ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ వెనక…?

విశాఖకు చెందిన వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఫ్యామిలీ కిడ్నాప్ అయిన వార్త అతి పెద్ద సంచలనం అయితే కిడ్నాప్ అయిన వారిని మెరుపు వేగంతో విశాఖ పోలీసులు గుర్తించి వారి నుంచి విడిపించడం…

విశాఖకు చెందిన వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఫ్యామిలీ కిడ్నాప్ అయిన వార్త అతి పెద్ద సంచలనం అయితే కిడ్నాప్ అయిన వారిని మెరుపు వేగంతో విశాఖ పోలీసులు గుర్తించి వారి నుంచి విడిపించడం మరో సంచలనం.

అచ్చంగా సినీ ఫక్కీలో సాగిపోయిన ఈ వ్యవహారంలో  కిడ్నాప్ అయింది ఎంపీ సతీమణి జ్యోతి, కుమారుడు శరత్, ఎంపీ స్నేహితుడు కం ఆడిటర్ అయిన జీవీ. ఈ ముగ్గురునీ ఫోన్ ద్వారానే వారి మనుషుల ద్వారానే పిలిపించుకుని కిడ్నాప్ చేశారు.

మొదట ఎంపీ కొడుకుని కిడ్నాప్ చేసి ఆ తరువాత ఎంపీ భార్యను కొడుకు ఫోన్ నుంచి, ఆ తరువాత వారి నుంచి జీవీని రప్పించి కిడ్నాప్ చేశారు. విశాఖకు చెందిన రౌడీ షీటర్ హేమంత్ ఈ కిడ్నాప్ వెనక ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

చాలా ఏళ్ల క్రితం విశాఖ కాంగ్రెస్ మహిళా నాయకురాలు, మాజీ కార్పోరేటర్ విజయారెడ్డిని హత్య చేసిన కేసులో హేమంత్ పాత్ర ఉందని అంటారు. అనేక కిడ్నాపులలో తీవ్రమైన నేరాలలో ఆయన పాత్ర ఉంది. యాభై కోట్ల డీల్ తో ఈ కిడ్నాప్ కధను మొదలెట్టారు.

కోటి వరకూ ఈ ముగ్గురినీ కిడ్నాప్ చేయడం ద్వారా అందుకున్నారు. హైదరాబాద్ లో ఉన్న ఎంపీ నుంచి భారీ మొత్తం లాగేందుకు ఈ  కిడ్నాప్ ని చేశారని పోలీసులు చెబుతున్న దాన్ని బట్టి తెలుస్తోంది. ఇంతకీ ఎంపీ ఎంవీవీ ఫ్యామిలీని ఎందుకు కిడ్నాప్ చేయాలని అనుకున్నారు అన్నదే పోలీసులకు అంతు చిక్కని వ్యవహరంగా ఉంది.

రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఎంపీ ఎంవీవీ విశాఖ లో బిగ్ షాట్ గా ఉన్నారు. ఆయనకు ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. దాంతో ఆర్ధిక లావాదేవీలలో వచ్చిన తేడాలో ఎక్కడైనా ఎవరైనా ఈ కిడ్నాపర్లను ముందు పెట్టి కధ నడిపించారా అన్న డౌట్లు పోలీసు వర్గాలలో ఉన్నాయని తెలుస్తోంది. ఎంపీ ఎంవీవీ రాజకీయంగా కీలకంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఆయన విశాఖ నుంచి వైసీపీ తరఫున పోటీ చేయబోతున్నారు.

గడచిన కొన్నేళ్ళుగా ఆయన అటు వ్యాపారపరంగా ఇటు రాజకీయ పరంగా జోరు చూపిస్తున్నారు. ప్రత్యర్ధులు ఆయనని టార్గెట్ చేశారని తెలుసుతున్నా ఏ రంగంలోని వారు అన్నదే పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. విశాఖ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ ఒక షాకింగ్ న్యూస్ అయితే అంతా కలసి సేఫ్ గా పోలీసులకు దొరకడంతో సుఖాంతం అయింది. అయినా దీని వెనక సవాలక్ష అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పాత్రధారులు పోలీసులకు దొరిగినా సూత్రధారులు ఎవరో తేలేవరకూ ఈ కేసు మిస్టరీగానే ఉంటుంది.