మరి కొన్ని గంటల్లో ఆర్ఆర్ఆర్ సినిమా ఫలితం తేలిపోబోతోంది. సినిమా బాగుంటుందా? మిక్స్ డ్ టాక్ నా? ఇలాంటివి అన్నీ కీలకం కాదు. సినిమా ఏమేరకు వసూలు చేయగలదు అన్నది కీలకం. దాని మీదే రాజమౌళి తరువాత చేయబోయే మహేష్ సినిమా బడ్జెట్, మార్కెట్ అన్నీ ఆధారపడతాయి.
రాజమౌళి సినిమాల విషయంలో బయ్యర్లు దాదాపు జూదం ఆడుతున్నట్లే వ్యవహరిస్తున్నారు. బాహుబలి వన్ ఎంత వసూలు చేసిందో, ఆ అమౌంట్ కు బాహుబలి 2 కొన్నారు. అంటే బాహుబలి వన్ కన్నా ఎక్కువ వసూలు చేస్తేనే బయ్యర్లు గట్టెక్కుతారు అనే లెక్కలో కొనుగోలు చేసారు. అదృష్టం కొద్దీ లాటరీ తగిలేసింది.
ఇప్పుడు బాహబలి 2 కన్నా ఎక్కువ రేట్లు పెట్టి ఆర్ఆర్ఆర్ కొనుగోలు చేసారు. ఏనాడో జమానా కాలం నాడు ఎవరి రేట్ల మేరకు వాళ్లు అడ్వాన్స్ లు ఇచ్చారు. రూపాయి వడ్డీ చూసుకున్నా ఎంత అవుతుంది అన్నది ఎవరి లెక్కలు వారికి వున్నాయి. అదికాదు పాయింట్. భారీగా తీయడం, భారీగా అమ్మడం, అలా భారీగా అమ్మిన రేట్లు రాబట్టు కోవడం కోసం ప్రభుత్వం నుంచి భారీ రేట్లు తెచ్చుకోవడం, అది చాలక వెనక చాటున భారీ రేట్లకు కౌంటర్లలో విక్రయించడం.
ఈ విషయంలో ఆర్ఆర్ఆర్ ఆంధ్రలో 200 కోట్లకు పైగా వసూలు చేయాల్సి వుంటుంది. అప్పుడే బయ్యర్లు గట్టెక్కుతారు. నైజాంలో 150 కోట్లకు పైగా వసూలు చేయాల్సి వుంటుంది. ఇది ప్రూవ్ కావాల్సి వుంది. అప్పుడే మహేష్ సినిమాకు మళ్లీ ధైర్యంగా 500 కోట్లు ఖర్చు చేయగలరు. మళ్లీ వెయ్యి కోట్లు మార్కెట్ చేయగలరు. ఎందుకంటే బాహుబలి 2 కి ఆర్ఆర్ఆర్ కు మధ్య నాలుగేళ్ల గ్యాప్ వుంది. ఈ గ్యాప్ లో ఆడియన్స్ ట్రెండ్, బాక్సాఫీస్ ట్రెండ్, కోవిడ్ ప్రభావం ఇవన్నీ ఎలా వున్నాయన్నది తెలియాల్సి వుంది.
మూడు రేటింగ్ లు వచ్చినా, రాకపోయినా కూడా ఈ మధ్య వచ్చిన భారీ సినిమాలు ఒక రేంజ్ వరకే వసూళ్లు సాగించాయి. ఇప్పడు ఆర్ఆర్ఆర్ వ్యవహారం అలా కాదు. భయంకరమైన వసూళ్లు రాబట్టాలి. ఇప్పటికి ఆంధ్రలో సోమవారం నాటికి టికెట్ లు అవైలబుల్ గా వున్నాయి. మౌత్ టాక్ బట్టి వీటి డిమాండ్ ఆధారపడి వుంటుంది.
ఆర్ఆర్ఆర్ కు టాక్ బాగుంటూ వసూళ్లలో టార్గెట్ చేరకపోతే ఆ ప్రభావం మహేష్ సినిమా మీద కచ్చితంగా పడుతుంది. మరో రెండేళ్ల తరువాత వచ్చే సినిమా అది. ఆ వేళకు ఓటిటి ప్రభావం కూడా భయంకరంగా వుంటుంది. మహేష్ సినిమా బడ్జెట్ ను తగ్గించుకునే చాన్స్ రాజమౌళికి వుండదు. అలాఅని పెద్ద రేట్లు పెడితే జనం ఎలా రియాక్ట్ అవుతారు అన్నది పాయింట్.
మొత్తానికి మహేష్ – రాజమౌళి సినిమా మీద ఆర్ఆర్ఆర్ ప్రభావం అయితే వుంటుంది.