జనసేనాని పవన్‌కల్యాణ్ ఎట్టకేలకు వారాహి యాత్ర ప్రారంభించారు. జనసేన శ్రేణులకు ఇది పండుగ చేసుకునే వార్తే. వారాహి యాత్ర ప్రారంభ బహిరంగ సభలో జనసేన శ్రేణుల్ని ఉత్సాహపరిచేలా మాట్లా డారు. ఈ దఫా ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెడతానని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేయడం తనకు ఎంత మాత్రం ఇష్టం లేదని చెప్పారు. తనను ఓడించడానికి కక్ష కట్టారన్నారు. ఈ దఫా కూడా తనను ఓడించడానికి రూ.200 కోట్లైనా సరే వైసీపీ ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉందని పవన్ అన్నారు.
ఉన్న ఓట్ల కంటే అధికంగా పోలయ్యేలా చేసి తనను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేశారని వాపోయారు. ప్రజలిస్తే సీఎం పదవి స్వీకరిస్తానని ప్రకటించి… జనసేన కార్యకర్తల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. పవన్ చెబుతున్న మాటల ప్రకారం ….ఈ దఫా ఆయన రెండు చోట్ల పోటీ చేయరని అర్థం చేసుకోవాల్సి వుంటుంది. వారాహి యాత్ర ప్రారంభించిన సందర్భంగా కనీసం ఇప్పుడైనా తాను ఎక్కడి నుంచి బరిలో దిగనున్నారో చెప్పే దమ్ము, ధైర్యం పవన్‌కు ఉందా? అని వైసీపీ నుంచి ప్రశ్న వెల్లువెత్తుతోంది.
ముందే చెబితే తనను మరోసారి ఓడిస్తామనే భయంలో పవన్ తాను పోటీ చేసే నియోజకవర్గం గురించి దాచి పెట్టారని వైసీపీ నేతలు సెటైర్స్ విసురుతున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత భయపడితే ముందుకు సాగలేరని ప్రత్యర్థులు హితవు చెబుతున్నారు. తనకు భయం అంటే తెలియదని, ప్రాణాల్ని సైతం అర్పించడానికి సిద్ధంగా ఉన్నానని తరచూ పవన్ ప్రగల్భాలు పలుకుతుంటారని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
ప్రాణాలు ఇవ్వాల్సిన పనిలేదని, తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో ప్రకటించి తాను ధైర్యపరుడునని చాటుకుంటే చాలని వ్యంగ్యంగా అంటున్నారు. రూ.200 కోట్లు ఖర్చు పెట్టైనా తనను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని పవన్ బహిరంగంగా తన భయాన్ని ప్రదర్శించారనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ముందే తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది చెబితే సీఎం జగన్ ఏదో ఒకటి చేసి, అక్కడ ఓడించి తీరుతారనే ఆందోళన పవన్‌కు నిద్రలేని రాత్రుల్ని మిగుల్చుతోంది.
అంతెందుకు కుప్పంలో చంద్రబాబును కుదురుగా ఉండనివ్వడం లేదు. ఆరేడు సార్లు కుప్పం నుంచి గెలిచిన చంద్రబాబే రెండుమూడు నెలలకు ఒకసారి అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి. స్థానిక సంస్థల్లో జగన్ కొట్టిన దెబ్బకు బతుకు జీవుడా అని కుప్పంపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం కుప్పంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇక పవన్‌కల్యాణ్ ఒక లెక్కా అనేది జనసేన శ్రేణుల భయం. ఇలా ఎంత కాలం తాను పోటీ చేసే నియోజకవర్గం గురించి ప్రకటించకుండా తిరుగుతారో చూస్తామని వైసీపీ నేతలు అంటున్నారు.