అరకు కాఫీ అంతర్జాతీయంగా పరిమళిస్తోంది. విశాఖ ఏజెన్సీ కాఫీ రైతులకు సిరులు పండిస్తోంది. వారికి పేరు ప్రఖ్యాతులు ఆర్జించి పెడుతోంది. ఇపుడు హైదరాబాద్ రాయదుర్గ మెట్రో స్టేషన్ వద్ద అరకు వ్యాలీ కాఫీ ఘుమఘుమలు అదరగొడుతున్నాయి.
అక్కడ అరకు కాఫీ షాప్ ని జీసీసీ చైర్ పర్సన్ శోభా స్వాతీరాణి ప్రారంభించారు. హైటెక్ సిటీకి అతి సమీపంలో ఉన్న సాఫ్ట్ వేర్ హబ్ గా ఉన్న రాయదుర్గ మెట్రో స్టేషన్ వద్ద అరకు వాలీ కాఫీ రుచులను అందిస్తున్నామని ఆమె అంటున్నారు.
ప్రపంచ ప్రఖ్యాతి గడించిన అరకు కాఫీ రుచులను సాఫ్ట్ వేర్ నిపుణులు కూడా ఆస్వాదించేందుకు వీలుగా ఈ షాప్ ఏర్పాటు చేశామని అన్నారు. ఫ్యూచర్ లో మరిన్ని సిటీస్ లో మరిన్ని సాఫ్ట్ వేర్ హబ్ లలో అరకు కాఫీ షాప్స్ ని ఓపెన్ చేస్తామని అన్నారు.
అరకు కాఫీ రుచి చూశాక ఆ టేస్ట్ కి అలవాటు పడ్డాక అభిరుచులు కూడా అందంగా ఉంటాయని జీసీసీ అధికారులు అంటున్నారు. అరకు కాఫీ ఈ రోజు ఏపీ నుంచి అతి పెద్ద వాణిజ్య సంపదగా ఉందని చెబుతున్నారు. దీనికి మరిన్ని హంగులు సొబగులు అద్దుతున్నామని, రానున్న రోజుల్లో ప్రతీ చోటా అరకు వాలీ కాఫీ మధురిమలు ఉండేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేసి పెట్టామని అధికారులు చెబుతున్నారు. ఏపీలో ఏముంది అన్న వారికి ఈ కాఫీ రుచి చాలు.
విశాఖ మన్యంలో ఏమి పండుతుంది అని డౌట్ ఉన్న వారికి కాఫీ టేస్ట్ ఒక జవాబు అవుతుంది. ఏపీకే సొంతం అయిన ఈ ఘుమఘుమ ఇపుడు ఇరుగు పొరుగులలోనూ పేరుని తెస్తోంది. రాష్ట్రాన్ని అగ్ర భాగాన నిలబెడుతోంది అని అంటున్నారు.