ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే అడ్వాన్స్ బుకింగ్స్ తో జోరు చూపించింది ఆదిపురుష్. బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే కొద్దిసేపు సర్వర్ క్రాష్ అయిందంటే, ఆదిపురుష్ హవా అర్థం చేసుకోవచ్చు.
ఈ ఏడాది బిగ్గెస్ట్ రిలీజెస్ లో ఒకటిగా వస్తున్న ఆదిపురుష్ సినిమాకు మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండొచ్చనే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగడం, పీవీఆర్ సంస్థ ఏకంగా లక్ష టికెట్లు అమ్మడంతో ఆదిపురుష్ డే-1 వసూళ్లపై అందరికీ ఆసక్తి నెలకొంది.
ట్రేడ్ అంచనా ప్రకారం, మొదటి రోజే ఈ సినిమాకు 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే ఇదో బిగ్గెస్ట్ రికార్డ్ అవుతుంది.
ప్రాంతాలవారీగా చూసుకుంటే.. ఆదిపురుష్ సినిమా హిందీ వెర్షన్ కు తొలి రోజు 30 కోట్ల రూపాయల నెట్ వసూళ్లూ వచ్చే అవకాశం ఉంది. ఇటు సౌత్ లో (తెలుగు రాష్ట్రాలతో కలుపుకొని) ఈ సినిమాకు మొదటి రోజు కచ్చితంగా 80 కోట్ల రూపాయల గ్రాస్ వస్తుందని అంచనా వేస్తోంది ట్రేడ్. అటు ఓవర్సీస్ లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తో ఆల్రెడీ మిలియన్ డాలర్ మార్క్ క్రాస్ చేసింది.
ఓవరాల్ గా పెంచిన టికెట్ రేట్లు, సినిమాపై ఉన్న హైప్, అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే, మొదటి రోజు ఆదిపురుష్ సినిమా మేజిక్ చేయడం గ్యారెంటీ. ఇక ఆ తర్వాత సినిమా రన్ ఎలా ఉంటుందనేది, రామాయణాన్ని ఓం రౌత్ ఎలా ప్రజెంట్ చేశాడనే అంశంపై ఆధారపడి ఉంటుంది.