబం నీడలో తలదాచుకున్నాడు. మరి ఇన్ని జంతువులను, ఓ గిరిఙన గూడెం నుంచి వాహనం సంపాదించి, అదిలాబాద్ నుంచి ఢిల్లీకి తరలించాడా? అంటే ఇలాంటి దాడి చేయాల్సి వుంటుందని ముందే అనుకున్నాడా?
ఇవన్నీ కోడిగుడ్డుకు వెంట్రుకలు పీకడం అని అనుకొవచ్చు. బాహుబలి విషయంలో ఇలాంటి అనుమానాలకు తావు లేదు ఎందుకంటే అది చందమామ కథ. జానపద గాథ. ఎలాగైనా వుండొచ్చు. కానీ ఇది ఇద్దరు దేశభక్తుల ప్రవాస జీవితాన్ని ఊహించి రాసుకున్న కథ. పాత్రోచితంగా వుండాలి తప్ప, ఔచిత్యానికి భంగం కలగకూడదు.
అల్లూరి, భీమ్ పేర్లు వాడకుండా కల్పిత కథ అంటే ఎవ్వరూ ఏమీ ప్రశ్నించరు. కానీ తొలి ప్రెస్ మీట్ లోనే బోలెడు రీసెర్చి, పాత్రలు, వాటి అదృశ్య జీవితం అంటూ చెప్పడం, సినిమా విడుదలయ్యాక, కొందరు మహానుభావులు ఇది దేశభక్తి సినిమా అనడం వల్ల ఇలా ప్రశ్నించాల్సి వస్తోంది.