ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శల జడివాన కురిపించడానికి, బురద చల్లడానికి మరో సరికొత్త యాత్రకు రంగం సిద్ధం అవుతోంది.
ఒక యాత్ర పేరుతో ఐదుయాత్రలు ఏకకాలంలో జగన్ మీద విరుచుకు పడడానికి జరగనున్నాయి. ముందస్తు ఎన్నికలు వస్తాయని ఆమేరకు పార్టీని సిద్ధం చేసుకోవాలని ఊహిస్తున్న తెలుగుదేశం పార్టీ త్వర త్వరగా ఎక్కువ నియోజకవర్గాలను కవర్ చేయడానికి ఏకకాలంలో ఐదు ప్రాంతాల్లో పార్టీ కీలక నాయకులందరూ పర్యటించేలాగా ఐదు బస్సు యాత్రలను ప్రారంభిస్తున్నది.
ప్రస్తుతం రాష్ట్రంలో జగన్ వ్యతిరేక యాత్రలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఒకవైపు నారా లోకేష్ కొన్ని నెలల కిందట ప్రారంభించిన యువగళం పాదయాత్ర ప్రస్తుతం రాయలసీమను పూర్తి చేసుకుని నెల్లూరు జిల్లాలోకి అడుగు పెట్టింది. జనస్పందన తక్కువగానే ఉన్నప్పటికీ ఆయన మాత్రం చాలా పెద్దగానే రంకెలు వేస్తూ సాగుతున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్రను తాజాగా బుధవారం నాడే అన్నవరం నుంచి ప్రారంభించారు.
పవన్ ఎప్పటిలాగే తన కులాల గోలతో, సీఎం అవుతాననే నినాదంతో తన పర్యన ప్రారంభించారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడును పరిశీలిస్తే- ఆయన అధికారికంగా యాత్ర అనే పేరు పెట్టుకుని తిరగడం లేదు కానీ, వీళ్ళందరికంటే ఎక్కువ యాత్ర చేస్తున్నట్టుగా ప్రతిరోజు ఎక్కడో ఒకచోట సభలు సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తాజాగా అదనంగా రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రను కూడా ప్రకటించింది.
రాష్ట్రంలో 125 నియోజకవర్గాలను కవర్ చేసేలాగా ఐదు బస్సులను విడివిడిగా ఐదు జోన్లలో తిప్పుతారట. ఆయా ప్రాంతాలకు చెందిన నియోజకవర్గ ఇన్చార్జీలు పార్టీ కీలక నాయకులందరూ ఆ బస్సుల్లో ప్రయాణిస్తూ సభలు సమావేశాలు నిర్వహిస్తారుట. యాత్రలో భాగంగా ఆయా ప్రాంతాల్లోని గ్రామాల్లోనే రాత్రి వేళల్లో కూడా బసచేసి ప్రజలతో మమేకమవుతారట.
125 నియోజకవర్గాలకు పరిమితమైన బస్సు యాత్రల వ్యూహాన్ని గమనిస్తుంటే మిగిలిన 50 నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు ఓటమి తధ్యమని వదిలేసుకున్నారా అనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ ముందస్తు ఎన్నికలు వస్తాయని భయపడుతోంది.
నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర ఇచ్ఛాపురం చేరక ముందే ఎన్నికలు వచ్చేస్తాయని వారు అనుకుంటున్నారు. అందువల్ల బస్సుయాత్ర వంటి రకరకాల రూపాల్లో అన్ని ప్రాంతాలను త్వరత్వరగా కవర్ చేయాలని, అన్నిచోట్లా జగన్ మీద బురద చల్లే కార్యక్రమాలు ఉండాలని ఉబలాటపడుతున్నారు.
ఏదో ఒక పేరు చెప్పి పార్టీని, శ్రేణులను యాక్టివ్ గా ఉంచే ప్రయత్నం చేయకపోతే.. అసలు వారు ఇతర పార్టీల్లోకి జంప్ చేసి వెళ్లిపోతారేమోననే భయం కూడా తెలుగుదేశంలో కనిపిస్తున్నట్లుంది.