చిత్రం: ఆదిపురుష్
రేటింగ్: 2.5/5
తారాగణం: ప్రభాస్, కృతి సానన్, సైఫ్ ఆలి ఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగె, వత్సల్ సేఠ్, తృప్తి తోడర్మల్, సొనాల్ చౌహాన్ తదితరులు
సంగీతం: అజయ్-అతుల్
కెమెరా: కార్తిక్ పళని
ఎడిటర్: అపూర్వ, ఆశిష్
నిర్మాతలు: భూషణ్ కుమార్, ఓం రౌత్
దర్శకత్వం: ఓం రౌత్
విడుదల: జూన్ 16, 2023
ఎన్నో ఏళ్ల తర్వాత రామయణం కథతో పెద్ద సినిమా. అది కూడా ప్యాన్ ఇండియా చిత్రం. ఎన్నో అంచనాల మధ్య తొలి ట్రైలర్ వచ్చినప్పుడు జనం తిట్టిపోసారు… అసలు రామాయణంలానే లేదని. తరవాత కొన్నాళ్లు ఆగి ఏవో రిపేర్లు చేసినట్టు మభ్యపెట్టి మరొక ట్రైలర్ వదిలారు. జనం కనికరించి హైప్ ని ఇచ్చారు. నేడు చిత్రం విడుదలయ్యింది.
కథలోకి వెళితే శూర్పణఖ ముక్కు కోయడంతో సినిమా మొదలయ్యి రావణవధతో ముగుస్తుంది ఈ “ఆదిపురుష్”. గెటప్స్ పరంగా, సీన్స్ కన్సీవ్ చేసిన పరంగా పూర్తిగా ఇప్పటివరకు మనం చూసిన రామాయణానికి విరుద్ధంగానే సాగింది. ఎమోషన్ పండితే ఆ మైనస్సులన్నీ కనపడకుండా పోతాయి. మరి పండిందా?
రామాయణం అంటేనే ఒక ఎమోషన్. కంత తడి పెట్టించే ఘటనలు అందులో అనేకం. అరణ్య, యుద్ధకాండల వరకు చూసుకున్నా సీతాపహరణం, జటాయువు మరణం, శబరి భక్తి, సీతావియోగంతో రాముడి ఉద్వేగం, అశోకవనంలో సీత మనఃస్థితి ఇలా చెప్పుకుంటూ పోతే మనసుని పిండే సన్నివేశాల కలబోత రామాయణం. కానీ ఈ ఓం రౌత్ రామాయణంలో కంట తడి పెట్టించే మాట అటుంచి మచ్చుకి ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా మనసుని కదిలించదు.
తెర మీద చూస్తున్నది రామాయణమేనా లేక “గేం ఆఫ్ థ్రోన్స్” సీక్వెలా అనేది అర్ధం కాదు. రావాణాసురుడి గెటప్ నుంచి అతని లంక వరకు అంతా అదేదో లోకంలా ఉంది. మండోదరి, విభీషణుడి భార్య శరమ, శూర్పణక అందరూ ఈ కాలం నాటి పేజ్ 3 లేడీస్ లాగ ఉన్నారు. ఒక్కరికి కూడా మొహాన బొట్టు లేదు. అలాగని సంప్రదాయానికి పూర్తి విరుద్ధంగా తీసాడా అంటే మళ్లీ రావాణసురుడికి, కుంభకర్ణుడికి జంధ్యాలు చూపించాడు దర్శకుడు. రావణుడు కాసేపు అడ్డవీభూదితోనూ ఒకటి రెండు చోట్ల ఎర్రబొట్టుతోనూ కనిపించినా ఎక్కువగా నుదుటి మీద ఏమీ లేకుండానే ఉన్నాడు.
సింపుల్ గా చెప్పాలంటే రావణ, విభీషణ, ఇంద్రజిత్ లు మిడిల్ ఈష్ట్ రాజుల్ల గెటప్పుల్లో, స్కాండనీవియన్ దుస్తులేసుకున్నట్టు కనిపిస్తారు. మరీ చోద్యంగా ఒక సన్నివేశంలో రావణుడు కొండచిలువలతో బాడీ మసాజ్ చేయించుకుంటూ కనిపిస్తాడు. ముస్లిం గెటప్ వల్ల రావణాసురుడు “పద్మావత్” సినిమాలో అల్లాఉద్దిన్ ఖిల్జిలాగ చాలా చోట్ల. ఎక్కడా కూడా ప్రాచీన భారతదేశ, లంకా చిహ్నాలు కనపడవు. తెలిసీ తెలియని తనంతో ఎవరో ఫారినర్స్ తీసిన రామయణంలా ఉంది తప్ప భారతీయ బ్యానర్ భారతీయ దర్శకుడితో తీసినట్టు అస్సలు లేదు.
ఇక వానరుల విషయానికొస్తే అంతా గందరగోళం. హనుమంతుడొక్కడూ హనుమంతుడిలా ఉన్నాడు. వాలి సుగ్రీవులు చింపాంజీలు. మిగిలిన వానరులు అయితే గొరిల్లాలు, లేకపోతే ఒరాంగుటన్లు. జాంబవంతుడు మాత్రం నాలుగు కాళ్లతో నడిచే అచ్చమైన ఎలుగుబంటి. లంకలో రావణసేన మాత్రం అవేవో వింతజీవులు.
సీతారాములు వనవాసంలో ఉండగా ముందుగా ఒక ఎటాక్ అవుతుంది. బహుశా అది “ఖరదూషణాదులతో యుద్ధం” ఏమో అనుకుంటాం. కానీ ఏవిటో చిన్నప్పుడు “హీమాన్” కార్టూన్ సీరియల్లో విలన్ లాగ అస్తిపంజరం ముఖంతో ఒకడొస్తాడు. వాడితో పాటు లక్షలాది జాంబీల్లాంటి వింత జీవులొస్తాయి. రాముడు గాల్లోకి ఎగురుతూ చిత్రవిచిత్రమైన స్టార్-వార్స్ లాంటి యుద్ధం చేసి వాటిని సంహరిస్తాడు.
అలాగే ఇందులో బ్రహ్మదేవుడు చతుర్ముఖుడు కాదు. ఏ దివ్యతేజస్సు లేకుండా ఏదో సినిమాలో రాజగురువులాగ సింగిల్ హెడ్ తో ప్రత్యక్షమయ్యి రావణుడికి వరమిస్తాడు. ఆ రావణుడు హిమాలయాల్లో బొచ్చుదుప్పటి కప్పుకుని తపస్సు చేస్తే ఈ బ్రహ్మగారు దిగొచ్చినట్టు చూపించాడు ఓం రౌత్. దీనికి తోడు రావణాసురుడు కొన్ని చోట్ల కుంటుతూ నడుస్తాడు. అదెందుకో అర్ధం కాదు.
2010 లో “రామాయణ ది ఎపిక్” పేరుతో హిందీ, తమిళ భాషల్లో ఒక యానిమేషన్ చిత్రమొచ్చింది. యూట్యూబులో ఉందది. బాగున్నాయనుకున్న చాలా షాట్స్ అందులోంచి ఎత్తేసినట్టే ఉన్నాయి ఇక్కడ. నిజానికి ఎమోషన్ పరంగా చూస్కుంటే ఆ యానిమేషన్ రామాయణం ఈ “ఆదిపురుష్” కంటే ఎన్నో రెట్లు బెటర్ గా ఉంటుంది.
ఇందులో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమ అనే పాపులర్ పేర్లు కాకుండా రాఘవ, శేషు, జానకి, భజరంగ్ అని పెట్టారు. ఇందులో శేషు ఒక్కటే కాస్త అతిగా ఉండి అతకనట్టు ఉంది. ఎంత ఆదిశేషుడి అవతారం అని చెప్పుకుంటే మాత్రం మరీ శేషు అని పిలుస్తారా సీత, రాముడూను?! అయితే లక్ష్మణుడు (అదే… శేషు) సీతని నేరుగా చూడకపోవడమనే క్యారెక్టరైజేషన్ బాగుంది. అది ఒరిజినల్ రామాయణానికి అనుగుణంగా ఉంది.
లంకలో త్రిజట క్యారెక్టర్ ని మూడు జడలతో చూపించారు. పేరు చెప్పకపోయినా సటిల్ గా అలా చూపించడం మెచ్చుకోవచ్చు.
చాలా చోట్ల లిప్ సింక్ తేడా కొట్టింది. తెలుగు డైలాగ్స్ అస్సలు బాలేవు. చాలా వీక్ గా ఉన్నాయి. “గుడ్డ నీ బాబుది, తైలం నీ బాబుది, కాలేది కూడా నీ బాబుదే” అని హనుమంతుడు ఇంద్రజిత్తుతో చెప్పే డైలాగ్ సీమసినిమాల్లోని బాలకృష్ణ డైలాగులాగుంది తప్ప ఎక్కడా రామాయణస్ఫూర్తి లేదు.
లంకలోకి ప్రవేశించిన హనుమంతుడిని ఇంద్రజిత్ బంధించి రావణాసురుడి దగ్గరకి తీసుకొస్తాడు. అప్పుడెందుకో రావణాసురుడు కత్తిన సాన పెట్టుకుంటూ, షీల్డ్ అడ్దం పెట్టుకుని వెల్డింగ్ పని చేస్తుంటాడు. రావణుడు వెల్డింగ్ పని చేయడమేంటో?
అలాగే హనుమంతుడికి చూడామణి ఇవ్వాల్సిన సీత చేతి గాజుని తీసి ఇస్తుంది. సర్లే ఏదో ఆభరణం అని సరిపెట్టుకోవచ్చు! అంగద రాయబారం పెట్టడం బానే ఉంది.
సినిమా మొదటి సగంలో ప్రధాన సన్నివేశాలన్నీ అయిపోతాయి. రెండవ సగమంతా యుద్ధమే. ఏ సన్నివేశం కూడా ఎమోషన్ అందించే వరకు ఆగకుండా తెరమరుగవుతుండడం ఈ సినిమాలో అతిపెద్ద మైనస్.
పాటలు సంగీతపరంగా బానే ఉన్నాయి. కానీ పాటల్లోని సాహిత్యంతో ప్రయాణం చేసేవిధంగా లేదు. “జైశ్రీరాం..జైశ్రీరాం” అంటూ సాగే నేపథ్యం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాని చాలాచోట్ల నిలబెట్టింది.
రాముడిగా ప్రభాస్ హైలైట్. సీతగా కృతి సానన్ బాగుంది. రావణాసురుడిగా సైఫ్ ఆలి ఖాన్ సరిపోకపోయినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్ల కొన్ని చోట్ల నిలబడ్డాడు. హనుమంతుడిగా దేవదత్త సరిపోయాడు. శూర్పణఖగా తృప్తి తోడర్మల్, మండోదరిగా సోనాల్ చౌహాన్ అతిధి పాత్రల్లో కనిపించారు.
కథగురించి, పాత్రల గురించి తెలిసిన వాళ్లకి సంతృప్తి కలగకపోగా చిరాకేస్తుంది. తెలియని వాళ్లకి పెట్టిందే నైవేద్యం. మొత్తంగా ఎలా చూసినా ఇది రామాయణంలాగ అనిపించే ఎవెంజెర్స్ సినిమా లాగ అనిపిస్తుంది. ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి, రామాయణం అస్సలు తెలియని కొందరికి తప్ప మిగిలిన ఎవ్వరికీ కాస్త కూడా నచ్చదు. అయినా ఈ సినిమా కలెక్షన్స్ ని కొల్లగొడితే రామభక్తితో హనుమంతుడు దగ్గరుండి ఆడించినట్టే అనుకోవాలి. అసలే ఆయనకోసం ప్రతి హాల్లోనూ ఒక సీటు కూడా కేటాయించేసారు ప్రతి షోలోనూ!
బాటం లైన్: రామ..రామ!