బాబు బాట‌లో స్టాలిన్.. సీబీఐకి ‘నోఎంట్రీ’!

ఇటీవ‌ల డీఎంకే పార్టీ నేత‌ల టార్గెట్ గా సీబీఐ, ఈడీ దాడులు జ‌రుగుతున్న నేప‌థ్యంలో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐకి తలుపులు మూసేసింది. ఇక నుండి త‌మిళ‌నాట ఏ కేసునైనా…

ఇటీవ‌ల డీఎంకే పార్టీ నేత‌ల టార్గెట్ గా సీబీఐ, ఈడీ దాడులు జ‌రుగుతున్న నేప‌థ్యంలో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐకి తలుపులు మూసేసింది. ఇక నుండి త‌మిళ‌నాట ఏ కేసునైనా ద‌ర్యాప్తు చేయాలంటే రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తి తీసుకోవాల్సి ఉంటుంది.

ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్‌ 1946 (సెంట్రల్‌ యాక్ట్‌ ఎక్స్‌ఎక్స్‌వీ 1946) సెక్షన్‌ 6 ప్రకారం సీబీఐ ఏదైనా రాష్ట్రంలో దర్యాప్తు చేపట్టాలంటే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. అయితే 1989, 1992 సంవత్సరాల్లో ఈ చట్టం ప్రకారం కొన్ని కేసుల విచారణకు తమిళనాడు ప్రభుత్వం… సీబీఐకి అనుమతి ఇచ్చింది. ఆ అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్లు తమిళనాడు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. 

తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసిన విషయం విధితమే. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల వ్యవధిలో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం సీబీఐకి తలుపులు మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. రాజకీయ కక్షతో నరేంద్రమోదీ ప్రభుత్వం తమపైకి కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ఉసిగొల్పుతోందని భావిస్తున్న స్టాలిన్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కాగా తమ మాట‌ వినకపోయినా.. తమకు వ్యతిరేకంగా రాజ‌కీయం చేసిన‌ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి ప్ర‌త్య‌ర్ధి పార్టీల‌ను ఇబ్బందులు పెడుతూన్నార‌నే అపవాదులు బిజెపికి ఉన్నాయి. గ‌తంలో కూడా చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సీబీఐకి నో ఎంట్రీ బోర్డు పెట్టిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే బాబు బాట‌లో చాలా రాష్ట్రాలు నో ఎంట్రీ బోర్టులు పెట్టారు. తాజాగా వాటిలో త‌మిళ‌నాడు కూడా చేరింది.