'కశ్మీర్ ఫైల్స్' సినిమాకు ఢిల్లీ పరిధిలో పన్ను మినహాయింపును ఇవ్వాలంటూ భారతీయ జనతా పార్టీ చేసిన డిమాండ్ పై ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అభ్యంతరం తెలిపారు. ఆ సినిమాకు పన్ను మినహాయింపును ఇచ్చే ఉద్దేశం తమకు ఏ మాత్రం లేదని, ఆ సినిమాను అంతగా ప్రజలు చూడాలనుకుంటే.. దాన్ని యూట్యూబ్ లో అప్ లోడ్ చేయవచ్చని కూడా కేజ్రీవాల్ సలహా ఇచ్చారు.
కశ్మీరీ పండిట్ల పేరు చెప్పి కోట్ల రూపాయలను దండుకుంటున్నారని కూడా కేజ్రీవాల్ ఘాటుగా విమర్శించడం విశేషం. కశ్మీరీ ఫైల్స్ సినిమాను భారతీయ జనతా పార్టీ దాని భక్తులు భుజాన మోస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పలు చోట్ల ఆ సినిమాకు పన్ను మినహాయింపును ఇచ్చారు. కొందరు ఉత్తరాది బీజేపీ నేతలు అయితే ఆ సినిమాకు ఫ్రీ షోలు కూడా వేస్తున్నారు.
అంతే కాదు.. ఆ సినిమా రూపకర్తలను బీజేపీ నెత్తిన పెట్టుకుంటోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా వారిని ఆహ్వానించారట! ఆ సినిమాలో అర్థసత్యాలను చూపించారనే విమర్శలు ఉండనే ఉన్నాయి.
బీజేపీ మాత్రం ఆ సినిమాను ఒక రేంజ్ లో ప్రమోట్ చేస్తోంది. ప్రతిపక్షంగా స్పందిస్తూ.. ఆ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలని ఢిల్లీలో డిమాండ్ చేసింది. అయితే కేజ్రీవాల్ మాత్రం ఈ వ్యవహారాన్ని దుయ్యబట్టారు.
ఎనిమిదేళ్లుగా ప్రధానమంత్రి గా ఉన్న మోడీ.. ఇలాంటి సినిమాలను నమ్ముకోవడం ఏమిటని కేజ్రీవాల్ విమర్శించారు. కశ్మీరీ పండిట్లకు కానీ, దేశ సమస్యల విషయంలో కానీ.. ఎనిమిదేళ్లలో మోడీ చేసింది ఏమిటంటూ.. కేజ్రీవాల్ విమర్శించారు.