Advertisement

Advertisement


Home > Movies - Reviews

RRR Review: మూవీ రివ్యూ: ఆర్ ఆర్ ఆర్

RRR Review: మూవీ రివ్యూ: ఆర్ ఆర్ ఆర్

టైటిల్: ఆర్ ఆర్ ఆర్
రేటింగ్: 2.5/5
తారాగణం: ఎన్.టి.ఆర్, రామ్ చరణ్, ఆలియాభట్, అజయ్ దేవగన్, ఒలీవియా మోరిస్, సముద్రఖని, ఆలిసన్ డూడి, రే స్టీవెన్సన్, శ్రియా శరణ్ తదితరులు
కథ: కె.వి. విజయేంద్ర ప్రసాద్
సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా
కెమెరా: సెంథిల్ కుమార్
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
నిర్మాత: డి.వి.వి. దానయ్య
దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి
విడుదల తేదీ: 25 మార్చ్ 2022

భారతదేశ వెండితెర మీద తెలుగువాడు మోగించిన విజయదుందుభి "బాహుబలి". ఐదేళ్లవుతున్నా ఆ ప్రతిధ్వని ఇంకా మారుమ్రోగుతూనే ఉంది. మళ్లీ ఆ మహాదర్శక దిగ్గజం రాజమౌళి చేతులమీదుగా వచ్చిన ఆర్.ఆర్.ఆర్ మీద అంచనాలు అంబరాన్నంటాయి.

నాలుగేళ్ల క్రితమే మొదలై కరోనా కారణంగా రెండేళ్ల పుణ్యకాలం గడిచిపోయినా ఈ చిత్రం మీద ప్రేక్షకులకి ఏమాత్రం ఆసక్తి తగ్గలేదు.

పైగా ఇన్నేళ్లు ఆగడం వల్ల బాగా ఊరిన ఊరగాయలాగ, పాతబడి ఘాటెక్కిన మద్యంలాగ అభిమానుల్ని ఊరించింది.

అనుకున్నట్టే గత ఐదేళ్లుగా చూడని విధంగా లెక్కలేనన్ని ప్రత్యేక షోలు, అర్థరాత్రి నుంచే ప్రదర్శనలు మొదలుపెట్టింది.

రాజమౌళి సినిమా అంటేనే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. కనుక సినిమాలోని ఎమోషన్ కానీ, విజువల్ వండర్ కానీ అంతరిక్షమంత ఎత్తులో ఉంటే తప్ప ప్రేక్షకులని మైమరిపించలేదు.

ఓటమి రుచెరగని రాజమౌళి తన రాజముద్రని మళ్లీ వేసాడా? విజయసంతకాన్ని మరలా చేశాడా? చూద్దాం...

ముందు నుంచీ చెప్తున్నట్టు ఇది చారిత్రక పాత్రలతో అల్లిన కల్పితకథ. అది కూడా ఏవో సాదాసీదా పేర్లు కావు. తెలుగు వారందరికీ తెలిసిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రలని ఎంచుకుని ఆ ఇద్దరితో ఒక సూపర్ హీరోస్ కథ లాంటిది రాసేసుకున్నారు. 

ఇదంతా ముందే చెప్పినా రాజమౌళి మీద నమ్మకం వల్ల ఏదో వండర్ చేసే ఉంటాడులే అని అందరూ అనుకున్నారు. 

నటీనటుల దగ్గర్నుంచి, నిర్మాత దాకా....డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ప్రేక్షకులదాకా అందరూ రాజమౌళిని గుడ్డిగా నమ్మారు. 

అయితే అలా నమ్మడం ఎంత తప్పో ఈ సినిమా నిరూపించింది. మొట్టమొదటి సారి రాజమౌళి అత్యంత దారుణంగా నిరాశపరిచాడు. 

"అసలీ సినిమా రాజమౌళియే తీసాడా" అనే డౌటు చూస్తున్నంత సేపూ కలుగుతూనే ఉంటుంది. కథ మీద, ఎమోషన్ మీద ఏ మాత్రం కసరత్తు చేయకుండా హడావిడిగా తీసేసి బాహుబలి-2 వల్ల వచ్చిన హైపుని అడ్డం పెట్టుకుని క్యాష్ చేసుకునే ప్రయత్నమిదని స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే స్క్రిప్ట్ మీద శ్రద్ధ పెట్టినట్టు ఏ మాత్రం కనిపించడంలేదు. 

బాహుబలి-2 క్లైమాక్స్ లో తాటి చెట్లతో ఫైటింగ్ సీన్ పెడితే కొంత వరకూ జనం వవ్వుకున్నా అది జానపదం కాబట్టి చెల్లిపోయింది. కానీ ఈ "ఆర్ ఆర్ ఆర్" లో అన్నీ ఆ బాపతు యాక్షన్ ఎపిసోడ్సే. 

టెక్నికల్ గా కెమెరా వర్క్ తప్ప మిగిలినవన్నీ మూసకొట్టుడుగానే ఉన్నాయి. సంభాషణలు రాయడానికి ఏ మాత్రం బుర్రపెట్టినట్టు అనిపించదు. ఒక్కటంటే ఒక్క డయలాగ్ కూడా హత్తుకోదు. 

ఈ స్థాయి బడ్జెట్టున్న సినిమాకి ఉండాల్సిన స్క్రిప్ట్ కాదిది. 

సంగీతపరంగా కూడా అంతంతమాత్రమే అని చెప్పాలి. "నాటు నాటు", "కొమరం భీముడో" పాటలు మినహాయిస్తే నేపథ్య సంగీతం కూడా ఎప్పుడూ వింటున్నట్టే ఉంది తప్ప ప్రత్యేకంగా రోమాంచితం చేసే విధానం మాత్రం లేదు. 

కథారచయిత విజయేంద్ర ప్రసాద్, దర్శకుడిగా రాజమౌళి మాత్రం విఫలమయ్యారనే చెప్పాలి. 

ఒక పదేళ్ల వయసుండే పిల్లని బ్రిటీష్ దొరగారు, దొరసాని తమ ప్యాలెస్ కి మెహెందీ పెట్టడానికి తీసుకుపోతారు (అంతకు మించి ఏ కారణమూ చూపించలేదు మరి). ఆమెని బాధలు పెట్టరు. పైగా చిన్నదొరసాని ఆ పిల్లని ప్రేమగా చూసుకుంటుంటుంది. చూసే ప్రేక్షకుడికి అంతాబానే ఉంది కదా అనిపిస్తుంది. కానీ ఆమెని విడిపించడానికి జూనియర్ ఎంటీయార్ పెద్ద యాక్షన్ ఎపిసోడ్ కండక్ట్ చెస్తాడు. ఆ యాక్షన్ ఎపిసోడ్లో ప్రాణాలు పోతున్నా కిడ్నాప్ చేసిన పిల్లని మాత్రం వదలరు తెల్లదొరలు. ఈ సినిమాలో ఇదే మెయిన్ ప్లాట్ అంటే ఇక అర్థం చేసుకోవాలి!

* ఎన్.టి.ఆర్- ఓలీవియా ట్రాక్ చూస్తుంటే "లగాన్" లో అమీర్ ఖాన్- తెల్ల దొరసాని ట్రాక్ గుర్తొస్తుంది.

* జైల్లో రామ్ చరణ్ ని చూస్తే "వేట" లో చిరంజీవి సీన్ స్ఫురణకొస్తుంది. 

* అజయ్ దేవగన్ ఆత్మాహుతి సీన్ చూస్తే "జీరో డార్క్ 30" లోని ఒక్క సన్నివేశం జ్ఞప్తికొస్తుంది. 

* స్కాట్ దొరగారి సతీమణి పతీసమేతంగా కూర్చుని ఎన్.టి.ఆర్ ని కొట్టమని చెప్పే సీన్ చూస్తుంటే మైకేల్ జాక్సన్ "రిమెంబర్ ద టైం" పాటలోని ఈజిప్షియన్ రాజు రాణి ట్రాక్ లాగ అనిపిస్తుంది. 

* కొమరం భీం, చిన్నదొరసాని కలిసి డ్యాన్స్ చేసే సీన్ చూస్తే "టైటానిక్" కూడా జరంత యాదికొస్తుంది. 

ఇలా పలు రకాల సీన్స్ గుర్తొచ్చీ గుర్తొచ్చీ చివరకి అమీర్ ఖాన్ "థగ్స్ ఆఫ్ హిందుస్తాన్" కూడా ఎందుకో అలా గుర్తొచ్చి ఇలా మాయమౌతుంది. 

బ్రిటీష్ వాళ్ళంటే ఉత్తిపుణ్యానికి, అతి చిన్న కారణాలకి "యూ బ్రౌన్ స్కిన్" అంటూ కనిపించినవాడినల్లా కొట్టుకుంటూ పోయేవారా? ఏమో?! 

హిస్టరీ పక్కనపెడితే తెర మీద కథగా చెబుతున్నప్పుడు అలాంటి సీన్స్ పెడితే జనం కనెక్ట్ కాకపోగా నవ్వుకుంటారన్న ఆలోచన రాదా?

"దేరీజ్ హార్డ్లీ ఎనీ బ్లడ్" అంటూ ఎన్.టి.ఆర్ ని ఇంకా కొట్టమని స్కాట్ దొర భార్య అరిస్తే జనం హల్లో గొల్లుమన్నారు. అసలా సీన్లో ఎన్.టి.ఆర్ ద్వారా ఎమోషన్ పండాలి. కానీ ట్రోలింగ్ పండింది.

సినిమా మొదలయ్యి గంట గడుస్తున్నా ఒక్క విజులు కొట్టే సీన్ రాకపోవడం ఆశ్చర్యం. నెమ్మదిగా అందుకుంటుందిలే అని వెయిట్ చేసే ప్రేక్షకుడికి చివరిదాకా నిరాశే మిగులుతుంది. 

ఎక్కడా తెలివి ప్రదర్శించకుండా అన్ని చోట్లా వైర్ వర్క్ తోటి, గ్రాఫిక్స్ తోటి నింపేసిన యాక్షన్ సీక్వెన్సులు, మనసుకి ఎక్కడా హత్తుకోని ఎమోషన్ ఈ సినిమాని కంటెంట్ పరంగా బిలో యావరేజ్ చేసి పారేశాయి. 

ఎన్.టి.ఆర్, రామ్ చరణ్ ఇద్దరూ తమ తమ స్థాయిల్లో నటించి మెప్పించారు. అయితే సెకండాఫు చివరిలో ఎన్.టి.ఆర్ ని డౌన్ చేసినట్టయ్యింది. ఇద్దరు హీరోలని బ్యాలెన్స్ చేసే విషయంలో రాజమౌళి తడబాటు కనిపించింది. 

ఆలియాభట్  హీరోయిన్ కి తక్కువ, గెస్ట్ ఆర్టిస్టుకి ఎక్కువ అన్నట్టుంది.

అజయ్ దేవగన్ కాసేపు కనిపించినా బలమైన ఇంపాక్ట్ ఉన్న పాత్ర మాత్రం కాదు. 

సముద్రఖని, శ్రియా శరణ్ ప్యాడింగుకి సరిపోయారంతే. 

సినిమాలో ఇంగ్లీషు డయలాగుల డామినేషన్ కూడా ఎక్కువగానే ఉంది. ఓటీటీకైతే సబ్ టైటిల్స్ ఉంటాయి కాబట్టి అనుకోవచ్చు. కానీ హాల్లో తెలుగు మాధ్యమంలో చూస్తున్నప్పుడు బి, సి సెంటర్ ఆడియన్స్ కి ఈ ఇంగ్లీషువల్ల ఇబ్బంది కలిగే అవకాశమెక్కువ.   

అసలిందులో దేశభక్తి చూద్దామంటే ఆ కథే లేదు. సినిమా అంతా అయిపోయాక రోలింగ్ టైటిల్స్ టైములో "ఎత్తరా జెండ" అంటూ వచ్చే పాటకి ఈ సినిమాకి లింకే లేదు. 

అయితే అత్యంత భారీ బడ్జెట్ సినిమా కావడం, ఇద్దరు పెద్ద హీరోలు పని ఏయడం కారణంగా దీనిని బలవంతంగా పాజిటివ్ గా చూడాలనుకుంటారు చాలామంది. ఎంత చూసినా, ఏ చేసినా ఇది రాజమౌళి స్థాయి కథా కాదు, కథనం కాదు. అది మాత్రం వాస్తవం. 

బాటం లైన్: హడావిడి ఎక్కువ- విషయం తక్కువ

నేను రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నానంటే...

జ‌గ‌న్ ను చూసి నేను మారను