ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌లో మళ్లీ పాత నాయకుడిని చాలా కాలం తర్వాత చూశామనే భావన వైసీపీ కార్యకర్తలు, నాయకుల్లోనే కాదు సామాన్య జనంలో కూడా కలుగుతోంది. ఇవాళ మూడు రాజధానులు, అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణ అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో వైఎస్ జగన్ సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. జగన్ ప్రసంగం అద్భుతంగా సాగిందనే అభిప్రాయం ఆయన ప్రత్యర్థుల నుంచి వ్యక్తం కావడం విశేషం.
అసెంబ్లీలో జగన్ మాట్లాడిన ప్రతి మాటలోనూ ఎంతో ధీమా కనిపించిందని చెబుతున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి ఆయన అసెంబ్లీ వేదికగా తేల్చి చెప్పారు. హైకోర్టు తన పరిధి దాటి రాజధానిపై తీర్పు ఇచ్చిందని అభిప్రాయపడ్డారు. తాను చెప్పదలుచుకున్న విషయాల్లో ఎలాంటి మొహమాటం లేకుండా కుండబద్దలు కొట్టారు.
రాజ్యాంగంలో ఎవరెవరి పరిధి ఏంటనేది స్పష్టంగా పేర్కొన్నారన్నారు. ఇందులో శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు మూడు ఫిల్లర్లన్నారు. ఏ వ్యవస్థ అయినా తమ పరిధిలో పని చేస్తేనే మిగిలిన వ్యవస్థలన్నీ సజావుగా సాగుతాయన్నారు. లేదంటే వ్యవస్థలన్నీ కుప్పకూలుతాయని సీఎం జగన్ హెచ్చరించారు.
మంచి చట్టాలు చేయకపోతే ప్రజలే నిర్ణయం తీసుకుంటారని జగన్ స్పష్టం చేశారు. మంచి చట్టాలు తీసుకొస్తే ప్రజలు మళ్లీ ఆ అధికార పార్టీనే ఎన్నుకుంటారన్నారు. లేదంటే తిరస్కరిస్తారని అన్నారు. అసలు మూడు రాజధానుల చట్టాన్నే వెనక్కి తీసుకున్నప్పుడు, వాటిపై తీర్పు ఇవ్వడం ఏంటని ఆయన హైకోర్టును ప్రశ్నించారు.
ఇటీవల రాజధానిపై హైకోర్టు తీర్పు చూస్తే రాజ్యాంగ పరంగానే కాకుండా రాష్ట్ర శాసనసభకు ఉన్న అధికారాలను కూడా ప్రశ్నించే విధంగా ఉందని ఆయన అన్నారు. ఇటీవల రాష్ట్ర హైకోర్టు తన పరిధి దాటినట్టు మనందరి మనోభావాల్లో అనిపించిందన్నారు. అందుకే చట్టసభలో ఇవాళ చర్చించాల్సి వచ్చిందన్నారు. హైకోర్టు అంటే తమకు అపారమైన గౌరవం వుందంటూనే శాసన వ్యవస్థను గౌరవాన్ని కాపాడుకోవడం కూడా కర్తవ్యమని స్పష్టం చేశారు.
రాష్ట్ర అసెంబ్లీకి ఉన్న అధికారాలను కాపాడుకోవాలన్న బాధ్యత లెజస్లేచర్‌పై ఉందంటూ జగన్ తన వాదనను గట్టిగా వినిపిం చారు. ఇది మనతో ఆగిపోయేది కాదని స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోందన్నారు. ప్రజలు ఎన్నుకుంటేనే ఇక్కడికి వచ్చామని గుర్తు చేశారు. గౌరవాన్ని, ఈ అధికారాలను మనం కాపాడుకోకపోతే , మనం ప్రశ్నించకపోతే ఇక ఆ తర్వాత లెజిస్లేచర్ అనేదానికి అర్థమే లేకుండా పోతుందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.
న్యాయ వ్యవస్థ చట్టాలు చేస్తుందా? లెజిస్టేచర్ చట్టాలు చేస్తుందా? అనేది పెద్ద ప్రశ్నగా చరిత్రలో నిలిచిపోతుందని జగన్ చెప్పుకొచ్చారు. ఇలా అనేక అంశాలపై జగన్ ప్రసంగం ఆద్యంతం ఎంతో ధీమాగా, శాసన వ్యవస్థతో పాటు ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడేలా సాగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ప్రత్యర్థులపై జగన్ విరుచుకుపడిన నాయకుడు ఇవాళ ఆయనలో చూశామనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.