సిగ్గుచేటు.. ఎస్పీ పేరు చెప్పి సీఐ చేతివాటం

మామూలుగానే పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఆమ్యామ్యాలు ఎక్కువ. ఎవరి స్థాయిలో వాళ్లు అందినకాడికి నొక్కేస్తుంటారు. అయితే ఈ క్రమంలో ఓ సీఐ చేసిన పాడుపని ఏకంగా డిపార్ట్ మెంట్ కే తలవొంపులు తెచ్చిపెట్టింది.…

మామూలుగానే పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఆమ్యామ్యాలు ఎక్కువ. ఎవరి స్థాయిలో వాళ్లు అందినకాడికి నొక్కేస్తుంటారు. అయితే ఈ క్రమంలో ఓ సీఐ చేసిన పాడుపని ఏకంగా డిపార్ట్ మెంట్ కే తలవొంపులు తెచ్చిపెట్టింది. తన దందా కోసం ఏకంగా ఎస్పీ వేరు వాడేశారు ఓ సీఐ. విషయం బయటకు పొక్కడంతో, అతడు పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ లో అతడిపైనే కేసు నమోదైంది. కర్నూలు జిల్లాలో జరిగింది ఈ ఘటన.

పంచలింగాల పరిథిలో సీఐగా పనిచేస్తున్నాడు రాముడు. ఈనెల 19న చెక్ పోస్ట్ వద్ద సాధారణ తనిఖీలు చేపట్టగా.. 75 లక్షల నగదుతో బాలకృష్ణ అనే వ్యక్తిని గుర్తించారు. డబ్బుతో పాటు బాలకృష్ణను స్టేషన్ కు తీసుకెళ్లిన సీఐ పంచాయతీ పెట్టాడు. అయితే బాలకృష్ణ వద్ద డబ్బుకు సంబంధించిన ఆధారాలన్నీ ఉన్నాయి. కానీ రాముడు ఒప్పుకోలేదు.

75 లక్షల నుంచి 15 లక్షలు తీసుకున్నాడు. బాలకృష్ణ ప్రశ్నిస్తే ఎస్పీకి ఇవ్వాలని బుకాయించాడు. అందులో 5 లక్షల్ని మధ్యవర్తులకు ఇచ్చాడు. మిగతా 10 లక్షల్ని తన వద్ద ఉంచుకున్నాడు.

అయితే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయలేదు బాలకృష్ణ. నేరుగా వెళ్లి ఎస్పీనే కలిశాడు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి సమగ్ర విచారణకు ఆదేశించారు. సీఐ పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ లో అతడిపైనే కేసు పెట్టించారు. సీఐతో పాటు మధ్యవర్తుల్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు.

అయితే విషయం తెలిసిన వెంటనే సదరు సీఐ పరారయ్యాడు. మధ్యవర్తులు మాత్రం పోలీసులకు దొరికిపోయారు. త్వరలోనే సీఐని పట్టుకొని, కోర్టు ముందు ప్రవేశపెడతామని చెబుతున్నారు పోలీసులు.