ప‌వ‌న్‌ ఏకు మేకు అవుతాడా?

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్వ‌తంత్రంగా రాజ‌కీయాలు చేయ‌నంత వ‌ర‌కూ చంద్ర‌బాబుతో పాటు ఎల్లో మీడియాకు బాగా న‌చ్చుతారు. ఎందుకంటే వైఎస్ జ‌గ‌న్‌ను వ్య‌క్తిగ‌తంగా వ్య‌తిరేకిస్తుండ‌డం వ‌ల్ల ఎలాగూ చంద్ర‌బాబు ప‌ల్ల‌కి మోస్తార‌ని వారి న‌మ్మ‌కం. అయితే…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్వ‌తంత్రంగా రాజ‌కీయాలు చేయ‌నంత వ‌ర‌కూ చంద్ర‌బాబుతో పాటు ఎల్లో మీడియాకు బాగా న‌చ్చుతారు. ఎందుకంటే వైఎస్ జ‌గ‌న్‌ను వ్య‌క్తిగ‌తంగా వ్య‌తిరేకిస్తుండ‌డం వ‌ల్ల ఎలాగూ చంద్ర‌బాబు ప‌ల్ల‌కి మోస్తార‌ని వారి న‌మ్మ‌కం. అయితే ప‌వ‌న్‌క‌ల్యాణ్ మూడ్ ఎప్పుడు ఎలా వుంటుందో ఎవ‌రూ చెప్ప‌లేరు. ప‌వ‌న్ ఏంటో తెలియాలంటే ఆయ‌న వ్య‌క్తిగ‌త‌, రాజకీయ జీవితాల్ని చూస్తే అర్థం చేసుకోవ‌చ్చ‌ని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఇవాళ్టి నుంచి ప‌వ‌న్ జ‌నంలోకి వెళుతున్నారు. వారాహి యాత్ర చేప‌ట్ట‌నున్నారు. వైసీపీ ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓట్ల‌ను చీల‌నివ్వ‌న‌ని ఇంత వ‌ర‌కూ ఆయ‌న చెబుతూ వ‌చ్చారు. ఒంట‌రిగా పోటీ చేసి వీర‌మ‌ర‌ణం పొంద‌లేన‌ని, అందుకే టీడీపీతో పొత్తు పెట్టుకుంటాన‌ని ప‌వ‌న్ ప‌దేప‌దే అంటున్నారు. అయితే గౌర‌వ‌ప్ర‌ద‌మైన సీట్లు ఇస్తేనే పొత్తు వుంటుంద‌నే ష‌ర‌తు విధించారు. రాజ‌కీయాల్లో గౌర‌వం, మ‌ర్యాద అనేవి పైకి చెప్పుకోడానికే. రాజ‌కీయ పార్టీలు అవ‌కాశాల గురించే త‌ప్ప‌, మిగిలిన అంశాల‌ను అస‌లు ప‌ట్టించుకోవు.

ఇందులో టీడీపీ దిట్ట‌. న‌మ్మినోళ్ల‌ను న‌ట్టేట ముంచ‌డంతో చంద్ర‌బాబు ఆరితేరార‌నే విమ‌ర్శ వుంది. ఈ నిజం తెలిసి కూడా బాబుతో మ‌రోసారి రాజ‌కీయ ప్ర‌యాణం సాగించ‌డానికి ప‌వ‌న్ సిద్ధ‌మ‌య్యారంటే, ఆయ‌న ఇబ్బందులేవో మ‌రి అనే చ‌ర్చ న‌డుస్తోంది. వారాహియాత్ర‌కు జ‌నం పోటెత్తుతార‌న‌డంలో సందేహం లేదు. త‌న యాత్ర‌కు వెల్లువెత్తే జ‌నాన్ని చూసి ప‌వ‌న్ ఆలోచ‌న‌ల్లో మార్పు వ‌స్తే? ఇప్పుడిదే ప్ర‌శ్న టీడీపీని భ‌య‌పెడుతోంది. జ‌న‌సేన‌కు 22 సీట్లు ఇచ్చి, ఆయ‌న సామాజిక వ‌ర్గం, అభిమానుల మ‌ద్ద‌తు పొందాల‌నేది టీడీపీ ఎత్తుగ‌డ‌.

జ‌న‌సేనాని త‌క్కువ సీట్ల‌కు ఒప్పుకుంటే తెలుగుదేశానికి రాజ‌కీయంగా లాభం. కాదు, కూడ‌దంటే మాత్రం టీడీపీ న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంది. వారాహి యాత్రకు జ‌నం పోటెత్తితే ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎక్కువ సీట్లు కావాల‌ని డిమాండ్ చేస్తార‌నే ఆందోళ‌న కూడా టీడీపీలో లేక‌పోలేదు. అందుకే వారాహి యాత్ర‌పై టీడీపీ ఎక్కువ దృష్టి పెట్టింది. రాజకీయాల్లో ప‌క్క పార్టీ బ‌ల‌ప‌డాల‌ని ఇత‌ర పార్టీలు ఎట్టి ప‌రిస్థితుల్లో కోరుకోవు.

చంద్ర‌బాబు బాగుండాల‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ లాంటి వాళ్లు త‌ప్ప‌, మ‌రే ఇత‌ర పార్టీ అధ్య‌క్షుడు ఆకాంక్షించ‌రు. అయితే చంద్ర‌బాబు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ప‌వ‌న్ ఎంత కాలం ప‌ని చేస్తార‌నేది ప్ర‌శ్న‌. అందుకే వారాహి యాత్ర‌తో ప‌వ‌న్ బ‌ల‌ప‌డ‌కూడ‌దనేది టీడీపీ కోరిక‌. తాత్కాలిక రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం జ‌న‌సేన‌కు జ‌నాద‌ర‌ణ ఉండాల‌ని ఆశిస్తే, అదే రానున్న రోజుల్లో త‌మ‌కు ఏకు మేక‌వుతుంద‌ని టీడీపీ భ‌యం.