ప‌వ‌న్‌ను వ‌దిలించుకోడానికి కాపేత‌ర కులాలు!

జ‌న‌సేన మౌలిక ల‌క్ష్యాల్లో కులాలు, మ‌తాల‌కు అతీతంగా రాజ‌కీయాలు చేయ‌డం. కానీ జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ వైఖ‌రిలో స్ప‌ష్టమైన మార్పు క‌నిపిస్తోంది. కులం లేనిదే రాజ‌కీయం లేద‌ని ఆయ‌న బ‌లంగా న‌మ్ముతున్నారు. కులం పేరు చెప్పుకోనిదే…

జ‌న‌సేన మౌలిక ల‌క్ష్యాల్లో కులాలు, మ‌తాల‌కు అతీతంగా రాజ‌కీయాలు చేయ‌డం. కానీ జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ వైఖ‌రిలో స్ప‌ష్టమైన మార్పు క‌నిపిస్తోంది. కులం లేనిదే రాజ‌కీయం లేద‌ని ఆయ‌న బ‌లంగా న‌మ్ముతున్నారు. కులం పేరు చెప్పుకోనిదే మోక్షం లేద‌ని ఆయ‌న ఒక నిర్ణ‌యానికి వ‌చ్చ‌న‌ట్టున్నారు. అందుకే త‌న‌ను తాను కాపు కుల నాయ‌కుడిగా లోకానికి చాటి చెప్ప‌డానికి శ్ర‌మిస్తున్నారు. వారాహి యాత్ర‌ను ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో ప‌వ‌న్ మొద‌లు పెట్ట‌డానికి కుల నేప‌థ్య‌మే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

వారాహి యాత్ర సంద‌ర్భంగా ప‌వ‌న్ ప్ర‌సంగంలో కులం ప్ర‌స్తావ‌న‌, సీఎం జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు త‌ప్ప మ‌రొక అంశ‌మే లేదు. ఎంత సేపూ తాను కాపు కుల‌స్తుడిన‌ని , గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో త‌న సామాజిక వ‌ర్గం 60 శాతం వైసీపీకి , త‌న‌కు కేవ‌లం 30 శాత‌మే మ‌ద్ద‌తుగా నిలిచింద‌ని వాపోయారు. కాపు కుల‌స్తుడిని అయిన తాను, మిగిలిన కులాల‌ను ఎలా వ‌దిలి పెట్టుకుంటాన‌ని ఆయ‌న అన‌డంపై సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. నిన్న‌టి స‌భ‌లో కులాల గురించి ప‌వ‌న్ ఏమ‌న్నారో తెలుసుకుందాం.

“నా కాపు కులం ఉనికి ఎక్క‌డ పోగొట్టుకుంటాను. నా త‌ల్లిదండ్రుల్ని ఎలా పోగొట్టుకోలేనో, కులాన్ని కూడా అంతే. నా కులాన్ని గౌర‌వించే ప‌రిస్థితిలో నా రెల్లి సోద‌రుల‌ను పోగొట్టుకుంటానా? నా మాల సోద‌రుల‌ను వ‌దిలేసుకుంటానా? నా మాదిగ సోద‌రుల‌ను వ‌దిలేసుకుంటానా? మా బీసీ ఆడ‌ప‌డుచుల‌ను వ‌దిలేసుకుంటానా? శెట్టి బ‌లిజ‌ల‌ను వ‌దిలేసుకుంటానా? అలా నేను చేయ‌ను. అగ్ర‌వ‌ర్ణాల‌ను వ‌దిలేసుకుంటామా? బ్రాహ్మ‌ణ స‌మాజాన్ని వ‌దిలేసుకుంటామా? నేను నా కులాన్ని దాటి పారిపోను. అన్ని కులాల‌కు ఎలా నిల‌బ‌డుతానో, నా కులానికి కూడా సంపూర్ణంగా నిల‌బ‌డుతాను”

ప‌వ‌న్ గారు మీరు రెల్లి, మాల‌, మాదిగ‌, బీసీ, శెట్టి బ‌లిజ‌లు, బ్రాహ్మ‌ణుల‌ను పోగొట్టుకోవ‌ద్ద‌ని అనుకోవ‌చ్చు. కానీ ప‌దేప‌దే నేను కాపు అని చెప్పుకుంటుంటే మిగిలిన కులాలు వ‌దిలించుకోకుండా ఎలా వుంటాయ‌ని పౌర స‌మాజం ప్ర‌శ్నిస్తోంది. గ‌తంలో ఏ రాజ‌కీయ నాయకుడు మీలా కులం గురించి చెప్పుకోవ‌డం చూడ‌లేద‌నే కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. 

చంద్ర‌బాబు, వైఎస్ జ‌గ‌న్ ఎప్పుడైనా తాము క‌మ్మ‌, రెడ్డి కుల‌స్తుల‌మ‌ని చెప్పుకోవడం చూశామా? అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. ఇలా కులం పేరుతో రాజ‌కీయాలు చేయాల‌ని అనుకుంటే, కాపుల‌తో స‌హా ఏ ఒక్క కులం వెంట నిల‌వ‌ద‌ని తెలుసుకుంటే మంచిద‌ని పౌర స‌మాజం హిత‌వు చెబుతుంది. ముఖ్యంగా కాపేత‌ర కులాలు ప‌వ‌న్ క్యాస్ట్ పాలిటిక్స్ పుణ్యాన ఆయ‌న్ను వ‌దిలించుకోవ‌డం ఖాయమ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట‌ల‌కు, చేత‌ల‌కు పొంత‌నే వుండ‌ద‌ని అంటున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు నిన్న‌టి స‌భ‌లో ప‌వ‌న్ మాట్లాడుతూ ముఖ్య‌మంత్రిలాగా 600 పోస్టుల్లో 550 పోస్టులు ఒకే కులంతో నింప‌నని విమ‌ర్శించ‌డాన్ని నెటిజ‌న్లు గుర్తు చేశారు. అలాంటి వాటికి నేను వ్య‌తిరేకమ‌ని, దామాషా ప్ర‌కారం ఒక కులానికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తామ‌ని ప‌వ‌న్ చెప్ప‌డం మంచిదే అని, కానీ ఆచ‌ర‌ణే ప్ర‌ధాన‌మ‌ని అంటున్నారు. 

ప‌వ‌న్‌క‌ల్యాణ్ జ‌న‌సేన ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా త‌న సొంత అన్న నాగేంద్ర‌బాబు, అలాగే జ‌న‌సేన పీఏసీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్‌ను నియ‌మించార‌ని, వీళ్లు ఏ కుల‌మో చెప్పాల‌ని, ఎలాంటి దామాషా ప‌ద్ధ‌తి పాటించారో చెప్పాల‌నే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇలా ప‌వ‌న్‌క‌ల్యాణ్ పొంత‌న లేని మాట‌లు మాట్లాడ్డం వ‌ల్లే ఆయ‌న‌కు విలువ లేకుండా పోయింద‌నే వాళ్లే సంఖ్య పెరుగుతోంది.