ఎన్‌ఐఏ అదుపులో విశాఖ నేవీ అధికారులు?

విశాఖ నేవీ గొప్పతనం గురించి ఈమధ్యనే అంతటా చాటారు. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూను కూడా రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ స్వయంగా విశాఖ వచ్చి నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో విశాఖలో అంతర్జాతీయ…

విశాఖ నేవీ గొప్పతనం గురించి ఈమధ్యనే అంతటా చాటారు. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూను కూడా రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ స్వయంగా విశాఖ వచ్చి నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో విశాఖలో అంతర్జాతీయ కవాతు కూడా నేవీ నిర్వహించింది.

ఇవన్నీ గత నెలలో జరిగిన విషయాలు. విశాఖ నేవీ వైభవాన్ని చాటే అంశాలు. అయితే లేటెస్ట్ గా వచ్చిన సమాచారం ఏంటి అంటే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించిందని, దాంతో విశాఖ నేవీ అధికారులు కొందరిని అదుపులో తీసుకున్నారని.

దీని మీద ఇపుడు అలజడి రేగుతోంది. ఇక విషయానికి వస్తే గుజరాత్‌, గోద్రా, బుల్దానా, మహారాష్ట్ర, విశాఖలో ఎన్‌ఐఏ సోదాలు చేసిందని సమాచారం. ఈ క్రమంలో విశాఖ నేవీ అధికారులను కూడా అదుపులోకి తీసుకున్నారని చెబుతున్నారు. దానికి కారణం ఏంటంటే దేశానికి చెందిన కీలక సమాచారాన్ని నేవీ అధికారుల ద్వారా పాక్‌ గూఢచారులు తస్కరించినట్లు ఎన్‌ఐఏ గుర్తించిందని అంటున్నారు.

ఇక నేవీ అధికారులను పాక్ గూడఛారులు మనీ ట్రాప్‌ కేసులో ఇరికించడంతో ఎన్‌ఐఏ సోదాలు చేసిందని అంటున్నారు. దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారం కోసమే ఇలా చేశారని అంటున్నారు. విషయం తెలుసుకున్న ఎన్ఐఏ వెంటనే రంగంలోకి దిగిపోయింది. ప్రస్తుతం దీని మీద లోతైన దర్యాప్తు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.  

అలాగే, నాలుగు చోట్ల జరిపిన సోదాల్లో ఎలక్ట్రానిక్‌ డివైజర్స్‌, సిమ్‌కార్డులు, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న ఎన్‌ఐఏ అధికారులు స్వాధీనపరచుకున్నారని కూడా చెబుతున్నారు. మరి చూడాలి ఈ దర్యాప్తులో మరెన్ని విషయాలు వెలుగు చూస్తాయో.