రాజకీయ పార్టీలకు ఎక్కడైనా రాజకీయ పార్టీలే ప్రత్యర్థులుగా ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీకి మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు. వైసీపీకి రాజకీయ ప్రత్యర్థులుగా టీడీపీ, బీజేపీ, జనసేన, వామపక్షాలున్నాయి. వీటికి తోడు ఎల్లో మీడియా అదనపు ప్రత్యర్థి. వైసీపీ ఉనికినే ఎల్లో మీడియా జీర్ణించుకోలేకపోతోంది. ఇంకా చెప్పాలంటే వైఎస్సార్ కుటుంబం ఉనికిని ఏపీ రాజకీయాల్లో ఎల్లో మీడియా భరించలేకపోతోంది.
గతంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యూహాత్మకంగా… ఆ రెండు పత్రికలంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థల రాతలపై ఎదురు దాడి చేశారు. ఆ రెండు పత్రికల విశ్వసనీయతను దెబ్బతీయడంలో వైఎస్సార్ సక్సెస్ అయ్యారు. చంద్రబాబ కరత్రాలుగా జనం వాటిని చూడడం మొదలు పెట్టారు. ఎల్లో మీడియాగా అవి స్థిరపడ్డాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ మాత్రం అవకాశం దొరికినా ఎల్లో మీడియాను దుమ్ము దులిపేందుకు వెనుకాడరు. ఇటీవల ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో టీడీపీతో పాటు ఎల్లో మీడియా సంస్థలు కూడా ప్రత్యర్థులే అని తేల్చి చెప్పారు.
ఈ నేపథ్యంలో తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎల్లో మీడియాపై ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎల్లో మీడియా గింజుకోవడంపై తన మార్క్ పంచ్‌లు విసిరారు.
“పోలవరం ఎత్తు ఇంచు కూడా తగ్గదని చెబుతున్నా పచ్చ కుల మీడియా మాత్రం గింజుకోవడం ఆపడం లేదు. టీడీపీ ఉనికి నానాటికీ తగ్గిపోతున్నదన్నదే దాని బాధ. ఆ బాధతోనే తప్పుడు కథనాలను వండి వారుస్తోంది. పచ్చకుల మీడియా రాతలను నమ్మడం జనం ఎప్పుడో మానేశారు” అంటూ అవహేళన చేశారు. కలం మీడియా కాస్త కుల మీడియాగా మారిందని వైసీపీ భావన. అదే విషయాన్ని విజయసాయిరెడ్డి వ్యక్తపరిచారు.