వారాహి యాత్ర ప్రారంభించిన జనసేనాని పవన్‌కల్యాణ్‌పై విమర్శలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. వారాహి యాత్ర ప్రారంభ సభలో ఎప్పట్లాగే సీఎం వైఎస్ జగన్‌తో పాటు వైసీపీ నేతలపై పవన్‌కల్యాణ్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్‌ను సీఎం పీఠంపై నుంచి దించేస్తానని పవన్ స్పష్టం చేశారు. దీంతో పవన్‌పై వైసీపీ ఎదురు దాడికి దిగింది. పవన్ భాషలోనే సమాధానం చెప్పే క్రమంలో వైసీపీ నేతలు కూడా చెప్పులు చూపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ వైసీపీని ప్రశ్నించడానికి మాత్రమే పుట్టిన పార్టీ జనసేన అని విమర్శించారు. పవన్‌కల్యాణ్ లక్ష్యం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కావడమా? కేవలం ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టడమా? వీటిలో ఏదో ఒకటి చెప్పాలని అంబటి నిలదీశారు. 175 స్థానాల్లో పోటీ చేస్తారా? చేయరా? అనేది చెప్పాలని అంబటి ప్రశ్నించారు. నిలకడ స్వభావం లేని పవన్‌కల్యాణ్ రాజకీయాలకు పనికి రారని అంబటి తేల్చి చెప్పారు.
పవన్‌కు హీరోగా మంచి ఇమేజ్ వుందని అంబటి అన్నారు. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ హీరో అని నిరూపించుకున్న వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన అన్నారు. కానీ సినిమాల్లో హీరోగా ఉండి, రాజకీయాల్లో కమెడియన్ అనిపించుకున్న నాయకుడు పవన్ అని అంబటి వెటకరించారు.
రాజకీయాల్లో హీరోను కానని చిరంజీవి రాజకీయాల నుంచి తప్పుకున్నారన్నారు. పవన్ ఒక చెప్పు చూపిస్తే తాము నాలుగు చెప్పులు చూపిస్తామని హెచ్చరించారు. పవన్‌ను చంద్రబాబు నడుపుతున్నారని అంబటి ఆరోపించారు. ఎన్టీఆర్‌తో పవన్ పోల్చి ఆయన గాలి తీశాడని వైసీపీ శ్రేణులు అంటున్నాయి.