కాళ్లకు మొక్కడం ఏమిటి? షాక్?

సాధారణంగా సినిమా రంగంలో కాళ్లకు వంగి నమస్కరించడం అన్నది వుంది. నార్త్ లో పెద్దలు ఎవరు కనిపించినా చిన్న‌ వాళ్లు కాళ్లకు మొక్కడం అన్నది చాలా అంటే చాలా కామన్. కానీ అది ఓ…

సాధారణంగా సినిమా రంగంలో కాళ్లకు వంగి నమస్కరించడం అన్నది వుంది. నార్త్ లో పెద్దలు ఎవరు కనిపించినా చిన్న‌ వాళ్లు కాళ్లకు మొక్కడం అన్నది చాలా అంటే చాలా కామన్. కానీ అది ఓ పెద్దరికం వున్నవారి విషయంలోనే. 

ఇప్పటి తరంలో చూసుకుంటే దర్శకుడు రాఘవేంద్రరావుకు ఇలా కొందరు కాళ్లకు మొక్కుతూ వుంటారు. కాళ్లకు మొక్కడం తప్పేమీ కాదు. కానీ దానికి ఓ వయస్సు, ఓ పెద్దరికం వుంటే ముచ్చటగా వుంటుంది. అలా కాకపోతే అటువాళ్ల అహం తృప్తి పర్చడమో, లేదా ఇటు వాళ్లు కాకాపట్టడమో అనిపిస్తుంది తప్ప సహజంగా అయితే కాదు.

నిన్నిటికి నిన్న మంగళగిరిలో జరిగిన ఈ సంఘటన టాలీవుడ్ లో డిస్కషన్ పాయింట్ గా మారింది. మైత్రీ అధినేతల్లో ఒకరైన ‘యలమంచిలి రవిశంకర్’ జన‌నేన అధిపతి ‘కొణిదెల పవన్ కళ్యాణ్’ కాళ్లకు మొక్కారు. సినిమా నిర్మాతలు అందరూ పవన్ చేస్తున్న యాగం చూడడానికి వెళ్లారు. అందరూ పవన్ దగ్గరకు వెళ్లి చేతులు జోడించి నమస్కరించారు. కానీ ఒక్క యలమంచిలి రవిశంకర్ మాత్రమే చటుక్కున వంగి పవన్ కాళ్లకు నమస్కరించారు.

ఇటు రవిశంకర్-అటు పవన్ మధ్యలో ఏజ్ గ్యాప్ ఏమన్నా పెద్దగా వుందా అంటే అదీ కాదు. మహా వుంటే రెండు మూడేళ్లు తేడా వుంటుంది. పవన్ ఓ సాదా సీదా మనిషి. సినిమా హీరో. రాజకీయ నాయకుడు. హోమం చేస్తున్న రుత్వికులకు, లేదా అక్కడ ఎవరైనా స్వామీజీనో, పండితులో వుంటే ఇలా కాళ్లకు నమస్కారం పెట్టడం అభ్యంతరకరం కాకపోవచ్చు.

పవన్ జస్ట్ ఓ సినిమా హీరో. పైగా అదే రవిశంకర్ సంస్థ దగ్గర ఏనాడో కోట్లు రెమ్యూనిరేషన్ తీసుకుని, సినిమా విషయంలో జాప్యం చేస్తూ వస్తున్నారు. మరి దేనికి మొక్కినట్లు? అన్నదే టాలీవుడ్ లో డిస్కషన్ పాయింట్ గా మారింది. 

సినిమా గ్రూపుల్లో ఈ వీడియో తెగవైరల్ అవుతోంది. దాదాపు ఇండస్ట్రీ టాప్ పీపుల్ దగ్గరకు, హీరోల దగ్గరకు ఈ వీడియో వాట్సాప్ లో ఫార్వార్ట్ అయినట్లు తెలుస్తోంది.