ఏపీ అసెంబ్లీలో ఇవాళ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ప్రసంగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా సాగింది. రాజధాని ఎంపిక అధికారం శాసన వ్యవస్థకు లేదని ఇటీవల హైకోర్టు సంచలన తీర్పునివ్వడంపై తాను కలత చెందినట్టు ఇటీవల ధర్మాన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో శాసన, న్యాయవ్యవస్థల పరిధుల గురించి చట్టసభలో చర్చించాలని కోరుతూ సీఎంకు రాసిన లేఖలో ధర్మాన కోరారు. ఈ రోజు అసెంబ్లీలో చర్చకు అనుమతి ఇచ్చారు.
ధర్మాన ప్రసంగం ఆద్యంతం అద్భుతంగా సాగింది. ఇటీవల కాలంలో ఇలాంటి ప్రసంగాన్ని ఏపీ చట్టసభల్లో చూడడం ఇదే మొదలు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తన ప్రసంగంలో ఎక్కడా దూషణలకు పాల్పడకుండా, విధానాల పరంగా మంచీచెడుల గురించి మాత్రమే ప్రస్తావించారు.
అత్యున్నత న్యాయమూర్తులు వివిధ సందర్భాల్లో శాసన, న్యాయ వ్యవస్థ పరిధుల గురించి ఏమన్నారో ధర్మాన సభ దృష్టికి తీసుకొచ్చి సభ్యుల ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆసక్తిగా విన్న ఆ ప్రసంగం ఎలా సాగిందంటే…
దేశంలో రాజ్యాంగమే అత్యున్నతమైందన్నారు. శాసన వ్యవస్థలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవడం ఎంత వరకు సబబని ఆయన ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థ స్వీయ నియంత్రణ ఉండాలని కోరారు. ఇతర వ్యవస్థల్లో పరిధికి మించి జోక్యం మంచిది కాదని ఆయన అన్నారు.
మూడు రాజధానులపై అసెంబ్లీ చట్టం చేయొద్దంటూ హైకోర్టు తీర్పు తర్వాత న్యాయ నిపుణులతో చర్చించానన్నారు. ఏపీ అసెంబ్లీకి కొన్ని పరిమితులు పెడుతూ హైకోర్టు వ్యాఖ్యలు చేయడం తనకు బాధ కలిగించిందన్నారు. నాలుగు దశాబ్దాలుగా శాసనసభలో సభ్యుడిగా ఉన్న తనకు వ్యవస్థల అధికారాలేంటో తెలుసుకోవాలన్న ఆలోచన వచ్చిందన్నారు. ఇందులో భాగంగానే అసెంబ్లీలో చర్చకు అనుమతించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు లేఖ రాసినట్టు చెప్పుకొచ్చారు.
అయితే న్యాయవ్యవస్థల ప్రాధాన్యతను తగ్గించాలన్న అభిప్రాయం తనకు ఏ మాత్రం లేదన్నారు. కానీ, బాధ్యతల్ని కట్టడి చేసే విధంగా ఉన్నాయన్న అభిప్రాయం మాత్రమే తాను వ్యక్తం చేస్తున్నట్టు కుండబద్దలు కొట్టారు. రాజరికం వ్యవస్థ మొదలుకుని ప్రజాస్వామ్య వ్యవస్థ అవతరణకు దారి తీసిన పరిస్థితులను వివరంగా చెప్పారు. రాజ్యాంగం రావడం వెనుక ఎంతో మంది కృషి ఉందన్నారు.
రాజ్యాంగం లక్ష్యం ప్రజల సంక్షేమమే అన్నారు. వ్యవస్థలన్నీ ప్రజల పక్షమే ఉన్నాయన్నారు. మూడు వ్యవస్థల్లో ప్రజాభిప్రాయాన్ని తెలిపేది శాసనసభ వ్యవస్థే అని స్పష్టం చేశారు. మన దేశంలో రాజ్యంగమే గొప్ప అని అన్నారు. శాసన, కార్య, న్యాయ వ్యవస్థలకు వాటి విధులపై స్పష్టత ఉండాలన్నారు. న్యాయవ్యవస్థకు దురుద్దేశాలు ఆపాదించకూడదన్నారు. కానీ తీర్పులను సమీక్షించే అధికారం పౌరులకు ఉందన్నారు. న్యాయవ్యవస్థతో పాటు మిగిలిన రెండు వ్యవస్థలు సమానమేనని సుప్రీం కోర్టు చెప్పిందని ధర్మాన సభా వేదికగా సభ్యుల హర్షధ్వానాల మధ్య స్పష్టం చేశారు. అంతేకాదు. మూడు వ్యవస్థల్లో శాసన వ్యవస్థ సభ్యులు ప్రతి ఐదేళ్లకో సారి ప్రజాతీర్పును ఎదుర్కోవాల్సి వుంటుందని గుర్తు చేశారు. న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల్లో ఉన్న వాళ్లకు ఆ అవసరం ఉండదన్నారు.
సమాజం పట్ల తమకు పూర్తి బాధ్యత ఉందని గతంలో సుప్రీం కోర్టు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. జ్యుడీషియిల్ యాక్టివిజం పేరుతో కోర్టులు విధులు నిర్వహించకూడదని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఒకవేళ శాసన వ్యవస్థ సరిగా పని చేయకుంటే.. ఆ విషయాన్ని ఎన్నుకున్న ప్రజలే చూసుకుంటారని, అంతేకానీ, కోర్టులు జోక్యం చేసుకోకూడదని అత్యున్నత న్యాయస్థానమే చెప్పిందని అద్భుతంగా ఆవిష్కరించారు. కోర్టులు ఎంత నిగ్రహంగా వ్యవహరించాలో కూడా సుప్రీం కోర్టు వివరించిందన్నారు.
శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలన్నీ ప్రజల కోసమే ఉన్నాయన్నారు. న్యాయవ్యవస్థ, కోర్టులంటే తమకు అపారమైన గౌరవం ఉందన్నారు. విధి నిర్వహణలో ఒకదానిని మరొకటి పల్చన చేస్తే.. పరువు తీసుకోవడం తప్పించి ఏం ఉండదని ధర్మాన హెచ్చరించారు. అందుకే ఒకరి విధి నిర్వహణలో మరొకరు జోక్యం చేసుకోవద్దని, రాజ్యాంగ బాధ్యతలను నెరవేర్చకుండా అడ్డుపడొద్దని విజ్ఞప్తి చేశారు. న్యాయ వ్యవస్థకు ముప్పు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కోర్టులదేనని సుప్రీం కోర్టు చెప్పిందని ఆయన గుర్తు చేశారు.
రాజ్యాంగ బద్దమైన విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు మాత్రమే న్యాయ వ్యవస్థకు ఉందని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. శాసనం చేసే సమయంలో జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. ‘కోర్టులు న్యాయం మాత్రమే చెప్పాలి. శాసనకర్త పాత్రలను కోర్టులు పోషించకూడదని సుప్రీం చెప్పింది. లేని అధికారాలను పోషించకూడదని, ప్రభుత్వాన్ని నడపొద్దు, నడపలేవు’ అని అత్యున్నత న్యాయస్థానమే పేర్కొన్న విషయాన్ని సందర్భోచితంగా గుర్తు చేశారు.
ఒక పార్టీ సభలో మెజార్టీతో అధికారంలో ఉందంటే.. అంతకు ముందు ఉన్న ప్రభుత్వ విధానాలను మార్చమని ప్రజలు అధికారం ఇవ్వడమే అవుతుంది కదా అని ధర్మాన కీలక అంశాన్ని ప్రస్తావించారు. అలాంటప్పుడు ఆ అధికారమే లేదని న్యాయస్థానాలు చెప్పడం ఎంత వరకు సమంజసమని ధర్మాన సూటిగా ప్రశ్నించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో ఎన్ని అభ్యంతరా లున్నా… ఇది మా విధానం అని కేంద్రం చెప్పలేదా? శాసన సభ అధికారాల విషయంలో కోర్టు అభ్యంతరాలు ఉంటే ఎన్నికలు ఎందుకు?. శాసన వ్యవస్థ అధికారాలను అడ్డుకుంటే ప్రజలకే నష్టం అని ధర్మాన హెచ్చరించారు. శాసన వ్యవస్థ నిర్ణయాల్లో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుంటే, ఆ వ్యవస్థ పనితీరుపై కూడా ప్రజలు ప్రశ్నిస్తారని ధర్మాన కీలక వ్యాఖ్యలు చేశారు.