ఒక్కో సినిమాతో తనకు తానే ఒక కొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేసుకుంటూ వెళ్తున్నాడు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. సై అనే సినిమా ఆకట్టుకోలేకపోయినా.. అపజయం ఎరగని దర్శకుడు అనే ట్యాగ్ లైన్ ను తన పేరు ముందు నిత్యం పెట్టుకోగలుగుతున్నాడు. ఈ మేరకు ఆరాధనీయ దర్శకుడు అయ్యాడు చాలా మందికి!
మరి ఆర్ఆర్ఆర్ సినిమా ఫలితం తర్వాత.. ఈ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ తర్వాత.. రాజమౌళి తదుపరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుంది? ఈ దర్శకుడిని ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీ, మీడియా ఎలా ట్రీట్ చేస్తుందనేది ఆసక్తిదాయకమైన అంశం.
రాజమౌళి బాక్సాఫీస్ దర్శకుడు. బాక్సాఫీస్ వద్ద బొమ్మ హిట్ అనిపించుకుంటేనే.. రాజమౌళి పేరు నిలబడ్డట్టు! కే విశ్వనాథ్ ఇమేజ్ కాదు, శంకర్ తరహా కాదు. విశ్వనాథ్ వంటి దర్శకుడి సినిమాను కమర్షియల్ కోణంలో చూడలేం, కమర్షియల్ కోణానికి సామాజిక స్పృహను యాడ్ చేసే శంకర్ సినిమాలు కూడా ఒక్కోసారి ఈ వేటు నుంచి తప్పించుకుంటాయి!
2.0 సినిమా దాని బడ్జెట్ కు తగ్గట్టుగా వసూళ్లను సంపాదించలేదు! కమర్షియల్ గా ఆ సినిమా ఫెయిల్యూరే. అయితే… అలాంటి సినిమాతో కూడా మానవ జీవితాన్ని మరోలా స్పృశించగలిగాడు శంకర్. రాజమౌళి కూడా ఇప్పుడు తీస్తున్నది సామాజిక స్పృహతో కూడిన సినిమానే అనొచ్చు. అయితే ఎంత చెప్పినా.. ఆర్ఆర్ఆర్ కు భారతీయుడు సినిమా తరహా ఇమేజ్ రాదు! అల్లూరి, కొమురం భీమ్ వంటి మహనీయుల పాత్రలతో గంతులు వేయించాడనే నెగిటివ్ విశ్లేషణ విడుదలకు ముందే మొదలైంది!
మానవాళి జీవితాలను టచ్ చేసే నైజం రాజమౌళి సినిమాల ధోరణిలోనే ఎక్కడా కనిపించదు. ఫిక్షన్, కమర్షియల్, మాస్, ఎలివేషన్లు.. ఇవే రాజమౌళి మెటీరియల్. మంచి ప్రయత్నం.. అనే మాటలు రాజమౌళి సినిమాల విషయంలో మాట్లాడలేం!
పక్కా పైసా వసూల్! పెట్టిన బడ్జెట్ ఎంత, వచ్చిన వసూళ్లు ఎంత.. అనేదే దర్శకుడిగా రాజమౌళి విజయపరంపరను కొనసాగించబోతోంది. ఆరు వందల కోట్ల రూపాయల రేంజ్ కు థియేటరికల్ రైట్స్ ను అమ్మారనే సినిమాకు ఆ మేరకు వసూళ్లు దక్కితేనే.. దర్శకుడిగా రాజమౌళి హిట్! ఈ సినిమా హిట్ కాకపోయినా.. రాజమౌళి అవకాశాలకూ, మార్కెట్ కూ ఎలాంటి ఢోకా ఉండదు కూడా! అయితే.. కమర్షియల్ డైరెక్టర్, కమర్షియల్ హిట్ కొట్టడమే మార్గం!