చంద్రబాబు కామెడీ అన్ స్టాపబుల్

అన్ స్టాపబుల్ షో కి చంద్రబాబుని పిలవకుండా బాలయ్య తప్పు చేశారు కానీ, నిజంగా పిలిచి ఉంటే ఆ షోలో కామెడీ అన్ స్టాపబుల్ అయ్యుండేది.  Advertisement కానీ ఆ లోటు లేకుండా తరచూ…

అన్ స్టాపబుల్ షో కి చంద్రబాబుని పిలవకుండా బాలయ్య తప్పు చేశారు కానీ, నిజంగా పిలిచి ఉంటే ఆ షోలో కామెడీ అన్ స్టాపబుల్ అయ్యుండేది. 

కానీ ఆ లోటు లేకుండా తరచూ యూట్యూబ్ లైవ్ లో ఓ కామెడీ ఎపిసోడ్ తో మనముందుకొస్తున్నారు చంద్రబాబు. అసెంబ్లీ రద్దు చేయాలి, అర్జంట్ గా ఎన్నికలు పెట్టాలనే కాన్సెప్ట్ తో తాజాగా మరోసారి నవ్వులు పూయించారు.

ఎన్నికలంటే సరదా..?

చంద్రబాబుకి ఎన్నికలంటే సరదా.. తాను ప్రతిపక్షంలో ఉంటే మరింత సరదా. గతంలో అధికారంలో ఉండి కూడా, అలిపిరి యాక్సిడెంట్ ని బూచిగా చూపి ఆ సరదా పూర్తిగా తీర్చేసుకున్నారు చంద్రబాబు. మూడేళ్ల క్రితమే జగన్ మరోసారి బాబు సరదా తీర్చారు, అసెంబ్లీలో టీడీపీ బలాన్ని 23కి పరిమితం చేశారు. అయినా బాబుకి సరదా తీరలేదు. మూడు రాజధానులు అనగానే సీన్లోకి వచ్చేశారు, అమరావతిపై మాట తప్పారని, అర్జంట్ గా అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు పోతామన్నారు. డెడ్ లైన్ కూడా పెట్టి మరీ కామెడీ చేశారు.

ఆ తర్వాత కనీసం రెండు జిల్లాల్లోనైనా ఎన్నికలు పెట్టండని బతిమిలాడుకున్నారు. చివరకు పాచిక పారకపోవడంతో సైలెంట్ అయ్యారు. ఎలాగూ స్థానిక ఎన్నికలొచ్చాయి, టీడీపీ మరోసారి బొక్కబోర్లాపడింది, తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా సేమ్ సీన్. అయినా బాబుకి ఇంకా ఏదో కావాలి. అందుకే పదే పదే ఎన్నికల జపం చేస్తున్నారు.

ఈమధ్య జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారంటూ హడావిడి చేశారు చంద్రబాబు. రెడీగా ఉండండి తమ్ముళ్లూ ఎన్నికలొస్తున్నాయంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పారు. చివరకు బాబు స్ట్రాటజీ ఏంటో చెప్పేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. చేజారిపోతున్న క్యాడర్ ని నిలబెట్టుకోడానికే బాబు తంటాలు పడుతున్నారని, ముందస్తుకి వెళ్లే ఆలోచన అసలు వైసీపీకి లేదన్నారు. అక్కడితో ఆ కథ ముగిసిపోలేదు.

మళ్లీ ఇప్పుడు అసెంబ్లీలో మూడు రాజధానులు, హైకోర్టు అధికారాలు, అధికార వికేంద్రీకరణపై జరిగిన చర్చలో సీఎం జగన్ తమ విధానాన్ని మరోసారి స్పష్టం చేశారు. దీంతో వెంటనే చంద్రబాబు లైన్లోకి వచ్చారు. అమరావతి రెఫరెండం, అర్జంట్ గా ఎన్నికలంటూ గొడవ చేస్తున్నారు. అసెంబ్లీని రద్దు చేయండంటూ రచ్చ చేస్తున్నారు. ఇంతకీ బాబుకి ఎన్నికలంటే ఎందుకంత తొందర, పదే పదే జనంతో చీవాట్లు తినడానికి ఎందుకంత ఆసక్తి అనేది అర్థం కావడంలేదు.

తాను హుషారుగా ఉండగానే, పార్టీ పగ్గాలు తన చేతిలో ఉండగానే.. ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నట్టున్నారు. 2024వరకు వేచి చూస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. వయసు మీదపడిపోతుండటంతో బాబులో కంగారు పెరిగిపోతోంది. ఆఖరి పోరాటం చేసి, అస్త్ర సన్యాసం చేయాలనుకుంటున్నారు. అందుకే ఎన్నికలు, ఎన్నికలంటూ పరితపిస్తున్నారు. అక్కడేదో జరిగింది, ఇక్కడేదో జరిగిపోతోంది, అది రెఫరెండం, ఇది మరో రెఫరెండం అంటున్నారు. బాబు కామెడీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది.