చిన జీయర్.. ఇక అంతా చూసి ఆనందించడమే!

త్రిదండి రామానుజ చినజీయర్ ఏదైనా వక్ర ఉద్దేశంతో సమతామూర్తి విగ్రహాన్ని ప్రతిష్టించారనే ఎవ్వరూ ఆరోపించలేరు. కొందరు విమర్శలు చేస్తున్నప్పటికీ.. అక్కడ అమ్ముకునే 150 రూపాయల టికెట్ డబ్బుల కోసం ఆయన అంత ప్రాజెక్టు చేశారని…

త్రిదండి రామానుజ చినజీయర్ ఏదైనా వక్ర ఉద్దేశంతో సమతామూర్తి విగ్రహాన్ని ప్రతిష్టించారనే ఎవ్వరూ ఆరోపించలేరు. కొందరు విమర్శలు చేస్తున్నప్పటికీ.. అక్కడ అమ్ముకునే 150 రూపాయల టికెట్ డబ్బుల కోసం ఆయన అంత ప్రాజెక్టు చేశారని నిందవేయలేం. ఆయన ఎంతటి సదుద్దేశంతోనైనా సమతామూర్తిని.. అంత వైభవంగా ప్రతిష్ఠించి ఉండవచ్చు గానీ.. ఆ దెబ్బకు ఆయన ప్రభలు మసకబారుతున్నట్టుగా కనిపిస్తోంది. ఆయన ప్రాబల్యం- ప్రభుత్వాల వద్ద- పలచబడుతున్నట్టుగా కనిపిస్తోంది.

సమతామూర్తి రామానుజ విగ్రహావిష్కరణ వేడుకలకు చిన జీయర్ కేంద్రంలోని బీజేపీ పెద్దలందరినీ తీసుకురావడం ద్వారా పెద్ద సంచలనమే సృష్టించగలిగారు. కానీ.. అంతకు మించి రాజకీయ వివాదాల్ని ఆయన నెత్తికెత్తుకున్నారు. అప్పటికే కేంద్రంలోని బీజేపీమీద కేసీఆర్ యుద్ధం ప్రకటించి ఉన్న నేపథ్యంలో సమతామూర్తి వేడుకకు వారు రావడమే గులాబీ దళాలకు కంటగింపు అయింది. చినజీయర్ ను కలిసిన ప్రతిసారీ అత్యంత భక్తి ప్రపత్తులతో సాష్టాంగపడి ఆయన కాళ్లు మొక్కే అలవాటు ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. కనీసం సమతామూర్తి కార్యక్రమానికి కూడా వెళ్లలేదు. 

ఈలోగా సమ్మక్క సారలమ్మ ల గురించి చినజీయర్ చేసిన వ్యాఖ్యల దుమారం.. తెలంగాణ వ్యాప్తంగా ఆయనకు అనేకానేక నిందలు, దూషణలు తెచ్చి పెట్టింది. టీఆర్ఎస్ నేతలు కాస్త అదుపు, సంయమనం పాటించారు గానీ.. ఇతర పార్టీ నేతలు ఒక రేంజిలో ఆయనను విమర్శించారు. 

కేసీఆర్ కాళ్లుమొక్కే గురువుగా సంపాదించుకున్న ప్రభ యావత్తూ హఠాత్తుగా మసకబారిపోయింది. ముహూర్తం పెట్టింది చినజీయరే అయినప్పటికీ.. యాదాద్రి నరసింహస్వామి ఆలయ ఉద్ఘాటనకు క నీసం ఆయనకు ఆహ్వానం కూడా అందలేదు. నిజానికి ఆలయ పునర్నిర్మాణం చాలావరకు ఆయన కనుసన్నల్లోనే జరిగిందనే ప్రచారం ఉన్నా.. ప్రారంభం వేళకు ఆయనను పక్కన పెట్టారు. 

పోనీ ఏపీలో ఏమైనా బావుకున్నారా అంటే అదీ లేదు. విశాఖలో టీటీడీ వారు ఒక బ్రహ్మాండమైన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మిస్తే.. దాని ప్రారంభానికి కూడా చినజీయర్ కు పిలుపు లేదు. అక్కడి స్వరూపానందతోనే వారు కార్యక్రమం నడిపించారు. ఏపీ సీఎం జగన్ ను సమతామూర్తి వద్దకు ఆహ్వానించి చినజీయర్ కాస్త ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేశారు గానీ.. అవేమీ పెద్దగా ఫలితమిచ్చినట్టు లేదు. 

సమ్మక్క సారలమ్మ వివాదం గురించి వివరణ ఇచ్చినప్పుడు జీయర్ ఒక మాట అన్నారు. యాదాద్రి ప్రారంభం గురించి విలేకరులు ప్రశ్నించినప్పుడు.. ‘‘మాకేం ఆహ్వానం అందలేదు. పిలిస్తే వెళతాం. లేకుంటే చూసి ఆనందిస్తాం..’’ అని ఆయన అన్నారు. ఇప్పుడు చూడబోతే ఆయనకు అదే మిగిలినట్టుంది. 

అటు తెలంగాణలో యాదాద్రి విషయంలోనైనా, ఏపీలో టీటీడీ ఆలయం విషయంలోనైనా పిలుపు లేక, చూసి ఆనందించడం మాత్రమే ఆయన చేస్తున్నారు..! ఇదంతా కూడా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీతో అతిగా పూసుకోవడం వల్ల మాత్రమే జరుగుతోందా అనే సందేహం ప్రజలకు కలుగుతోంది. 

సమతా మూర్తి ఆవిష్కరణ అనేది ఒక రకంగా బిజెపి అనుబంధ సంస్థ కార్యక్రమం లాగా జరిగిందనే నిందలను తప్పించుకోవాలంటే.. చినజీయర్ ఏం చేసి బయటపడతారో మరి!