జగన్ కొత్త కేబినెట్లో బెర్త్ దక్కుతుందనే ప్రచారం జరుగుతున్న ఎమ్మెల్యేల వద్ద క్యూ కనిపిస్తోంది. ప్రస్తుత మంత్రుల వద్ద ఉన్న ఓఎస్డీలు, పీఎస్‌లు, మీడియా కోఆర్డినేటర్లు తదితర బాధ్యతలు నిర్వహిస్తున్న వారు కాబోయే మంత్రుల వద్దకు క్యూ కడుతున్నారని సమాచారం. ప్రస్తుత మంత్రులతో ఇక పనిలేదనే భావన వారిలో కనిపిస్తోంది.
కాబోయే మంత్రులుగా ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యేల దృష్టిలో పడేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సదరు ఎమ్మెల్యేలతో సన్నిహితం ఉన్న వారితో చెప్పించుకుని పరిచయం చేసుకుంటున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా కాబోయే మంత్రులకు వారు ముందస్తు శుభాకాంక్షలు కూడా చెబుతున్నారని తెలిసింది.
అయితే కొత్త కేబినెట్‌పై ప్రచారమే తప్ప, ఇప్పటి వరకు అధికారికంగా ఏ ఒక్కరి పేరు ఖరారు కాలేదు. దీంతో శుభాకాంక్షలు అందుకుంటున్న ఎమ్మెల్యేలు కాసింత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారని తెలిసింది. మాకు మంత్రి పదువులు ఇస్తున్నారని ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? తదితర ప్రశ్నలను ఓఎస్డీలు, మీడియా కోఆర్డినేటర్లు, పీఎస్‌లను ఎమ్మెల్యేలు సంధిస్తున్నారని తెలిసింది.
విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందిందని, తప్పక మంత్రి పదవి వరిస్తుందని నమ్మబలుకుతున్నారని తెలిసింది. ఏది ఏమైనా అమాత్యుల వద్ద కొలువుల కోసం పడరాని పాట్లు పడుతున్నారనేది వాస్తవం.