జగన్ ప్రభుత్వ అధికారాలేంటో ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చెబుతున్నారు. ఈ మేరకు సీఎస్ సమీర్‌శర్మకు ఆయన లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అవినీతి ఆరోపణలపై ఆయన సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వం వచ్చిన మొదలుకుని దాదాపు ఆయన సస్పెన్షన్‌లోనే ఉన్నారు.
ఈ క్రమంలో తన రెండేళ్ల సస్పెన్షన్ గడువు ముగిసిందని, ఇక దాన్ని కొనసాగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని సీఎస్‌కు రాసిన లేఖలో ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి8తో రెండేళ్ల సస్పెన్షన్ గడువు పూర్తయిందని ఆయన తెలిపారు.
నిబంధనల ప్రకారం రెండేళ్లకు మించి సస్పెన్షన్ కొనసాగించాలంటే ….కేంద్ర హోంశాఖ అనుమతి తప్పని సరి అని ఆయన పేర్కొన్నారు. గడువులోపు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర అనుమతి తీసుకోలేదని ఆయన గుర్తు చేశారు.
గత ఏడాది జూలై 31న చివరి సారిగా తన సస్పెన్షన్‌ను పొడిగిస్తూ ఇచ్చిన జీవోను రహస్యంగా ఉంచారని ఆయన ఆరోపించారు. తనకు కాపీ కూడా ఇవ్వలేదన్నారు. అయినప్పటికీ ఫిబ్రవరి 8వ తేదీతో సస్పెన్షన్ గడువు ముగిసిన నేపథ్యంలో పూర్తి జీతం వెంటనే ఇవ్వాలని కోరుతూ ఆయన సీఎస్‌కు లేఖ రాయడం చర్చనీయాంశమైంది.