ప‌వ‌న్‌పై అమిత్ షా శీత‌క‌న్ను!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శీత క‌న్ను వేశారా? అంటే… ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. అమిత్ షా తెలుగు రాష్ట్రాల్లో ప‌ర్య‌టించిన ప్ర‌తి సంద‌ర్భంలోనూ వివిధ వ‌ర్గాల‌కు చెందిన ముఖ్యుల‌ను…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శీత క‌న్ను వేశారా? అంటే… ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. అమిత్ షా తెలుగు రాష్ట్రాల్లో ప‌ర్య‌టించిన ప్ర‌తి సంద‌ర్భంలోనూ వివిధ వ‌ర్గాల‌కు చెందిన ముఖ్యుల‌ను క‌ల‌వ‌డం సంప్ర‌దాయంగా పెట్టుకు న్నారు. ప్ర‌ధానంగా తెలంగాణ ప‌ర్య‌ట‌న‌ల్లో ఆయ‌న ఈనాడు మీడియా సంస్థ‌ల అధినేత రామోజీరావు, అలాగే టాలీవుడ్ హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్‌, క్రీడాకారుడు పుల్లెల గోపిచంద్‌తో భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, మీడియాధిప‌తి వేమూరి రాధాకృష్ణ‌ను క‌ల‌వాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

త‌న పార్టీని వ్య‌తిరేకించే వాళ్ల‌ను సైతం అమిత్ షా క‌లుసుకుంటున్నారు. బాగానే వుంది. మ‌రి బీజేపీ మిత్ర‌ప‌క్ష‌మైన జ‌న‌సేనాని ప‌వన్‌క‌ల్యాణ్‌ను క‌ల‌వాల‌ని క‌నీసం ఒక్క‌సారైనా అమిత్ షా త‌లంపున‌కు రాక‌పోవ‌డం ఏంట‌నే నిలదీత ఎదురైతోంది. ముమ్మాటికీ ఇది ప‌వ‌న్‌పై వివ‌క్షే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పోనీ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఢిల్లీకి వెళ్లి అపాయింట్‌మెంట్ అడిగినా అమిత్ షా క‌ల‌వ‌డానికి నిరాక‌రిస్తున్నార‌ని జ‌న‌సేన నేతలు గుర్తు చేస్తున్నారు.

కేవ‌లం బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా, మ‌రి కొంద‌రు బీజేపీ పెద్ద‌ల అపాయింట్‌మెంట్‌తో ప‌వ‌న్‌ను సంతృప్తిప‌రుస్తున్నార‌నే విమ‌ర్శ లేక‌పోలేదు. ఇదే చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షా, జేపీ న‌డ్డాల‌తో భేటీ కావ‌డాన్ని జ‌న‌సేన నాయ‌కులు ప్ర‌స్తావిస్తున్నారు. ప‌వ‌న్‌కు మాత్రం అపాయింట్‌మెంట్ కుద‌ర‌ద‌ని చెబుతార‌ని, మ‌రి ప్ర‌త్య‌ర్థి పార్టీల అధినేత‌ల‌ను ఎలా క‌లుస్తున్నార‌ని జ‌న‌సేన నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. 

ఇటీవ‌ల విశాఖ‌కు అమిత్ షా వ‌చ్చార‌ని, ఏపీలో వారాహి యాత్ర‌ను త‌న మిత్ర‌ప‌క్ష పార్టీ అధినేత ప్రారంభిస్తున్నార‌ని తెలిసి కూడా క‌నీసం ఆశీస్సులు అందించ‌క‌పోవ‌డం వివ‌క్ష కాకుండా మ‌రేంట‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు.