శర్వానంద్ ఇప్పటికే ఓ ఇంటివాడయ్యాడు. త్వరలోనే వరుణ్ తేజ్ కూడా బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పబోతున్నాడు. రానా, నిఖిల్, నితిన్ లాంటి హీరోలు ఇప్పటికే పెళ్లిళ్లు చేసుకున్నారు. ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో అతడికే తెలీదు. అయితే ఈ లిస్ట్ లోకి త్వరలోనే మరో హీరో చేరబోతున్నాడనేది టాలీవుడ్ హాట్ టాపిక్.
అతడే హీరో రామ్ పోతినేని. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే రామ్ పోతినేని కూడా తన బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేసి, వైవాహిక జీవితంలోకి అడుగుపెడతాడంట. ఈ మేరకు రవికిషోర్, రామ్ కోసం ఓ మంచి సంబంధం చూసిపెట్టారనేది లేటెస్ట్ టాక్.
35 ఏళ్ల రామ్, టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడిగా కొనసాగుతున్నాడు. చిన్న వయసులో హీరోగా మారిన ఈ నటుడు, ఇన్నాళ్లూ తన కెరీర్ పై మాత్రమే దృష్టి పెడుతూ వచ్చాడు. కొన్నాళ్లుగా వివాహాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు. ఈసారి మాత్రం వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడం గ్యారెంటీ అంటున్నారు రామ్ కు దగ్గరివాళ్లు.
హైదరాబాద్ కే చెందిన ఓ బిజినెస్ మేన్ కూతురితో రామ్ పెళ్లి జరిపించడానికి ప్రయత్నాలు సాగుతున్నట్టు సమాచారం. ఇది పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహం అంటున్నారు.
ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రామ్. ఈ మూవీ తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలి. కానీ కొన్నాళ్లు ఆ సినిమాను పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. దీనికి కారణం పెళ్లి అంటున్నారు చాలామంది.
రామ్ పెళ్లిపై పుకార్లు కొత్తగా వచ్చినవేం కాదు. ఇదివరకు చాలాసార్లు అతడి పెళ్లిపై రూమర్లు వచ్చాయి. అయితే ఈసారి కాస్త గట్టిగా వినిపిస్తున్నాయి. మేటర్ ఏంటనేది త్వరలోనే బయటకు వస్తుంది.