ఆదిపురుష్ కొత్త స్టిల్స్ వచ్చాయి. పట్టాభిషేకం టైమ్ లో రాఘవుడి స్టిల్ ఇది. స్వయంవరం టైమ్ లో జానకి పోజు ఇది. ఇక లంకాదహణంలో హనుమంతుడు, కోపోద్రిక్తుడైన రావణుడు అంటూ మరో 2 స్టిల్స్ కూడా రిలీజ్ అయ్యాయి. సరిగ్గా విడుదలకు 2 రోజుల ముందు వచ్చిన స్టిల్స్ కావడంతో చాలామంది వాటిని సినిమాలోని పోస్టర్లు అనుకున్నారు.
కానీ వాస్తవానికి ఆదిపురుష్ సినిమాకు, ఈ పోస్టర్లకు ఎలాంటి సంబంధం లేదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ – ఏఐ పరిజ్ఞానం వాడి తయారుచేసిన స్టిల్స్ ఇవి. ఆదిపురుష్ సినిమాలో పాత్రల్ని ఏఐలో తయారుచేస్తే ఇలా ఉంటారంటూ ఈ స్టిల్స్ పొద్దున్నుంచి చక్కర్లు కొడుతున్నాయి.
ఏమాటకామాట చెప్పుకోవాలి, ఈ స్టిల్స్ చాలా బాగున్నాయి. మరీ ముఖ్యంగా రాఘవుడి గెటప్, జానకి లుక్ అద్భుతంగా ఉన్నాయి. సినిమా అంతా కాకపోయినా, కనీసం ఏదో ఒక సందర్భంలో ఈ లుక్స్ లో హీరోహీరోయిన్లను చూపిస్తే భలేగా ఉంటుందనే అభిప్రాయం సోషల్ మీడియాలో ఎక్కువమంది నుంచి వ్యక్తం అవుతోంది. అయితే ప్రస్తుతానికి ఆ అవకాశం లేదు.
ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మైథలాజికల్ మూవీ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. అటు ఓవర్సీస్ లో కూడా భారీగా విడుదలకు ప్లాన్ చేసినప్పటికీ, హాలీవుడ్ మూవీ 'ఫ్లాష్' కారణంగా ఆదిపురుష్ కు స్క్రీన్ కౌంట్ తగ్గింది.