పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నులు తగ్గించి సెస్ రూపంలో చేస్తున్న వసూళ్ళలో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వాటా ఇవ్వాలని వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో గురువారం ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతున్నాయని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న క్రూడాయిల్ ధరలను ప్రభుత్వం ఇందుకు సాకుగా చూపిస్తోంది. కానీ వాస్తవం ఏమిటంటే ఈ ప్రభుత్వం వచ్చిన 8 ఏళ్ళ కాలంలో పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర పన్నులు మూడు రెట్లు పెరిగాయి.
2014లో వినియోగదారుడు లీటర్ పెట్రోల్‌పై రూ.9.48 పైసలు పన్నుగా చెల్లిస్తే ఇప్పుడది రూ.27.90 పైసలకు పెరిగింది. మొత్తం మీద 2014-15 ఆర్థిక సంవత్సరంలో పెట్రోలియం ఉత్పాదనలపై 1 లక్షా 15 వేల కోట్ల రూపాయలు పన్నుల రూపేణా వసూలు చేయగా 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆ మొత్తం 3 లక్షల 72 వేల కోట్ల రూపాయలకు చేరింది. అంటే పెట్రోలియం ఉత్పాదనలపై కేంద్ర పన్నులు 223 శాతం పెరిగాయని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
ఒకవైపు కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పాదనలపై పన్నులు, సెస్‌లను ఎడాపెడా పెంచుకుంటూ పోతూ మరోవైపు పెట్రోల్‌పై విధించే వ్యాట్‌ను తగ్గించాలంటూ అనేక సందర్భాలలో రాష్ట్రాలకు విజ్ఞప్తులు చేస్తోంది. పెట్రోల్‌పై టాక్స్ రూపంలో వచ్చే ప్రతి 100 రూపాయల ఆదాయంలో కేవలం 2 రూపాయలను మాత్రమే రాష్ట్రాలకు ఇస్తున్న వాస్తవాన్ని కేంద్ర ప్రభుత్వం అంగీకరించకుండా దాటవేస్తోందని విజయసాయి రెడ్డి అన్నారు.
పెట్రోల్‌పై విధించే పన్నులలో రాష్ట్రాలకు వాటా దక్కకుండా చేసేందుకు సెస్‌ల రూపంలో భారీగా వసూళ్ళు చేస్తోంది. సెస్‌ల ద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాలకు పంచవలసిన అవసరం లేనందునే కేంద్ర ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎంచుకుందని అన్నారు. గడచిన అయిదేళ్ళలో పెట్రోలియం ఉత్పాదనలపై విధించిన సెస్‌లు 56 శాతం నుంచి 95 శాతానికి పెరిగింది. వివిధ కారణాల వలన గణనీయంగా తగ్గిపోతున్న ఆదాయాన్ని భర్తీ చేసుకునేందుకు రాష్ట్రాలు పెట్రోల్‌పై వ్యాట్‌ను విధించక తప్పని అనివార్య పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలో వినియోగదారులపై మోపిన భారాన్ని తగ్గించేందుకు పెట్రోల్‌పై పన్నులను పునఃవ్యవస్థీకరించాల్సిన తక్షణ అవసరం ఉంది. అలాగే పెట్రోలియం ఉత్పాదనలపై విధించే పన్నుల్లో రాష్ట్రాలకు సమాన పద్దతిలో వాటా ఇవ్వాలి. అందువలన పెట్రోల్‌పై విధించే పన్నులను తగ్గించేందుకు, సెస్‌ల రూపంలో వసూలు చేసే ఆదాయాన్ని రాష్ట్రాలతో పంచుకునేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు విజయసాయి రెడ్డి చెప్పారు.