అలియా భ‌ట్ ది రియ‌ల్ స‌క్సెస్ స్టోరీ!

అంత‌ర్జాతీయ బ్రాండ్ల‌కు దేశీయంగా అంబాసిడ‌ర్లుగా వ్య‌వ‌హ‌రించ‌డం ఒక ఎత్తు. అయితే ఆ బ్రాండ్ల‌కు గ్లోబ‌ల్ బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా నియ‌మితం కావ‌డం మ‌రో ఎత్తు. తొలి ర‌కం జాబితాలో చాలా మంది సెల‌బ్రిటీలు ఉంటారు. కొన్ని…

అంత‌ర్జాతీయ బ్రాండ్ల‌కు దేశీయంగా అంబాసిడ‌ర్లుగా వ్య‌వ‌హ‌రించ‌డం ఒక ఎత్తు. అయితే ఆ బ్రాండ్ల‌కు గ్లోబ‌ల్ బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా నియ‌మితం కావ‌డం మ‌రో ఎత్తు. తొలి ర‌కం జాబితాలో చాలా మంది సెల‌బ్రిటీలు ఉంటారు. కొన్ని కూల్ డ్రింక్ సంస్థ‌ల‌కు అయితే.. రాష్ట్రానికి ఒక అంబాసిడ‌ర్ ఉంటారు. అలాంటి గుర్తింపును పొంద‌డం, అలాంటి కాంట్రాక్టును పొంద‌డం కూడా గొప్పే అన్న‌ట్టుగా ఉంటుంది ప‌రిస్థితి. అలా రాష్ట్రానికి, దేశం స్థాయికే కాదు.. ఒక ఫ్యాష‌న్ బ్రాండ్ కు గ్లోబ‌ల్ అంబాసిడ‌ర్ గా మారింది అలియా భ‌ట్! ఇట‌లీకి చెందిన హైల‌గ్జ‌రీయ‌స్ బ్రాండ్ గూచీ కి గ్లోబ‌ల్ అంబాసిడ‌ర్ గా నియ‌మితం అయ్యింది అలియా భ‌ట్.

స‌రిగ్గా ప‌దేళ్ల కింద‌ట గూచీ బ్రాండెడ్ దుస్తుల‌ను ధ‌రించ‌డ‌మే గొప్ప అని ఫీల‌య్యే స్థితిలో , అదే ఆమె స్టేట‌స్ సింబ‌ల్ అన్న‌ట్టుగా.. ప‌రిస్థితుల నుంచి ఇప్పుడు గూచీకి గ్లోబ‌ల్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఎద‌గ‌డం అలియా భ‌ట్ రియ‌ల్ స‌క్సెస్ స్టోరీ. ఆ బ్రాండ్ దుస్తులను ధ‌రించి, ఆ బ్రాండ్ హ్యాడ్ బ్యాగ్ ను చేతిలో పట్టుకుని, ఆ బ్రాండ్ చెప్పుల‌ను వేసుకోవ‌డ‌మే గొప్ప అనే స్థాయి నుంచి.. ఆమె ధ‌రిస్తే చాలు ఆ బ్రాండ్ కు ప్ర‌మోష‌న్ అనేంత రేంజ్ ఇది! 

ప‌దేళ్ల కింద‌ట అలియా భ‌ట్ మొత్తం గూచీ బ్రాండ్ ధార‌ణ‌తో ఉండ‌గా ఒక ఫొటోను ప‌త్రిక‌లు ప‌బ్లిష్ చేశాయి. చూశారా.. ఆమె మొత్తం ఒక హై రేంజ్ బ్రాండ్ వ‌స్త్ర‌ధార‌ణ‌తో ఉంద‌నే ఆశ్చ‌ర్యం అప్ప‌టిది. ఇప్పుడు.. ఆమె ధ‌రించ‌డ‌మే ఆ బ్రాండ్ కు ప్ర‌మోష‌న్! అప్పుడు అలియా త‌న గుర్తింపు కోసం గూచీని ధ‌రిస్తే, ఇప్పుడు ఆమె ధ‌రించ‌డం గూచీకి గుర్తింపు అవుతోంది. బ‌హుశా ఈ రేంజ్ స‌క్సెస్ అంద‌రికీ సాధ్యం కాక‌పోవ‌చ్చు.

ఒక‌వేళ అలియా గూచీకి ఇండియా స్థాయి బ్రాండ్ అంబాసిడ‌ర్ అయి ఉన్నా.. అదేమంత గొప్ప కాదేమో. అయితే ఆ పేరున్న హై క్లాస్ ఫ్యాష‌న్ బ్రాండ్ కు గ్లోబ‌ల్ అంబాసిడ‌ర్ గా ఆమె నియ‌మితం కావ‌డమే ఆమె స‌క్సెస్.

ఇప్ప‌టి వ‌ర‌కూ ఇండియ‌న్ సినీ, క్రికెట్ సెల‌బ్రిటీల్లో గ్లోబ‌ల్ అంబాసిడ‌ర్లు త‌క్కువ! బ‌హుశా గ్లోబ‌ల్ బ్రాండ్ లు ఇండియ‌న్ సెలబ్రిటీల‌ను గ్లోబ‌ల్ అంబాసిడ‌ర్లుగా నియమించుకున్న దాఖ‌లాలు బాగా త‌క్కువ‌. అయితే ఇప్పుడు అలాంటి అవకాశం అలియాభ‌ట్ పొందింది. ఇది ఆమె ద‌క్కించుకుంటున్న గుర్తింపు.

ఇక అంత‌ర్జాతీయంగా గ్లోబ‌ల్ ల‌గ్జ‌రీ మార్కెట్ విష‌యానికి వ‌స్తే.. ఈ జాబితాలో అమెరికా నంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉంది. గ్లోబ‌ల్ ల‌గ్జ‌రీ బ్రాండ్ల కొనుగోలుకు అమెరిక‌న్లు అమితాస‌క్తిని చూపుతున్నారు.  వీటి కొనుగోలుకు అమెరిక‌న్ల ఆర్థిక శ‌క్తి ఏమీ త‌గ్గ‌లేదు. వీరు ధీటుగా ఉన్నారు ఈ విష‌యంలో. ఈ ల‌గ్జ‌రీ ఫ్యాష‌న్ బ్రాండ్ల కోస‌మే అమెరిక‌న్లు ప్ర‌తి యేటా 262 బిలియ‌న్ డాల‌ర్ల మొత్తాన్ని వెచ్చిస్తున్నారు!

అలాంటి గ్లోబ‌ల్ బ్రాండ్ల దుస్తులు, వ‌స్తువులు, సెంట్లు, సౌంద‌ర్య‌లేపనాల కొనుగోలులో అమెరికా త‌ర్వాతి స్థానంలో చైనా ఉంది. ఈ విష‌యంలో అమెరికాకు ధీటుగా నిలుస్తోంది చైనా. అయితే ఈ జాబితాలో ఇండియా మాత్రం ఈ విష‌యంలో బాగా వెనుక‌న ఉంది. భార‌తీయులు గ్లోబ‌ల్ బ్రాండెడ్ ఫ్యాష‌న్ వ‌స్తుల కోసం వెచ్చిస్తున్న మొత్తం కేవ‌లం 8.5 బిలియ‌న్ డాల‌ర్లు మాత్ర‌మే!

ఇండియాతో పోలిస్తే ఐదో వంతు జ‌నాభా లేని అమెరికా ఏకంగా 262 బిలియ‌న్ డాల‌ర్ల మొత్తం వెచ్చిస్తుంటే ఇండియా అందులో మూడు శాతం మొత్తాన్ని వెచ్చిస్తోంది. ఖ‌రీదైన ఫ్యాష‌న్ బ్రాండ్ల‌కు  భార‌తీయులు ఎంత దూరంలో ఉన్నారో అర్థం చేసుకునేలా చేస్తోంది ఈ గ‌ణాంకం.

అలాగ‌ని ఇండియాలో బిలియ‌నీర్ల‌కు కొద‌వ‌లేదు. ప్ర‌పంచంలోనే ఎక్కువమంది బిలియ‌నీర్లున్న దేశాల్లో మ‌న‌ది మూడో స్థానంలో ఉంది. అమెరికాలో 700 మంది బిలియ‌నీర్లు ఉండ‌గా, చైనాలో 495 మంది బిలియ‌నీర్లున్నారు. ఇండియాలో బిలియ‌నీర్ల సంఖ్య 169. ఆ త‌ర్వాతి స్థానంలో జ‌ర్మ‌నీ 126 మంది బిలియ‌నీర్ల‌తో ఉంది. అయితే ఇండియ‌న్ బిలియ‌నీర్లు కూడా ఈ ఫ్యాష‌న్ మీద వెచ్చిస్తున్న సొమ్ములు అమెరికా, చైనీయుల‌తో పోల్చిన‌ప్పుడు త‌క్కువే అనుకోవాలి!

మ‌రి మ‌న వాటా మార్కెట్ పెద్ద‌గా లేని అంశంలో కూడా అలియా భ‌ట్ గ్లోబ‌ల్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నియ‌మితం అయ్యిందంటే గొప్ప సంగ‌తే. దీనికి కార‌ణం సోష‌ల్ మీడియాలో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ కూడా ఒక‌ట‌ని విశ్లేషిస్తున్నారు. అమెరిక‌న్ సెల‌బ్రిటీలు ఇన్ స్టాలో ఒక పోస్టు పెడితే వ‌చ్చే రియాక్ష‌న్స్ తో పోలిస్తే.. ఇండియ‌న్ సెల‌బ్రిటీలు పెట్టే పోస్టుల‌కు రియాక్ష‌న్ చాలా రెట్లు ఎక్కువ‌. 

సెరెనా విలియ‌మ్స్ ఇన్ స్టా అకౌంట్ నుంచి గూచీ పోస్టు ఒక‌టి పెడితే దానికి ల‌క్ష లైకులు వ‌స్తే ఎక్కువ‌! అదే సియోల్ లో జ‌రిగిన గూచీ ఈవెంట్ నుంచి ఆ బ్రాండ్ వ‌స్త్ర‌ధార‌ణ‌తో అలియా పోస్టు పెడితే ఏకంగా ఏడు ల‌క్ష‌ల లైకులు వ‌చ్చాయ‌ట! ఇండియా మార్కెట్ ఇంకా అభివృద్ధి చెందుతున్న ద‌శ‌లో ఉంది. అయిన‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియా రీచ్ భారీ స్థాయిలో ఉండ‌టంతో కూడా గ్లోబ‌ల్ సంస్థ‌లు ఇండియ‌న్ సెల‌బ్రిటీల‌ను దృష్టిలో పెట్టుకుంటూ ఉండ‌వ‌చ్చు!

జీవ‌న్