లోకేశ్ క్లాస్‌తో బీటెక్ ర‌వి మారేనా?

పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ ర‌వికి ఇటీవ‌ల నారా లోకేశ్ క్లాస్ తీసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి గెలుపుతో పులివెందుల్లో కూడా టీడీపీ గెలుస్తుందంటూ ఆ పార్టీ నేత‌లు పెద్ద…

పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ ర‌వికి ఇటీవ‌ల నారా లోకేశ్ క్లాస్ తీసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి గెలుపుతో పులివెందుల్లో కూడా టీడీపీ గెలుస్తుందంటూ ఆ పార్టీ నేత‌లు పెద్ద ఎత్తున మైండ్ గేమ్ మొద‌లు పెట్టారు. అయితే ఇదంతా మూణ్ణాళ్ల ముచ్చ‌టే అని తేలిపోయింది. క‌డ‌ప జిల్లాలో లోకేశ్ పాద‌యాత్ర పూర్తి చేసుకునే సంద‌ర్భంలో పులివెందుల టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం అయ్యారు.

ఈ సందర్భంగా త‌మ‌కు నాయ‌కుడే లేర‌ని, ఇన్‌చార్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న బీటెక్ ర‌వి అందుబాటులో ఉండ‌ర‌ని లోకేశ్‌కు ఫిర్యాదు చేశారు. బీటెక్ ర‌వి హైద‌రాబాద్‌, బెంగ‌ళూరుల‌లో వుంటూ, సొంత వ్య‌వ‌హారాల్లో మునిగిపోయి వుంటార‌ని పులివెందుల టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు నేరుగా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బీటెక్ ర‌విపై అంద‌రి ఎదుటే లోకేశ్ ఫైర్ అయ్యార‌ని స‌మాచారం. పులివెందుల్లో గెలుపే ల‌క్ష్యంగా ప‌ని చేయాల్సింది పోయి, టీవీల్లో క‌నిపిస్తూ, పార్టీ కోసం బాగా ప‌ని చేస్తున్న‌ట్టు ఇంకెంత కాలం షోల‌తో ప‌బ్బం గ‌డుపుతార‌ని లోకేశ్ క్లాస్ తీసుకున్న‌ట్టు స‌మాచారం.

దీంతో బీటెక్ ర‌వి అవాక్క‌య్యారు. తాను అంద‌రిలాగానే టీడీపీ కార్య‌క‌ర్త‌నే అని వివ‌ర‌ణ ఇచ్చిన‌ట్టు తెలిసింది. ఇక‌పై అంద‌రికీ అందుబాటులో ఉంటాన‌ని స‌ర్ది చెప్పుకున్నార‌ని పులివెందుల టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కుప్పంలో త‌న‌ను ఓడిస్తాన‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌ల‌క‌డం కాద‌ని, పులివెందుల చూసుకో అని ఇటీవ‌ల సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు హిత‌వు చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బీటెక్ ర‌వి ఎంత వ‌ర‌కు యాక్టీవ్ అవుతార‌నేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

పులివెందుల్లో వైఎస్ కుటుంబానికి మొద‌టి నుంచి ఎస్వీ స‌తీష్‌రెడ్డి పోటీగా నిల‌బ‌డుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో త‌న‌కు చంద్ర‌బాబు వెన్నుపోటు పొడిచార‌ని, వైఎస్ జ‌గ‌న్‌తో ఢీకొడుతున్న త‌న‌కు స‌రైన ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌ని ఎస్వీ స‌తీష్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టీడీపీకి స‌తీష్‌రెడ్డి రాజీనామాతో టీడీపీకి పులివెందుల్లో పెద్ద దిక్కు లేకుండా పోయింది. 

ఏ చెట్టూ లేనిచోట ఆముద‌పు చెట్టే మ‌హావృక్షం అన్న‌చందంగా…. టీడీపీకి గ్రామ‌స్థాయి నాయ‌కుడైన బీటెక్ ర‌వి దిక్క‌య్యారు. జ‌గ‌న్ ప్ర‌త్య‌ర్థిగా రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకుందామ‌ని బీటెక్ ర‌వి అనుకుంటున్నారు. కానీ ఆయ‌న ప‌న్నాగాల‌ను ఎస్వీ స‌తీష్‌రెడ్డి అనుచ‌రులు ప‌డ‌నీయ‌డం లేదు. దీంతో పులివెందుల్లో అంతంత మాత్రంగానే ఉన్న టీడీపీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు మ‌రింత బ‌ల‌హీన‌ప‌రిచేలా ఉన్నాయి. లోకేశ్ క్లాస్ తీసుకున్న త‌ర్వాతైనా బీటెక్ ర‌విలో మార్పు వ‌స్తుందేమో చూడాలి.