ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో టీడీపీ సీటు కోసం ఇద్దరు మహిళల మధ్య గట్టి పోటీ నెలకుంది. కడప అసెంబ్లీ సీటును వైసీపీ ముస్లింలకు రిజర్వ్ చేసింది. కడపలో కార్పొరేటర్‌గా ప్రాతినిథ్యం వహిస్తున్న అంజాద్‌బాషాకు అసెంబ్లీ టికెట్ ఇచ్చిన జగన్ ముస్లింలకు పెద్దపీట వేశారనే సంకేతాల్ని పంపారు. 2014, 2019లలో వరుసగా రెండోసారి కడప నుంచి అంజాద్‌బాషా గెలుపొందారు.
జగన్ కేబినెట్‌లో అంజాద్ చోటు దక్కించుకున్నారు. డిప్యూటీ సీఎంగా అంజాద్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కడపలో వైసీపీ బలంగా వుంది. ఈ నేపథ్యంలో వైసీపీపై పోటీ చేసేందుకు టీడీపీలో పోటీ నెలకుంది. ప్రధానంగా కడప పార్లమెంట్ అభ్యర్థి ఆర్.శ్రీనివాస్‌రెడ్డి సతీమణి మాధవి, అలాగే ఏకైక టీడీపీ కార్పొరేటర్ ఉమాదేవి మధ్య టికెట్ పోరు సాగుతోంది. ఉమాదేవి వరుసగా రెండోసారి కార్పొరేటర్‌గా గెలుపొందారు.
ఉమా మామ అలంఖాన్‌పల్లి లక్ష్మిరెడ్డి గతంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా పని చేశారు. సుదీర్ఘ కాలంగా ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఎలాగైనా కడప అసెంబ్లీ సీటును తన కోడలికి దక్కించుకోవడానికి లక్ష్మిరెడ్డి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. కడపలో ముస్లింలకు వ్యతిరేకంగా ఇతర సామాజిక వర్గాలు, మతాలను రెచ్చగొట్టి, రాజకీయంగా బలపడాలని టీడీపీ వ్యూహాలు పన్నుతోంది. అయితే కడపలో క్రిస్టియన్లు, రెడ్లు, బీసీ, దళిత ఓటర్లు వైసీపీకి అండగా నిలుస్తున్నారు.
ముస్లింలకు వీళ్లంతా మద్దతుగా నిలుస్తుండడం వల్ల వైసీపీ విజయం సాధిస్తోంది. ఈ దఫా కడప ఓటర్లలో మార్పు వచ్చిందని, టికెట్ ఇస్తే తామంటే తాము గెలుస్తామని టీడీపీ అధిష్టానానికి అలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి, ఆర్.శ్రీనివాస్‌రెడ్డి వివరించినట్టు సమాచారం. మరి అధిష్టానం మదిలో ఎవరున్నారో అంతుచిక్కడం లేదు. కడప టికెట్‌పై స్పష్టత లేకపోవడం వల్లే అక్కడ కనీసం లోకేశ్ పాదయాత్రలో బహిరంగ సభ ఏర్పాటు చేయలేదు. కడపలో గెలుస్తామనే ధీమా వుండడం వల్లే టీడీపీ టికెట్ కోసం పోటీ పెరిగిందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.