జబర్దస్త్ ఇక కష్టమేనా..?

టీవీతోపాటు, యూట్యూబ్ లో ఈటీవీ జబర్దస్త్ ఎంత పాపులరో అందరికీ తెలుసు. కానీ రాను రాను ఈ షో వెగటు పుట్టిస్తోంది. పచ్చి బూతు షో గా మారుతోంది. కంటెస్టెంట్ ల నోటి వెంట…

టీవీతోపాటు, యూట్యూబ్ లో ఈటీవీ జబర్దస్త్ ఎంత పాపులరో అందరికీ తెలుసు. కానీ రాను రాను ఈ షో వెగటు పుట్టిస్తోంది. పచ్చి బూతు షో గా మారుతోంది. కంటెస్టెంట్ ల నోటి వెంట వచ్చే ప్రతి డైలాగూ డబుల్ మీనింగే. ఈ ఎ-గ్రేడ్ షో ని కుటుంబమంతా కలసి చూసే రోజులు ఎప్పుడో పోయాయి. 

కామెడీ అంటూ ప్రారంభమైన ఈ కార్యక్రమం, ఇప్పుడు 3 డబుల్ మీనింగ్ డైలాగ్స్, 6 బాడీ షేమింగ్ సెటైర్లతో విరాజిల్లుతోంది.

అమ్మాయిల ఎంట్రీతో మరింత మార్పు..

గతంలో అమ్మాయిల క్యారెక్టర్స్ ని కూడా అబ్బాయిలు వేసేవారు. అలా అమ్మాయిలుగా మారిన అబ్బాయిల్లో కొంతమంది ట్రాన్స్ జెండర్లుగా మారిపోవడం జబర్దస్త్ స్పెషాలిటీ. ఇక ఈ గొడవ వద్దనుకుని నేరుగా అమ్మాయిల్నే సీన్ లోకి తేవడం మొదలు పెట్టారు. 

ఒకరితో ఒకరు పోటీపడి మరీ టీమ్ లీడర్లు అప్ కమింగ్ ఆర్టిస్ట్ లను జబర్దస్త్ కి తెచ్చేస్తున్నారు. అక్కడితో కథ ఆగలేదు, అక్కడే మొదలైంది. అమ్మాయిలు కూడా ఒకరితో ఒకరు పోటీపడి మరీ డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోతున్నారు. 'మంగళవారం జోకుల'న్నీ వారి నోటి వెంటే వినపడుతున్నాయి. పంచ్ డైలాగులు, ప్రాస డైలాగుల పేరుతో పచ్చి బూతు డైలాగుల్ని మిక్స్ చేసి, మ్యూజిక్ పెట్టి వదిలేస్తున్నారు.

జడ్జిలు ఏం చేస్తారు చెప్పండి..?

ఇప్పటికే రోజాపై జబర్దస్త్ జడ్జి అనే ముద్రపడిపోయింది. తనకు అచ్చొచ్చిన షో కాబట్టి, దాన్ని వదులుకోలేక ఆమె కొనసాగిస్తున్నారు. ఇప్పుడైతే ఓకే కానీ, రేపు కాలం కలిసొచ్చి మంత్రి అయితే మాత్రం ఈ బూతు షో కి రోజా జడ్జిగా వెళ్లే అవకాశాలే లేవు. 

అందుకేనేమో.. శృతి తప్పుతున్నా ఆమె మాత్రం ఆ జోకులకు పగలబడి నవ్వుతున్నారు, ఇంకెన్నాళ్లులే అని మనసులో అనుకొని ఉండొచ్చు.

ఇంకెంతకాలం..?

జబర్దస్త్ షో లో నిరూపించుకుంటే సినిమా అవకాశాలు వచ్చేస్తాయనే భ్రమలో చాలామంది ఈ ప్లాట్ ఫామ్ వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. గతంలో చాలామంది ఇలాగే జబర్దస్త్ టు సిల్వర్ స్క్రీన్ ప్రయాణం చేశారు కూడా. కానీ ఇప్పుడదంత ఈజీ కాదు. 

ఈ బూతు డైలాగుల రైటర్లకి సినిమాల్లో అవకాశాలు రావొచ్చేమో కానీ, నటీనటులను ఇక్కడినుంచి తీసుకెళ్లాల్సిన అవసరమైతే వెండితెరకు లేదు. జబర్దస్త్ నటీనటులతో రూపొందిన సినిమా అని ఎవరైనా చీప్ పబ్లిసిటీ కోరుకుంటే మాత్రం అదేపని చేస్తారు.

కానీ ప్రస్తుతం జబర్దస్త్ ని ఫాలో అయ్యేవారు మాత్రం ఈ ఓవర్ యాక్షన్ ఎక్కువకాలం సాగకపోవచ్చనే నిర్ణయానికి వచ్చేశారు. బూతు మరీ ఎక్కువైతే.. సోషల్ మీడియా వేదికగా ఈటీవీపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.